Overcome mental stress: మారుతున్న జీవనశైలిలో భాగంగా ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది ఒత్తిడికి లోనవుతుంటారు. ఇంటి బాధ్యతలు, ఆఫీసులో పని, ఆర్థిక సమస్యల వంటివి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అయితే ఈ ఒత్తిడి నుంచి బయటపడేందుకు కొన్ని ప్రయత్నాలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజూ కొన్ని చిట్కాలు పాటించటం వల్ల ఒత్తిడిని అధిగమించవచ్చని చెబుతున్నారు. దినచర్యలో చేసుకునే చిన్న చిన్న మార్పులతో ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించవచ్చు. ఇందుకోసం 5 చిట్కాలను నిపుణులు సూచిస్తున్నారు.
శ్వాసపై ధ్యాస: ఎంత పనిలో ఉన్నా మన కోసం మనం రోజూ కాస్త సమయం కేటాయించుకోవాలి. పనిని పక్కన పెట్టి ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని 10 నిమిషాల పాటు శ్వాసపై ధ్యాస పెట్టాలి. సుదీర్ఘంగా గాలిని పీల్చుతూ.. నెమ్మదిగా బయటకు వదలాలి. ఆ సమయంలో ఎలాంటి ఆలోచనలు చేయకుండా కేవలం శ్వాస తీసుకోవటం, వదలటంపైనే దృష్టి సారించాలి. ఇలా చేయటం వల్ల మెదడుపై ఒత్తిడి తగ్గుతుంది. ప్రశాంతంగా అనిపిస్తుంది.
శారీరక వ్యాయామం: రోజూ కాసేపు శారీరక వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. కనీసం 30 నిమిషాల నడక లేదా యోగా చేయటం వంటివి అలవాటుగా చేసుకోవాలి. శారీరక కదలికలు ఒత్తిడి కలిగించే హార్మోన్ల విడుదలను తగ్గిస్తాయి. శారీరక వ్యాయామం వల్ల ఉత్సాహంగా అనిపిస్తుంది. తద్వారా మనసు ఉల్లాసంగా మారుతుంది.
స్క్రీన్ బ్రేక్ పాటించండి: నిద్రకు ఉపక్రమించే కనీసం ఒక గంట ముందుగా టీవీ, మొబైల్, ల్యాప్‌టాప్ వంటి స్క్రీన్‌లకు దూరంగా ఉండాలి. స్క్రీన్ నుంచి వెలువడే బ్లూలైట్ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. దీంతో ఒత్తిడి పెరుగుతుంది. నిద్రపోయే ముందు మంచి పుస్తకాలు చదవటం, కుటుంబసభ్యులు, మిత్రులతో మాట్లాడటం వంటివి చేయాలి.
నిద్రకు ప్రాధాన్యత: నాణ్యమైన నిద్ర ఒత్తిడిని తగ్గించటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. నిద్రలేమి కారణంగా ఒత్తిడి, చిరాకు, ఆందోళన వంటి సమస్యలు పెరుగుతాయి. అలాకాకుండా ఉండాలంటే రోజూ 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. అంతేకాదు నిద్రకు కచ్చితమై సమయం పాటించటం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది.
నిర్మొహమాటంగా ‘నో’ చెప్పాలి: మీ శక్తికి మించి పని, బాధ్యతలను స్వీకరించటం ఒత్తిడికి కారణం అవుతుంది. మీరు స్వీకరించిన పని భారంగా అనిపించినప్పుడు సున్నితమైన పద్ధతిలో ‘నో’ చెప్పడం నేర్చుకోవాలి. మీ సమయాన్ని శక్తిని దేనికి కేటాయించాలో తెలుసుకోవటం, మీ నియంత్రణలో ఉందని భావించడం కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది.


