Saturday, November 15, 2025
Homeహెల్త్Junk Food: పిల్లలకు చిప్స్..చాక్లెట్స్ ఇస్తున్నారా..అయితే డ్రగ్స్ ఇస్తున్నట్లే..!

Junk Food: పిల్లలకు చిప్స్..చాక్లెట్స్ ఇస్తున్నారా..అయితే డ్రగ్స్ ఇస్తున్నట్లే..!

Processed Food Addiction: చిప్స్, చాక్లెట్, ఐస్‌క్రీమ్, కుకీస్ లాంటి తీపి లేదా ఉప్పగా ఉండే స్నాక్స్ తరచుగా తినేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రకమైన ప్రాసెసింగ్ ఆహారాలు మనకు లాభం చేసే కంటే, వాటికి బానిసలుగా మారే ప్రమాదం ఉందని తాజాగా ఓ అధ్యయనం చెబుతోంది. మద్యం, పొగాకు వంటివాటికి ఉన్న వ్యసన స్థాయిలోనే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా మన మెదడుపై ప్రభావం చూపుతాయంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది.

- Advertisement -

ప్రాసెస్డ్ ఆహారాల ప్రభావం..

ఈ అధ్యయనాన్ని మిచిగాన్ యూనివర్సిటీకి చెందిన న్యూరోసైంటిస్టు ఆష్లే గియర్‌హార్ట్ నేతృత్వంలో 36 దేశాల్లో నిర్వహించారు. మొత్తం 281 అధ్యయనాలను సమీక్షించి, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 14 శాతం పెద్దలు, 12 శాతం పిల్లలు ఈ ప్రాసెస్డ్ ఆహారాల ప్రభావానికి లోనవుతున్నట్లు వారు గుర్తించారు. ఇది మద్యం లేదా పొగాకు వాడకం స్థాయిలోనే ఉందని పరిశోధకులు స్పష్టంచేశారు.

ఇలాంటి ఆహారాల్లో ఎక్కువగా చక్కెర, ఉప్పు, కొవ్వులు ఉంటాయి. ఇవి మన మెదడులో రివార్డ్ సిస్టమ్‌ను ప్రేరేపిస్తాయి. ఆ అనుభూతి మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది డ్రగ్స్ లేదా ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మెదడులో జరిగే మార్పుల్లాగే ఉంటుంది. ముఖ్యంగా డోపమైన్ అనే రసాయనం విడుదలవుతుండటంతో, మనం ఆ ఆహారాన్ని మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.

ALSO READ: https://teluguprabha.net/health-fitness/side-effects-of-eating-too-many-almonds-daily-on-health/

డ్రగ్ అడిక్షన్‌కు..

ఇది క్రేవింగ్‌ను పెంచుతుంది. తినకుండా ఉండలేని పరిస్థితిని తలపిస్తుంది. తినకపోతే మానసికంగా అసహనం, ఆందోళన రావచ్చు. ఇవన్నీ ఏకంగా డ్రగ్ అడిక్షన్‌కు దగ్గరగా ఉన్న లక్షణాలు. ఇది పిల్లల్లోనూ కనిపించటం ఆందోళన కలిగించే అంశం. బాల్యంలో అలాంటి అలవాట్లు ఏర్పడితే, భవిష్యత్తులో వారి ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

ప్రాసెస్డ్ ఫుడ్స్‌పై పరిశోధకుల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కొందరు, ఆహారాన్ని డ్రగ్స్‌తో పోల్చడం సరి కాదంటున్నారు. అయితే గియర్‌హార్ట్ సహా పలువురు శాస్త్రవేత్తలు మాత్రం ఈ ఆహారాల్లోని పదార్థాలు సహజ ఆహారాల కంటే భిన్నంగా, మరింతగా ఎడిక్షన్‌ను పెంచేలా పనిచేస్తున్నాయని వాదిస్తున్నారు. ముఖ్యంగా చక్కెర, ఉప్పు, కొవ్వు మిశ్రమం మెదడులో తక్షణ ఆనందాన్ని కలిగించి, మళ్లీ మళ్లీ తినే అలవాటు చేస్తుందని అంటున్నారు.

Also Read: https://teluguprabha.net/health-fitness/cinnamon-helps-relieve-period-pain-and-hormone-imbalance/

ఈ ఫుడ్ అడిక్షన్‌కు కొన్ని మందులు ఉపయోగపడతాయని పరిశోధన సూచిస్తోంది. ఉదాహరణకు, డ్రగ్ డిపెండెన్సీ చికిత్సలో వాడే నాల్ట్రెక్సోన్, బుప్రోపియన్ వంటి మందులు కొన్ని సందర్భాల్లో ఉపశమనం ఇవ్వవచ్చని అంటున్నారు. అంతేకాక, జీఎల్‌పీ-1 అనే పేప్టైడ్ గ్రూప్‌లోని మందులు కూడా బరువు తగ్గించడంలో తోడ్పడతాయట. మన ఆహారపు అలవాట్లను మార్చేందుకు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ) వంటి మానసిక చికిత్సలు కూడా బాగా సహాయపడతాయని వారు సూచిస్తున్నారు.

మన దేశంలో ప్యాకెట్ ఫుడ్స్ వినియోగం రోజు రోజుకీ పెరుగుతోంది. ప్రత్యేకించి పట్టణ యువతలో ఇది ఒక పెద్ద అలవాటుగా మారింది. ఫాస్ట్ ఫుడ్, డ్రింక్స్, డెజర్ట్స్‌… ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటున్నారు. దీని ప్రభావంగా ఊబకాయం, టైప్-2 డయాబెటిస్, గుండె సంబంధిత రోగాలు వేగంగా పెరిగిపోతున్నాయి. అలాంటి ఆహారాలపై నియంత్రణ అవసరమని ఈ అధ్యయనం సూచిస్తోంది.

Also Read: https://teluguprabha.net/health-fitness/amazing-benefits-of-drinking-green-coffee-everyday/

ఫుడ్ ప్రొడక్టుల మీద తప్పనిసరిగా హెచ్చరికలు, పోషక విలువల లేబుల్స్ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) లాంటి సంస్థలు మార్కెటింగ్ మీద నియంత్రణ పెంచాలని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా టీవీ, సోషల్ మీడియాలో ప్రసారం అయ్యే ప్రకటనలపై మరింత నియంత్రణ అవసరం ఉంది.

ఆహారపు అలవాట్లపై..

అలానే పాఠశాల స్థాయిలోనే పిల్లలలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కలిగించాలంటున్నారు. వీటితో పాటు ప్రజల్లో ఫుడ్ అడిక్షన్ ఒక సమస్యగా గుర్తించి, అవసరమైతే చికిత్స అందించాల్సిన అవసరం ఉంది. దీనిని ఒక మానసిక ఆరోగ్య సమస్యగా గుర్తించాలన్నది కూడా ఈ అధ్యయనం కీలక సూచన.

సాధారణంగా మనం అలాంటి ఆహారాలను స్వల్పంగా తీసుకుంటే పెద్దగా నష్టం ఉండకపోవచ్చు. కానీ తరచుగా ఎక్కువగా తీసుకుంటూ అలవాటు పడితే, మన మెదడే ఆ అవసరాన్ని ఏర్పరచుకుంటుంది. అప్పుడు మనం తినడం నియంత్రించలేని స్థితికి చేరిపోతాం. ఇదే ఆహార వ్యసనం. దీన్ని సాధారణ అలవాటుగా తీసుకోకుండా, ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మొదటి అడుగు అని భావించాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad