Reasons for waking up at night : రోజంతా అలసిపోయి, ఎనిమిది గంటలు హాయిగా నిద్రపోదామని మంచం ఎక్కుతారు. కానీ, నిద్రపట్టక అటుఇటూ దొర్లుతూ, ఒకవేళ పట్టినా గంటకోసారి మెలకువ వస్తూ రాత్రంతా నరకం అనుభవిస్తున్నారా? మరుసటి రోజు ఉత్సాహం లేక, నీరసంగా గడుపుతున్నారా? అయితే మీరు ఒంటరి కాదు. ఇది కేవలం అలసట సమస్య కాదని, ‘నిద్రలేమి’ (Insomnia) అనే తీవ్రమైన రుగ్మతకు సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఈ నిద్రలేమికి కారణాలేంటి..? ఇది దీర్ఘకాలంలో ఎలాంటి ప్రమాదాలకు దారితీస్తుంది..? దీని నుంచి బయటపడే మార్గాలేంటి..?
సాధారణ సమస్య కాదు : రాత్రిళ్లు తరచుగా మేల్కోవడం, మళ్లీ నిద్రపట్టకపోవడం సాధారణ విషయం కాదని మేయోక్లినిక్ (Mayo Clinic) అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది ‘ఇన్సోమ్నియా’ అనే నిద్ర రుగ్మత లక్షణం. ఇది మన శక్తి స్థాయిని, మానసిక స్థితిని, పనితీరును, మొత్తం జీవన నాణ్యతను దెబ్బతీస్తుంది. ప్రపంచ జనాభాలో దాదాపు 10% మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని అంచనా.
దీని ప్రధాన లక్షణాలు:రాత్రిపూట ఎక్కువసేపు మెలకువతో ఉండటం.నిద్రపోవడానికి ఎక్కువ సమయం పట్టడం.చాలా త్వరగా నిద్రలేవడం, మళ్లీ నిద్రపట్టకపోవడం. పొద్దున లేచాక నిద్రపోయిన భావనే కలగకపోవడం.
కారణాల కట్టడి.. పరిష్కారం సులభం : ఈ సమస్యకు అనేక కారణాలున్నాయని, వాటిని గుర్తిస్తే పరిష్కారం సులభమని నిపుణులు చెబుతున్నారు.
వయసు: వయసు పెరిగే కొద్దీ శరీరంలోని జీవ గడియారం (సర్కాడియన్ రిథమ్)లో మార్పులు వస్తాయి. ఇది నిద్ర నాణ్యతను తగ్గించి, తరచుగా మెలకువ వచ్చేలా చేస్తుంది.
ఒత్తిడి: ఉద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యల గురించిన ఆందోళనలు మెదడును నిరంతరం చురుగ్గా ఉంచి, నిద్రకు ఆటంకం కలిగిస్తాయి.
మందులు: కొన్ని రకాల యాంటీడిప్రెసెంట్స్, బీపీ, ఉబ్బసం మందులు నిద్రకు అంతరాయం కలిగిస్తాయి. జలుబు, అలెర్జీలకు వాడే కొన్ని మందుల్లో ఉండే కెఫిన్ కూడా నిద్రను పాడుచేస్తుంది.
అనారోగ్య సమస్యలు: గ్యాస్ట్రోఇంటెస్టైనల్ రిఫ్లక్స్ డిసీజ్ (GERD – గుండెల్లో మంట), ఆర్థరైటిస్, డిప్రెషన్, మెనోపాజ్ వంటి సమస్యలు కూడా రాత్రిపూట ప్రశాంత నిద్రకు శత్రువులే.
ప్రశాంత నిద్రకు.. పది సూత్రాలు : కొన్ని జీవనశైలి మార్పుల ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
సమయపాలన: ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకుని, ఒకే సమయానికి లేవడాన్ని అలవాటు చేసుకోండి.
గది వాతావరణం: పడకగదిని చీకటిగా, నిశ్శబ్దంగా, చల్లగా ఉండేలా చూసుకోండి.
రిలాక్సేషన్: పడుకునే ముందు పుస్తకం చదవడం, ధ్యానం చేయడం, గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వంటివి అలవాటు చేసుకోండి.
స్క్రీన్లకు దూరం: నిద్రకు కనీసం గంట ముందు నుంచి ఫోన్, టీవీ, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పక్కన పెట్టేయండి.
వ్యాయామం: క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి, కానీ పడుకోవడానికి మూడు, నాలుగు గంటల ముందు మాత్రం తీవ్రమైన వ్యాయామాలు వద్దు.
కెఫిన్‌కు చెక్: సాయంత్రం వేళల్లో కాఫీ, టీ, కెఫిన్ ఉన్న శీతల పానీయాలకు దూరంగా ఉండండి.
సరైన భోజనం: నిద్రకు కనీసం రెండు గంటల ముందు భోజనం పూర్తిచేయండి.
ధూమపానానికి స్వస్తి: ధూమపానం నిద్ర నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తుంది.


