ముఖం మీద ఉండే అవాంఛిత రోమాలు తొలగించడం కోసం ఎర్ర కందిపప్పు ఫేస్ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు ముఖంపై ఉండే మచ్చలను సైతం ఈ ఫేస్ మాస్కు పోగొడుతుంది. ఎర్ర కందిపప్పు, గంధం, పొడి బత్తాయి తొక్కలను పాలల్లో నానబెట్టాలి. అవి నానిన తర్వాత వాటన్నింటినీ కలిపి మిక్సీలో వేసి మెత్తగా పేస్టులా చేయాలి. ఈ పేస్టును ముఖానికి రాసుకుని అది బాగా పొడారిపోయేవరకూ ఉంచుకోవాలి. ఆ తర్వాత నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా రెండు వారాల పాటు చేస్తూ మంచి ఫలితాన్ని చూస్తారు. చాలామంది స్త్రీలకు పెదవి పైభాగంలో మీసంలా సన్నని వెంట్రుకలు వస్తుంటాయి. దీంతో వారు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వెంట్రుకలను వాక్సింగ్ ద్వారా తొలగించుకోవాలి. అవి మళ్లా వేగంగా పెరగకుండా ఉండాలంటే పసుపు, పెరుగు, బియ్యప్పిండి మూడింటినీ కలిపి ఫేస్ ప్యాక్ లా తయారుచేసి ముఖానికి, పెదవుల పైభాగంలో రాసుకోవాలి. పదిహేను నిమిషాలు అలాగే ఉంచుకున్న తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే అవాంఛిత రోమాలు తగ్గడంతో పాటు చర్మం మెరుపును సంతరించుకుంటుంది.
ముఖం, శరీరంపై ఉండే అవాంఛిత రోమాలు పోవడానికి ఇంకొక టిప్పు ఉంది. అదేమిటంటే కొన్ని పచ్చి బొప్పాయి ముక్కలను తీసుకుని చిక్కటి జ్యూసులా చేసి అందులో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల పసుపు వేసి మెత్తటి పేస్టులా చేయాలి. దాన్ని ముఖానికి, శరీరానికి బాగా పట్టించి అది ఆరిపోయే వరకూ అంటే పదిహేను ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా రెండు లేదా మూడు నెలలుపాటు ప్రతి వారం లేదా రెండు వారాలకొకసారి ముఖానికి, శరీరానికి పట్టించడం వల్ల మంచి ఫలితం చూస్తారు. శరీరంపై ఉండే అవాంఛిత రోమాలను శాశ్వతంగా పోగొట్టే ఒక నేచురల్ చిట్కా ఉంది. ఒక గుడ్డు తీసుకుని అందులోని తెల్లసొనను విడిగా తీసి అందులో ఒక టీస్పూను కార్న్ స్టార్చ్, చక్కెర వేసి ఆ మిశ్రమాన్ని చిక్కటి పేస్టులా చేయాలి. ఆ పేస్టును చేతులకు, కాళ్లకు పట్టించి అరగంట వరకూ అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల చర్మం గట్టిగా అవుతుంది. తర్వాత దాన్ని నీళ్లతో కడిగి చర్మం పొడిగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల కాళ్లు, చేతులపై ఉండే అవాంఛిత రోమాలు పూర్తిగా పోతాయి.
ఇలాంటి మరో నేచురల్ టిప్ కూడా ఉంది. అదేమిటంటే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ లో ఒక టేబుల్ స్పూను పసుపు వేసి కాసిని నీళ్లు పోసి కలిపి పేస్టులా చేయాలి. దీన్ని కాళ్లు, చేతుల మీద అప్లై చేసి ఇరవై నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చటి నీళ్లతో శుభ్రంగా కడిగి పొడిగా చర్మం ఉండేలా చూసుకోవాలి. ఇవే కాకుండా వేడి ఆయిల్ మసాజ్ వల్ల కూడా శరీరంపై ఉండే అవాంఛిత రోమాలు తొలగించుకోవచ్చు. ఆముదం లేదా కొబ్బరినూనె లేదా ఆవాల నూనె, టీ ట్రీ ఆయిల్, ఆలివ్ ఆయుల్, నువ్వుల నూనె వీటిలో ఏదో ఒక దానిని తీసుకుని వేడి చేసి ఆ నూనెతో శరీరంపై మసాజ్ చేస్తే శరీరంపై ఉండే అవాంఛిత రోమాలు తగ్గుతాయి. హాట్ ఆయిల్ మసాజ్ ను తరచూ చర్మానికి చేయడం వల్ల చర్మంపై ఉండే అవాంఛిత రోమాలు తగ్గి మెల్లగా కనిపించకుండా పోతాయి. వెల్లుల్లి రసం కూడా అవాంఛిత రోమాలను తొలగించడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. కొన్ని వెల్లుల్లిపాయలను తీసుకుని వాటిని మెత్తగా చేసి జ్యూసు తీయాలి. అందులో కాటన్ బాల్ ముంచి అవాంఛిత రోమాలు ఉన్న ప్రదేశంలో అప్లై చేసి ఆరేంతవరకూ అంటే ఇరవై నిమిషాలు దాన్ని అలాగే ఉంచుకుని ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ఆ ప్రదేశాన్ని కడుక్కోవాలి. తర్వాత చర్మంపై నిత్యం మీరు వాడే మాయిశ్చరైజర్ ని రాయాలి. ఇలా చేయడం వల్ల వెల్లుల్లి రసం వాసన పోతుంది. ఇలా వెల్లుల్లిరసంతో అవాంఛిత రోమాలను
శాశ్వతంగా పోగొట్టవచ్చు.
ఛమొమైల్ టీ కూడా అవాంఛిత రోమాలు పోగొట్టడంలో బాగా పనిచేస్తుంది. రెండు ఛమొమైల్ టీ బ్యాగులు తీసుకుని కొన్ని నిమిషాలు వాటిని ఉడకనిచ్చిన తర్వాత చల్లారనివ్వాలి. ఆ తర్వాత అవాంఛిత రోమాలు ఉన్న చోట దాన్ని అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా కొన్నినెలలపాటు ప్రతి వారం చేయాలి. ఇలా చేస్తే అవాంఛిత రోమాలు మెల్లగా అద్రుశ్యం అవుతాయి. మెంతులను నానబెట్టి పేస్టులా చేసి దాన్ని అవాంఛిత రోమాలు ఉన్న ప్రదేశంలో రాసి అరిపోయేవరకూ అలాగే ఉంచాలి. ఇలా తరచూ చేయడం వల్ల అవాంఛిత రోమాలు శాశ్వతంగా పోతాయి. ఈ పద్ధతులన్నీనేచురల్ పద్ధతులైనా చర్మంపై అప్లై చేసే ముందు ప్యాచ్ టెస్టు తప్పనిసరిగా చేసుకోవాలి. కొంతమందికి స్కిన్ ఎలర్జీలు ఉంటాయి కాబట్టి ఈ జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాలి.
అలాగే ముఖంపై ఉండే నల్లటి మచ్చలు పోవాలంటే ఉల్లిపాయ తొక్కను నల్లటి మచ్చలున్న చోట రుద్దితే మంచి ఫలితం ఉంటుంది. దీనికి మరో చిట్కా కూడా ఉంది. బంగాళాదుంప తురుముకు ఒక టేబుల్ స్పూను నిమ్మరసం లేదా పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంటపాటు ఉంచుకుని ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. మరో టిప్పు ఏమిటంటే ఒక టేబుల్ స్పూను పసుపు, ఒక టేబుల్ స్పూను కొబ్బరినూనె, టీస్పూన్ తేనె మూడింటినీ కలిపి మెత్తటి పేస్టులా చేసి దాన్ని ముఖానికి పట్టించి కాసేపు ఉంచుకోవాలి. అది ఆరిన తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా చేస్తే చర్మం ఎంతో ఆరోగ్యకరంగా, కాంతివంతంగా తయారవుతుంది.