ప్రస్తుతం ఆధునిక జీవనశైలిలో యువత ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో ఊబకాయం (Obesity) ఒకటి. ఇది కేవలం శారీరక సమస్యగానే కాకుండా, మానసిక, సామాజిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. మన దేశంలో కూడా గత కొన్నేళ్లుగా ఊబకాయం సమస్య పెరగడం మరింత ఆందోళనకరంగా మారింది. అధిక కొవ్వులు, చక్కెరలు, ప్రాసెస్డ్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం. స్మార్ట్‌ఫోన్లు, వీడియో గేమ్స్, టీవీ వంటి సాంకేతిక వనరుల వల్ల శారీరక శ్రమ తగ్గిపోవడం ఊబకాయానికి కారణం అవుతోంది.
ఇక ప్రతి సంవత్సరం కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. ఊబకాయాన్ని అదుపులో ఉంచాలంటే ఆహారంలో నూనె వినియోగాన్ని తగ్గించడం నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వంట నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. అయితే మనం వంటలకు వినియోగించే అన్ని నూనెలు ఆరోగ్యానికి మేలు చేయవు. అయితే ఏ వంట నూనె మంచిది.. వంట నూనెల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఆహారంలో ఉపయోగించే నూనెను ఎంత పరిమాణంలో తీసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రస్తుతం ప్రతి 8 మందిలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇటీవల కాలంలో ఊబకాయం కేసులు రెట్టింపు అయ్యాయి. ఇంకా ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. ఈ సమస్య పిల్లలలో నాలుగు రెట్లు పెరిగింది. అధిక బరువు లేదా ఊబకాయం ఉండటం వల్ల అనేక సమస్యలు, వ్యాధులు వస్తున్నాయి. అందుకే ఊబకాయాన్ని నియంత్రించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వంట కోసం ఉపయోగించే నూనెలపై తగిన శ్రద్ధ పెట్టాలని చెబుతున్నారు. వంట నూనె కొనేటప్పుడు ఆరోగ్యానికి మేలు చేసే వాటిని మాత్రమే జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని చెబుతున్నారు. ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా.. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు అంటున్నారు.
అవకాడో ఆయిల్, బాదం-సీడ్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ ఆరోగ్యానికి ఉత్తమమైనవని చెబుతున్నారు. వీటిలో మోనోఅన్‌శాచురేటెడ్, ఒలీక్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి బరువు తగ్గించడంలో సహాయపడతాయంట. ఏ నూనె అయినా మితంగా తింటే ఆరోగ్యానికి మంచిది. అధిక నూనె తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా అనారోగ్యకరమైన నూనెలను అధికంగా తీసుకోవడం వల్ల అధిక బరువు, ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, అధిక రక్తపోటు, అసాధారణ లిపిడ్ స్థాయిలు, గుండెపోటు, స్ట్రోక్, కొన్ని క్యాన్సర్లు, అకాల మరణం వంటి ప్రమాదాలు పెరుగుతాయని అంటున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 ప్రకారం అఖిల భారత స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో ఊబకాయం గణనీయంగా పెరుగుతున్నట్లు నిర్ధారించింది.