ఆరోగ్యంగా ఉండాలంటే వాకింగ్ చేయడం ఒక మంచి అలవాటు. రోజూ ఉదయం ఓ గంటసేపు నడవడం వల్ల శరీరానికి, మనసుకు ఎంతో మేలు కలుగుతుంది. బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రక్త ప్రసరణను సవ్యంగా ఉంచడానికి వాకింగ్ అత్యుత్తమమైన వ్యాయామం. అయితే చాలామంది వాకింగ్ చేస్తున్నప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తారు. అవి గుండెపోటు, కండరాల ఒత్తిడి, శరీర ఉబ్బరం వంటి సమస్యలను తెచ్చి పెట్టే అవకాశం ఉంది. కాబట్టి వాకింగ్ చేసేటప్పుడు చేయకూడని పనుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
వాకింగ్ చేసేటప్పుడు చేసే పొరపాట్లు:
వాకింగ్ వేగం సరైనదిగా ఉండాలి. చాలా నెమ్మదిగా నడవడం వల్ల శరీరానికి సరిపడా వ్యాయామం కాకపోవచ్చు. అలాగే అధిక వేగంతో నడిస్తే గుండెపై ఒత్తిడి పెరిగి శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే సరైన వేగంతో నడవడం ఉత్తమం. అలాగే వాకింగ్‌కు ముందు, తర్వాత తప్పనిసరిగా వార్మప్ చేయాలి. ఒక్కసారిగా నడక ప్రారంభిస్తే కండరాలపై ఒత్తిడి పడుతుంది. హృదయ స్పందన రేటు అకస్మాత్తుగా పెరిగి, శరీరంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. కనుక, 5-10 నిమిషాలు తేలికపాటి స్ట్రెచింగ్ చేసిన తర్వాతే నడక ప్రారంభించాలి.
ఇక వాకింగ్ సమయంలో శరీర భంగిమ కూడా చాలా ముఖ్యమైనది. ముందు వంగి నడవడం, కొందరు ముందుకు పడిపోయేలా నడవడం శ్వాసక్రియపై ప్రభావం చూపుతుంది. నిటారుగా నిలబడి, భుజాలను వదిలి, చేతులను సరైన విధంగా ఊపుతూ నడవడం శ్రేయస్కరం. దీనితో పాటు వాకింగ్ చేసేటప్పుడు శరీరంలో నీటి స్థాయిని సమతుల్యం ఉంచుకోవాలి. నిర్జలీకరణం వల్ల రక్తం మందగించి గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా వేసవిలో తగినంత నీరు తాగకుండా నడవడం హానికరం. కాబట్టి వాకింగ్‌కు ముందు మరియు తర్వాత నీరు తాగడం అలవాటు చేసుకోవాలి.
వాకింగ్‌కు ముందు ఎక్కువగా తినడం మంచిది కాదు. కడుపునిండా తిన్న తర్వాత నడిస్తే, జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. దాంతో గుండె పనితీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది. తేలికపాటి ఆహారం తీసుకోవడం ఉత్తమం. ఉదాహరణకు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటి తేలికపాటి ఆహారాలు తీసుకోవచ్చు. ఇక రద్దీగా ఉండే ప్రాంతాల్లో, పొగ, ధూళి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో నడవడం ఊపిరితిత్తులకు హానికరం. ఇది గుండె పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. అందువల్ల, పార్కులు, వాహనాలు తిరగని ప్రదేశాలు, ప్రకృతి రమణీయమైన ప్రదేశాల్లో వాకింగ్ చేయడం ఉత్తమం.
వాకింగ్ ఆరోగ్యానికి మంచిదే కానీ, శరీరాన్ని అతిగా శ్రమ పెట్టడం మంచిది కాదు. ఎక్కువ నడిస్తే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. తల తిరగడం, ఛాతీ నొప్పి అనిపించినప్పుడు వెంటనే విశ్రాంతి తీసుకోవాలి. ఇక రోజూ ఒకే సమయానికి వాకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిది. ఒకరోజు ఎక్కువ, మరొకరోజు తక్కువగా నడవడం కంటే ప్రతి రోజు 30-40 నిమిషాల పాటు క్రమబద్ధంగా నడవడం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
వాకింగ్ అనేది ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సరళమైన, శక్తివంతమైన వ్యాయామం. అయితే దాన్ని సరైన విధంగా చేయకపోతే, ఆశించిన ప్రయోజనాలు పొందలేం. కాబట్టి వాకింగ్‌లో ఈ తప్పులను నివారించి, దైనందిన జీవితంలో దీన్ని ఒక ఆరోగ్యకరమైన అలవాటుగా మార్చుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే, క్రమం తప్పకుండా సరైన విధంగా వాకింగ్ చేయండి. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు.)