మనం తీసుకునే డైట్, జీవనశైలి, తీసుకునే జాగ్రత్తల మీద మన శిరోజాల సంరక్షణ ఆధారపడి ఉంది. అలాగే పర్యావరణం, రకరకాల ఒత్తిడులు కూడా మన శిరోజాల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. వీటి నుంచి జుట్టు సంరక్షించేందుకు రకరకాల హెయిర్ కేర్ పద్ధతులను అనుసరిస్తుంటాం. ఎంతో ఖరీదైన హెయిర్ కేర్ ఉత్పత్తులను వాడుతుంటాం. నిజానికి ఎక్కువ డబ్బు వెచ్చించకుండా…. హెయిర్ కేర్ ప్రొడక్టులు కొనకుండా చాలా తక్కువ ఖర్చుతో కూడిన హెయిర్ కేర్ సీక్రెట్ ఒకటి ఉంది. అదే అరటిపండు.
అరటిపండులో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి. విటమిన్లు ఉన్నాయి. మెగ్నీషియం, మాంగనీసు, పొటాషియంలు ఉన్నాయి. ఇవి దెబ్బతిన్న శిరోజాలను సంరక్షిస్తాయి. అందంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అరటిపండుతో తయారుచేసే హెయిర్ మాస్కు సహజసిద్ధమైన సూపర్ కండిషనర్ గా పనిచేస్తుందని శిరోజాల నిపుణులు అంటారు. అరటిపండు మాస్కు జుట్టును నిగనిగ మెరిసేలా చేయడమే కాదు సిల్కీగా ఉండేట్టు చేస్తుంది. ఇందులోని యాంటీమైక్రోబియల్ గుణాల వల్ల శిరోజాలు చుండ్రు బారినపడకుండా సంరక్షిస్తుంది కూడా.
ఆరోగ్యమైన వెంట్రుకల కోసం అరటిపండుతో చేసే కొన్ని రకాల హెయిర్ మాస్కులన్నాయి. ఒక సింపుల్ హెయిర్ మాస్కు ఏమిటంటే ఒక అరటిపండు, ఒక టీస్పూన్ అలొవిరా జల్, ఒక టీస్పూను ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. ఈ మూడింటినీ కలిపి మెత్తగా పేస్టులా చేయాలి. ఈ పేస్టును శిరోజాలకు బాగా అంటేట్టు పట్టించి 20 నుంచి 30 నిమిషాల పాటు వదిలేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శిరోజాలను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా ప్రతి పదిహేను రోజులకొకసారి ఈ మాస్కును శిరోజాలకు పెట్టుకుంటే వెంట్రుకలు నిగనిగలాడడమే కాకుండా చుండ్రువంటి ఎన్నో శిరోజాల సమస్యలు పోతాయి.
జుట్టు బిరుసెక్కి,పీచులా ఉంటే, పొడిబారినట్టు ఉంటే అందుకు అరటిపండుతో చేసే మరో హెయిర్ మాస్కు ఉంది . అదేమిటంటే ఒక టేబుల్ స్పూన్ కండిషనర్, మెత్తగా చేసిన సగం అరటిపండు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, రెండు లేదా మూడు చుక్కల లవండర్ ఎసెన్షియల్ ఆయిల్ వీటన్నింటినీ కలిపి హెయిర్ మాస్కు తయారుచేయాలి. దీన్ని తలకు పట్టించుకుని 20 నిమిషాలు అలాగే ఉంచుకుని ఆ తర్వాత నీళ్లతో శుభ్రంగా జుట్టును కడుక్కోవాలి. ఇలా చేస్తే వెంట్రుకలు నిగనిగ లాడుతూ, ఎంతో సిల్కీగా ఉంటాయి.
అరటిపండుతో చేసే మరో హెయిర్ మాస్కు కూడా ఉంది. ఇందులో బాగా పండిన అరటి పండు ఒకటి, అలాగే పండిన ఒక అవకెడో, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ ఈ మూడింటినీ కలిపి పేస్టులా చేసి ఆ మాస్కును మాడుకు, వెంట్రుకలకు బాగా పట్టించి పదిహేను నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటినీళ్లతో తలను, వెంట్రుకలను శుభ్రంగా కడుక్కోవాలి. వెంట్రుకలు ఆరిన తర్వాత సిల్కులా మెరిసిపోతూ ఎంతో అందంగా ఉంటాయి.