వేసవి అనగానే వెంటనే పుచ్చకాయ గుర్తుకువస్తుంది. ఎండవేడిలో తిరుగేవాళ్లకు పుచ్చకాయముక్కలు దాహాన్ని తీర్చడమే కాదు శరీరాన్ని బాగా హైడ్రేట్ చేస్తాయి. అంతేకాదు ఈ పండులో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో పోషకవిలువలు కూడా ఉన్నాయి. అలాంటి పుచ్చకాయలో బ్యూటీ సీక్రెట్స్ కూడా దాగున్నాయని మీకు తెలుసా? ముఖ్యంగా మీ చర్మాన్ని ఇది పట్టులా మ్రుదువుగా ఉంచుతుంది. కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది.
పుచ్చకాయలో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని ముడతలు పడనివ్వదు. ముఖంపై ఫైన్ లైన్స్ ఏర్పడనివ్వదు. వయసు కనిపించకుండా చర్మాన్ని ఎంతో యంగ్ గా ఉంచుతుంది. ఇందులోని విటమిన్ ఎ చర్మంపై ఉండే రంధ్రాలు పెద్దవి కాకుండా తగ్గిస్తుంది. దీంతో చర్మంలోని సహజసిద్ధమైన తైలాలను కోల్పోము. పుచ్చకాయలో 92 శాతం నీళ్లు ఉంటాయి. అందుకే దీని ముక్కలు తినడం వల్ల శరీరానికి కావలసినంత నీరు అంది శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంటుంది. అంతేకాదు ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఈ పండు తినడం వల్ల శరీరంలో కొల్లాజెన్ బాగా ఉత్పత్తి అవుతుంది. దీంతో చర్మం బిగువుగా ఉండడంతో పాటు యంగ్ లుక్ కలిగిఉంటుంది.
ఈ పండులో కాలరీలు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి శరీరానికి ఎలాంటి హాని తలెత్తదు. బరువు పెరగకుండా మంచి ఆక్రుతిని సైతం కలిగి ఉంటారు. అంతేకాదు శరీరంలోని మలినాలను బయటకు పోగొట్టే సహజగుణం ఈ పండులో ఉంది. అంతేకాదు జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. దీంతో చర్మం కాంతివంతంగా, ఆరోగ్యవంతంగా తయారవుతుంది.చర్మంలో తేమ గుణాన్నిఇది పెంచుతుంది. చర్మంపై తలెత్తే యాక్నేను కూడా ఇది నివారిస్తుంది. సూర్యకిరణాల కారణంగా చర్మం దెబ్బతినడం తెలిసిందే. దాని నుంచి మీ చర్మాన్ని పుచ్చకాయరసం రక్షిస్తుంది. అందుకే నిత్యం మీరు చేసుకునే బ్యూటీ రెజీమ్ లో పుచ్చకాయను తప్పనిసరిగా చేర్చండి.
పుచ్చకాయ రసాన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత వేడి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం శుభ్రంగా ఉండడంతో పాటు తాజాదనంతో మెరిసిపోతుంది. చర్మంపై తెరుచుకున్న రంధ్రాలను తగ్గించాలంటే మెత్తగా చేసిన పుదీనా ఆకుల్ని పుచ్చకాయరసంలో కలపాలి. ఆ రసాన్ని ఐస్ ట్రేస్ లో పోసి ఫ్రీజర్ లో ఉంచి క్యూబ్స్ లా చేసుకోవాలి. వాటితో చర్మంపై సున్నితంగా మర్దనా చేస్తే చర్మ రంధ్రాలు వెంబ తగ్గుతుంది. చర్మానికి ఎంతో సాంత్వన కూడా లభిస్తుంది. చర్మం మెరుస్తుండాలంటే కప్పు పుచ్చకాయముక్కలను తీసుకుని మెత్తగా చేసి దాన్ని ముఖానికి రాసుకుని పదినిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా చేస్తే చర్మం కాంతివంతంగా తయారవుతుంది.అంతేకాదు చర్మంపై ఉండే మ్రుతకణాలను కూడా ఇది పోగొడుతుంది.
మెత్తగా చేసిన పుచ్చకాయముక్కల్లో పెరుగు (జిడ్డుచర్మం ఉన్నవారు) లేదా అరటిపండు గుజ్జు (పొడిచర్మం ఉన్నవారు)కలిపి ముఖానికి రాసుకుంటే చర్మంపై మంచి ఎక్స్ ఫొయిలేటర్ గా పనిచేస్తుంది. సహజసిద్ధమైన స్కిన్ టోనర్ గా కూడా పుచ్చకాయ వండర్స్ స్రుష్టిస్తుంది. పొడిచర్మం ఉన్నవారు పుచ్చకాయ జ్యూసులో కొద్దిగా తేనె కలిపి దాన్ని చర్మానికి పట్టిస్తే చర్మంపై టోనింగ్ ఎఫెక్టు కనిపిస్తుంది. పుచ్చకాయముక్కలను నేచురల్ స్క్రబ్ గా కూడా వాడొచ్చు.
ఒక కప్పు పుచ్చకాయగుజ్జులో చక్కెర కలిపి బ్లెండర్ లోవేసి పేస్టులా చేయాలి. అందులో నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని గాలి చొరబడని సీసాలో పోసి ఫ్రిజ్ లో భద్రపరచాలి. ఈ మిశ్రమం వారం రోజుల పాటు నిలవ ఉంటుంది. దీంతో చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై మలినాలు పోయి మెరుస్తుంది. పుచ్చకాయ గుజ్జులో కాస్త సెనగపిండి కలిపి కూడా స్క్రబ్ తయారుచేసుకోవచ్చు. పుచ్చకాయతో ఫేస్ మాస్కులు కూడా చేసుకోవచ్చు. ఈ ఫేస్ మాస్కు చర్మాన్ని మ్రుదువుగా, పట్టులా కనిపించేలా చేస్తుంది. పుచ్చకాయ గుజ్జు, కీరకాయ గుజ్జు సమపాళ్లల్లో తీసుకుని రెండింటినీ బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖంపై, మెడ భాగంలో రాయాలి. అలా రాసుకున్న తర్వాత 20 నిమిషాల సేపు అలాగే ఉంచుకుని ఆ తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఈ ఫేస్ ప్యాక్ సన్ బర్న్స్ ను తగ్గిస్తాయి. చర్మంపై ఉండే ట్యాన్ ను నివారిస్తుంది. వేసవి కాలంలో పాదాలపై ఉండే చర్మం దెబ్బతినకుండా ఉండడానికి పెడిక్యూర్ కోసం కూడా పుచ్చకాయను వాడొచ్చు.
వేసవికాలంలో ఇది పాదాలపై ఎంతో బాగా పనిచేస్తుంది. అరకప్పు పుచ్చకాయముక్కలను తీసుకుని మెత్తగా చేయాలి. దాని నుంచి రసాన్ని పిండి ఒక కప్పులో పోయాలి. ఒక టీస్పూను బాదంపప్పుల పొడి, పావు కప్పు పెరుగు ఆ పుచ్చకాయ రసంలో పోసి పేస్టులా చేయాలి. ఆ పేస్టును పాదాలపై వేళ్లతో వ్రుత్తాకారంలో మర్దనా చేస్తూ రాయాలి. ఆ తర్వాత టిష్యూ పేపర్ తో పాదాలను తుడిచి నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా చేస్తే పాదాలు నాజూగ్గా, కాంతివంతంగా తయారయి చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తాయి.