బరువు తగ్గించే ఇంజెక్షన్లు..
పీసీఓఎస్‌కు పరిష్కారం కాదు
వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలి.. సొంత వైద్యం ప్రమాదకరం
చికిత్స ఆపితే మళ్లీ బరువు పెరిగే అవకాశం
గర్భధారణకు ప్రణాళిక ఉంటే ముందుగానే వైద్యులను సంప్రదించాలి
న్యూఢిల్లీ, నవంబర్ 1: బరువు తగ్గించే ఇంజెక్షన్లు పీసీఓఎస్ (పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) బాధితుల్లో అధిక బరువు, జీవక్రియ సమస్యలను నియంత్రించేందుకు కొంతవరకు తోడ్పడవచ్చు. అయితే ఇవి హార్మోన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం కావని, వైద్యుల పర్యవేక్షణ లేకుండా వాడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహిళల ఆరోగ్య పరిస్థితి, లక్షణాలు, సంతాన ప్రణాళికను బట్టి చికిత్స నిర్ణయించాలని సూచిస్తున్నారు. జీఎల్‌పీ-1 తరగతి మందులు ఆకలి, రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి. సెమాగ్లుటైడ్, లిరాగ్లుటైడ్ వంటి మందులను అధిక బరువున్న కొందరు పీసీఓఎస్ బాధితులకు జీవనశైలి మార్పులతో కలిపి వైద్యులు సూచించవచ్చని 2023 అంతర్జాతీయ మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. అయితే పీసీఓఎస్ ఉందన్న కారణంతోనే ప్రతి మహిళకు ఈ మందులు అవసరం లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. బరువు తగ్గడం వల్ల కొందరిలో నెలసరి క్రమబద్ధత, జీవక్రియ ఆరోగ్యం మెరుగుపడవచ్చని, అంతమాత్రాన పీసీఓఎస్ పూర్తిగా నయమైనట్లు కాదని బ్లూమ్ ఐవీఎఫ్ గ్రూప్ వైద్య డైరెక్టర్ డాక్టర్ హృషీకేశ్ పై తెలిపారు. మందులు సూచించే ముందు బరువు, రక్తంలో చక్కెర, ఇన్సులిన్ నిరోధకత తదితర అంశాలను పరిశీలించాలని బెంగళూరుకు చెందిన ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ కునాల్ గుప్తా సూచించారు.
చికిత్స ఆపితే మళ్లీ బరువు పెరిగే అవకాశం
జీఎల్‌పీ-1 మందులు నిలిపివేసిన తర్వాత ఆకలిని తగ్గించే ప్రభావం తగ్గడంతో తిరిగి బరువు పెరగవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వికారం, వాంతులు, విరేచనాలు, మలబద్ధకం వంటి దుష్ప్రభావాలతోపాటు కొందరిలో పిత్తాశయ సమస్యలు, ప్యాంక్రియాస్ వాపు కూడా రావచ్చని గురుగ్రామ్ వైద్యురాలు డాక్టర్ నేహల్ ధడుక్ తెలిపారు. మందులను సొంతంగా ఆపడం, మళ్లీ ప్రారంభించడం చేయకూడదని సూచించారు.
గర్భధారణకు ముందు వైద్యుల సలహా తప్పనిసరి
గర్భధారణకు ప్రణాళిక వేసుకుంటున్న మహిళలు ఈ మందులు వాడే ముందు వైద్యులను సంప్రదించాలని ఢిల్లీ గైనకాలజిస్ట్ డాక్టర్ మేఘా మిట్టల్ తెలిపారు. సెమాగ్లుటైడ్ వాడుతున్నవారు గర్భధారణకు ప్రయత్నించడానికి కనీసం రెండు నెలల ముందే దాన్ని నిలిపివేయాలని సూచించారు. పీసీఓఎస్ చికిత్సలో బరువు తగ్గడమే కాకుండా నెలసరి ఆరోగ్యం, సంతాన ప్రణాళిక, మానసిక ఆరోగ్యం, మధుమేహ ముప్పునూ పరిగణనలోకి తీసుకోవాలి. అవసరాన్ని బట్టి జీవనశైలి మార్పులు, హార్మోన్ల గర్భనిరోధకాలు, మెట్ఫార్మిన్, సంతాన సాఫల్య చికిత్సలను వైద్యులు సూచించవచ్చు. వేగంగా బరువు తగ్గడం కంటే దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా చికిత్స ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

