Salt Benefits: మన రోజువారీ ఆహారంలో ఉప్పు చాలా ప్రాధాన్యమైన పదార్థం. అది రుచికోసం మాత్రమే కాకుండా శరీరం సరిగ్గా పనిచేయడానికి కూడా అవసరం. ప్రతి రోజు మనం తినే దాదాపు అన్ని వంటకాలలో కొద్దిగా ఉప్పు ఉంటుంది. కానీ, ఆ ఉప్పును పూర్తిగా ఆహారంలోనుంచి తీసేసినప్పుడు శరీరం ఎలా స్పందిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా?
సోడియం, క్లోరైడ్..
ఉప్పులో ఉండే సోడియం, క్లోరైడ్ అనే ఖనిజాలు మన శరీరానికి చాలా అవసరమైనవి. సోడియం శరీర ద్రవాల సమతుల్యతను కాపాడటంలో, రక్తపోటును నియంత్రించడంలో, నరాల సంకేతాలను సరిగ్గా పంపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అదే విధంగా, క్లోరైడ్ జీర్ణక్రియకు అవసరమైన కడుపు ఆమ్లం తయారీలో సహాయపడుతుంది. ఈ రెండు పదార్థాలు సరిగా లేనప్పుడు శరీరంలో సమతుల్యత దెబ్బతింటుంది.
సోడియం తగ్గిపోవడంతో..
ఒక వ్యక్తి ఒక నెల పాటు ఉప్పు తినకుండా ఉంటే మొదటగా కనిపించే మార్పు అలసట. శరీరంలో సోడియం తగ్గిపోవడంతో శక్తి స్థాయి తగ్గుతుంది. రోజువారీ పనులు చేయడంలో ఇబ్బంది అనిపిస్తుంది. కొంతసేపు నడిచినా లేదా చిన్న పనులు చేసినా అలసట ఎక్కువగా అనిపించవచ్చు. దీని కారణంగా శరీరం బలహీనంగా మారుతుంది.
తలతిరగడం, బలహీనత…
తదుపరి ప్రభావం రక్తపోటుపై ఉంటుంది. సోడియం తక్కువగా ఉన్నప్పుడు రక్తపోటు సాధారణ స్థాయి కంటే పడిపోతుంది. దీనివల్ల తలతిరగడం, బలహీనత, ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు రక్తప్రసరణ సరిగ్గా జరగక మూర్ఛ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.
కండరాలపై కూడా…
ఉప్పు లేకపోవడం కండరాలపై కూడా ప్రభావం చూపుతుంది. చెమట ద్వారా శరీరం సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లు కోల్పోతుంది. ఆ లోటును భర్తీ చేయకపోతే కండరాలు బిగుసుకోవడం, తిమ్మిరి, నొప్పి వంటి సమస్యలు రావచ్చు. వ్యాయామం చేసే వారు లేదా ఎక్కువగా శారీరక శ్రమ చేసే వారు ఈ ప్రభావాన్ని ఎక్కువగా అనుభవిస్తారు.
మెదడు, నాడీ వ్యవస్థకూ…
మెదడు, నాడీ వ్యవస్థకూ ఉప్పు లోపం ప్రభావం చూపుతుంది. సోడియం లేకపోవడం వల్ల నరాలు మెదడుకు సందేశాలు సరిగ్గా పంపలేవు. దీని వలన వ్యక్తికి మగత, గందరగోళం, దృష్టి కేంద్రీకరణలో సమస్యలు కలుగుతాయి. దీర్ఘకాలంగా ఈ పరిస్థితి కొనసాగితే నాడీ వ్యవస్థ పనితీరులో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది.
జీర్ణవ్యవస్థ కూడా…
జీర్ణవ్యవస్థ కూడా ఉప్పు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతుంది. క్లోరైడ్ లేకుండా కడుపులో ఆమ్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. దీని వలన జీర్ణక్రియ సరిగా జరగదు. గ్యాస్, అజీర్ణం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు తరచుగా ఎదురవుతాయి.
అయితే, ఉప్పును పూర్తిగా మానేయడం అవసరమా అనే ప్రశ్నకు సమాధానం ఏంటంటే.. అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటు లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాతో ఉప్పు తీసుకోవడం తగ్గించవచ్చు. కానీ పూర్తిగా మానేయడం హానికరమని వారు హెచ్చరిస్తున్నారు.
ఎక్కువ ఉప్పు…
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్గదర్శకాల ప్రకారం, ఆరోగ్యకరమైన వయోజనుడు రోజుకు ఐదు గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు. అంటే ఒక టీస్పూన్ కంటే ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. కానీ దానిని పూర్తిగా ఆపడం కూడా శరీరానికి నష్టం చేస్తుంది.
ఎలక్ట్రోలైట్ అసమతుల్యత…
ఉప్పు లేకుండా తినే ఆహారం తాత్కాలికంగా శరీరాన్ని శుభ్రపరచడానికి (డీటాక్స్) ఉపయోగపడొచ్చు. కానీ దీన్ని ఎక్కువకాలం కొనసాగిస్తే ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడి శరీరానికి హానికరం అవుతుంది. కాబట్టి, మీరు ఉప్పు తీసుకోవడం తగ్గించాలనుకుంటే, దానికి బదులుగా సోడియం ఉన్న సహజ ఆహారాలను తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు, పుచ్చకాయలు, నారింజలు, పెరుగు, మజ్జిగ వంటి వాటి ద్వారా సహజ సోడియం శరీరానికి అందుతుంది.
గుండె సమస్యలకు..
ఉప్పు ఎక్కువగా తినడం రక్తపోటు, గుండె సమస్యలకు కారణమవుతుందనే విషయం తెలిసిందే. కానీ అదే ఉప్పును పూర్తిగా మానేయడం కూడా సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి మితంగా తీసుకోవడం అత్యవసరం.


