ఇలా చేస్తే ఆరోగ్యం బాగుంటుందని నిపుణులైన న్యూట్రిషనిస్టులు చెబుతుంటారు. మీరు కూడా ఆరోగ్యకరమైన కొన్ని అలవాట్లు అలవాటు చేసుకోవాలి.
ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటాం. మరి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి శరీర అలవాట్లు ఉండాలి. అవి..పోషకాహారం తీసుకోవాలి. వారానికి ఒకరోజైనా పండ్లు తినాలి. మాంసం, కొవ్వు పదార్థాలున్న ఆహారాలు తరచూ తింటే శరీరంలో బాగా కొవ్వు చేరడంతోపాటు ఊబకాయం కూడా వస్తుంది. కాబట్టి వాటిని మితంగా తీసుకోవడం మంచిది. ఉప్పు, పంచదార, కాఫీ, టీ, అలాగే ఆల్కహాల్, సిగరెట్లు శరీరంలో శక్తిని హరిస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.
బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరిగా తీసుకోవాలి. భోజనం తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి.
శరీరం అలసటకకు గురికాకుండా ఉండాలంటే నీళ్లు బాగా తాగుతుండాలి. నీళ్లు తక్కువ తాగితే మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి. తినే ఆహారాన్ని బాగా నమలాలి. నమలకుండా తింటే అజీర్తి, కడుపు ఉబ్బరం, త్రేన్పులు వస్తాయి.
మనం తినే పళ్లు, కూరగాయలను బాగా కడిగి తినాలి. లేకపోతే వాటిపై అంటుకుని ఉండే క్రిమిసంమారక మందుల దుష్పరిణామాలు ఎదుర్కుంటాం. ఉదయం లేచినవెంటనే బ్రష్ చేసుకొని నిమ్మరసం కలిపిన గ్లాసుడు నీళ్లు తాగితే శరీరం ఉత్సాహంగా ఉంటుంది. రక్తం పరిశుభ్రమవుతుంది.పండ్లను ఆహారం తినడానికి బాగా ముందుగా లేదా భోజనానికి భోజనానికి మధ్య సమయంలోగాని తీసుకోవాలి. అన్నం, కార్బోహైడ్రేట్లతో కూడిన ఆహారంతో తింటే సరిగా జీర్ణంకాదు.
ఒంటికి నలుగుపెట్టుకొని స్నానం చేస్తే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది. ఉదయం బియ్యంతో చేసిన ఇడ్లీ, దోసెలకు దూరంగా ఉండాలి. వాటికి బదులు జొన్నలు, మినుములతో చేసిన ఇడ్లీలు, దోసెలు తింటే మంచిది. దోసెలకు నూనెకు బదులు నేతిని వాడండి. ఉడకబెట్టిన శనగలు, వేరుసెనగలు, అలసందలు మంచి ఆహారం. మొలకెత్తిన గింజలు తింటే మంచిది. రాత్రి రెండు లేక మూడు జొన్న రొట్టెలు తింటే మంచిది. మద్యాహ్నం అన్నంలో అన్ని రకాల కూరగాయలు తినొచ్చు. నూనె లేకుండా వండిన కూరలుతింటే మంచిది. వారానికి మూడుసార్లు తప్పనిసరిగా ఆకుకూరలు తినాలి. పాలిష్ బియ్యం కన్నా ముడిబియ్యం, రాగిసంకటి, జొన్న అన్నం, కొర్ర అన్నం తింటే మంచిది.
-Naga Sundari