White Hair Control Tips Need to Follow: ప్రస్తుతం చాలా మందిని తెల్ల వెంట్రుకల సమస్య ఇబ్బంది పెడుతోంది. ఒకప్పుడు కేవలం వృద్ధులకు మాత్రమే తెల్ల జుట్టు కనిపించేది. కానీ, ఇప్పుడు పట్టుమని ముప్పై ఏళ్లు నిండకుండానే తెల్ల వెంట్రుకలు దర్శనమిస్తున్నాయి. దీంతో, యువతలో ఆత్మస్థైర్యం దెబ్బతింటోంది. పది మందిలో స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు. అయితే, మొదట ఈ తెల్ల వెంట్రుకలు జుట్టుపై కొన్ని మాత్రమే కనిపిస్తాయి. దీంతో చాలా మంది అవి కనిపించకుండా ఉండేందుకు వాటిని పీకడం ప్రారంభిస్తారు. ఇలా తెల్ల వెంట్రుకలను పీకడం వల్ల మరిన్ని ఎక్కువ తెల్ల వెంట్రుకలు మొలుస్తాయనే అపోహ చాలా మందిలో ఉంది. ఈ అపోహ నిజమా? కాదా? అనే విషయంపై స్పష్టత లేదు, తెల్ల వెంట్రుకలను పీకడం వల్ల చుట్టుపక్కల వెంట్రుకలు తెల్లగా మారతాయా?.. అది జుట్టు కుదుళ్లపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? అనే విషయాపలై చర్మ, జుట్టు నిపుణురాలు డాక్టర్ శివాంగి రాణా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అవేంటో చూద్దాం.
అది కేవలం అపోహ మాత్రమే..
తెల్ల వెంట్రుకలను పీకడం వల్ల చుట్టుపక్కల వెంట్రుకలు కూడా తెల్లగా మారుతాయని, ఒక తెల్ల వెంట్రుకలను పీకడం వల్ల 10 నల్ల వెంట్రుకలు తెల్లగా మారడం అనే ఒక అపోహ ఉందని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు. అయితే, డాక్టర్ శివాంగి ఇది పూర్తిగా అబద్ధమని క్లారిటీ ఇచ్చారు. నిజానికి తెల్ల వెంట్రుకలను పీకడం వల్ల వెంట్రుకల కుదుళ్లకు గాయం అవుతుంది. దీని ఫలితంగా మీరు పీకుతున్న వెంట్రుకలు తిరిగి పెరగవు. కాబట్టి వెంట్రుకలను ఎప్పుడూ పీకకూడదు అని తెలిపారు. అయితే, దీని వల్ల ఇతర వెంట్రుకలపై ఎలాంటి ప్రభావం ఉండదని, ఇతర వెంట్రుకలు తెల్లగా అవ్వడం అనేది అపోహ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. కాగా, జుట్టు తెల్లబడటానికి వృద్ధాప్యం ఒక ప్రధాన కారణమని స్పష్టం చేశారు. వృద్ధాప్యం వల్ల మెలనిన్ తగ్గడం వల్ల జుట్టు తెల్లబడుతోందని, దీంతో పాటు జెనిటిక్, ఒత్తిడి, ధూమపానం, జుట్టు సంరక్షణ సరిగా లేకపోవడం, కెమికల్ ప్రొడెక్ట్స్ అధిక వినియోగం, పోషకాహార లోపాలు వంటి అంశాలు కూడా జుట్టు తెల్లబడటానికి దోహదం చేస్తాయని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు, విటమిన్ బి12 లోపం వల్ల జుట్టు రాలడం, జుట్టు నెరవడం జరుగుతుందని తేల్చి చెప్పారు. బి12 లోపాన్ని భర్తీ చేయడం వల్ల జుట్టు నెరవడాన్ని ఆపవచ్చని, జుట్టుకు నల్ల రంగును ఇచ్చే మెలనిన్ ఉత్పత్తికి బి12 చాలా అవసరమని గుర్తు చేశారు. అయితే, వయస్సు మీరిన వారిలో కాకుండా యవ్వనంలోనే జుట్టు తెల్లబడితే ఆందోళన చెందకుండా చర్మవ్యాధి నిపుణులను సంప్రదించాలని పేర్కొన్నారు. మార్కెట్‌లో విరివిగా లభించే ఆయిల్స్ వాడటం వల్ల, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉందని గుర్తు చేశారు.


