Healthy Fruits: మహిళలలో వయసు పెరిగే కొద్దీ శరీరంలో అనేక శారీరక, హార్మోన్ల మార్పులు సంభవిస్తుంటాయి. దీని కారణంగా జీవక్రియ మందగించవచ్చు. ఎముకల బలం తగ్గవచ్చు. చర్మంపై ముడతలు కనిపించవచ్చు. అందువల్ల ఈ వయస్సులో ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. తద్వారా శరీరం సరైన పోషకాహారాన్ని పొందవచ్చు. ముఖ్యంగా మహిళలు ఆహారంలో కొన్ని పండ్లను చేర్చడం వల్ల రోగనిరోధక శక్తిని కాపాడటమే కాకుండా, జుట్టు, చర్మం, ఎముకల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కాబట్టి 40 సంవత్సరాల తర్వాత ఆహారంలో చేర్చుకోవాల్సిన కొన్ని పండ్ల గురించి తెలుసుకుందాం.
ఆపిల్
ప్రతి సీజన్ లో దొరికే యాపిల్స్‌లో ఫైబర్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అంతేకాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచుతుంది.
దానిమ్మ
దానిమ్మ పండు మహిళలకు సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా శరీరానికి ఐరన్ ను అందిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని వృద్ధాప్యం నుండి రక్షిస్తాయి. అదేవిధంగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
బొప్పాయి
బొప్పాయి పండులో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా యవ్వనంగా ఉంచుతుంది.
అరటిపండు
40 ఏళ్ల తర్వాత ఆరోగ్యంగా ఉండాలంటే ఎముకలు బలంగా ఉండాలి. అరటిపండ్లలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B6 కండరాలు, ఎముకలను బలంగా ఉంచుతాయి. దీంతో మహిళలు ఆహారంలో అరటిపండును చేర్చుకుంటే బలంగా ఉంటారు.
నారింజ
నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా ప్రకాశవంతంగా చేస్తుంది.
ఎండుద్రాక్ష
ఎండుద్రాక్షలో ఐరన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడుతుంది. వీటిని రోజూ కొద్ది మొత్తంలో తినడం ప్రయోజనకరం.