Sunday, July 7, 2024
Homeహెల్త్Women talking about sexuality: ‘ఆడవాళ్లు తమ లైంగికత్వం గురించి మాట్లాడుతున్నారు...’

Women talking about sexuality: ‘ఆడవాళ్లు తమ లైంగికత్వం గురించి మాట్లాడుతున్నారు…’

ఇక్కడ కనిపిస్తున్న ఆమె పేరు సీమా ఆనంద్. సెక్సువల్ హెల్త్ ఎడ్యుకేటర్ అయిన సీమ నేడు మహిళలలో లైంగిక చైతన్యం బాగా కనిపిస్తోందని, ఇది ఆరోగ్యకరమైన సమాజానికి సంకేతమంటారు. లైంగికానందాన్ని కేవలం పురుషుల హక్కుగా మాత్రమే చూసే, భావించే భారతదేశంలో ఈ పరిణామం ఎంతో సంతోషదాయకమంటారు. ఆమె గురించిన విశేషాలు… అరవై ఏళ్లు పైబడిన ఒక మహిళ సెక్సు గురించి అదీ సోషల్ మీడియాలో మాట్లాడుతుంటే ఆమెను విచిత్రంగా చూసేవాళ్లే ఎక్కువమంది ఉంటారు. ఈ వయసులో ఒక మహిళ సెక్సు గురించి మాట్లాడటమేమిటి అని చులకనగా చూసే వాళ్లే సమాజంలో ఎక్కకువమంది ఉంటారు. అలాంటి సవాలుతో కూడిన పనిని తన అరవై ఏళ్ల వయసులో ఎంతో ధైర్యంగా చేస్తున్నారు సీమా ఆనంద్. ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో 7,52,000 మంది ఫాలోయర్స్ కూడా ఉన్నారు.

- Advertisement -

నేడు భారతదేశంలోని ఎంతోమంది స్త్రీలు తమ సెక్సువాలిటీని గుర్తిస్తున్నారు. అంతేకాదు దానిపై బహిరంగంగా ధైర్యంగా మాట్లాడడానికి సైతం వెనుకంజవేయడంలేదంటారు సీమ. ఈ స్థాయికి స్త్రీలు ఎదగడానికి వారెంతో మూల్యం చెల్లించాల్సి వస్తోందంటారు. ‘సెక్సువాలిటీ గురించి నిర్భయంగా మాట్లాడిన స్త్రీలు అసహ్యమైన కామెంట్లను, అవమానాలను ఎదుర్కోవాల్సివస్తోంది. అలాంటి స్త్రీలను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. తమ లైంగికత్వంపై బహిరంగంగా మాట్లాడడం వల్ల మహిళల మానవసంబంధాలు సైతం దెబ్బతింటున్నాయి. మనలాంటి సమాజంలో లైంగికత్వంపై స్త్రీలు స్వేచ్ఛగా మాట్లాడడం అంత సులభమైన విషయం కాదు. అలా స్వేచ్ఛగా తమ సెక్సువాలిటీపై అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్న స్త్రీలు ఆ క్రమంలో సమాజంతో పెద్ద యుద్ధమే చేయాల్సివస్తోంది. అయినా భయపడకుండా ఇందుకోసం పోరాడడానికి సైతం స్త్రీలు వెనుకంజవేయడం లేదు’ అని సీమ అంటున్నారు. ఇది ఆనందించాల్సిన పరిణామమే. కారణం లైంగికానందం కేవలం పురుషుల హక్కుగా భావించే మనదేశంలో స్త్రీలు తమ లైంగికత్వాన్ని గుర్తించడం, దాని గురించిన చైతన్యం వారిలో పెరగడం

ఆహ్వానించాల్సిన పరిణామం. స్త్రీలలో కనపడుతున్న ఈ మార్పు వల్ల సెక్సువాలిటీ సంబంధించి ఎన్నో ఏళ్లుగా బయటకు రాని రకరకాల సమస్యలు బయటకు వస్తున్నాయి అంటారు సీమ. నేడు అమ్మాయిలు తమకు సెక్సు అంటే ఇష్టమని చెప్తున్నారు. అంతేకాదు తమలోని లైంగికాసక్తిని తమ పార్టనర్స్ తో పంచుకోవడానికి బిడియపడటం లేదు. కానీ అలా ఆడవాళ్లు తమ లైంగిక కోరికలను నిస్సంకోచంగా వ్యక్తీకరించడం పార్టనర్స్ కి మింగుడుపడటం లేదు. ‘ మా లైంగిక ఇష్టాన్ని, ఆసక్తిని మేం మా పార్టనర్స్ తో ఓపన్ గా చెపుతుంటే వాళ్లు ఇష్టపడటం లేదు’ అని నాతో ఎంతోమంది యువతులు చెప్పారని సీమా తెలిపారు. గతంలోలా కాకుండా ఇపుడు స్త్రీలు తమ లైంగికేచ్ఛను బహిరంగంగా చెప్పడం, సెక్సువాలిటీ గురించి మాట్లాడడం, మగాళ్లను ప్రశ్నించడం మొదలెట్టారు.

ఈ మార్పు మెలమెల్లగా స్త్రీ, పురుషుల్లో సంతోషకరమైన, ఆరోగ్యకరమైన లైంగిక జీవనానికి పునాదులేస్తుందనడంలో సందేహం లేదంటారు సీమ. సీమకు పుస్తక పఠనం అలవాటు ఉంది. అలా కామసూత్ర పుస్తకాన్ని కూడా ఆమె చదివారు. అది ఆమెలో అనూహ్య మార్పును తీసుకొచ్చింది. ఆ పుస్తకం తనలో మహిళా సాధికారతా ఆలోచనకు నాంది పలికిందంటారు. లైంగికానందాన్ని పొందే హక్కు ప్రతి స్త్రీకి ఉందన్న భావన ఆ పుస్తకం వల్లే తనలో పడిందంటారామె. ‘నాకిష్టమైన రీతిలో లైంగికానందం పొందడంలో తప్పులేదనిపించింది. స్త్రీగా నా ఇష్టాలు నాకుంటాయనిపించింది ’ అని సీమా చెప్పారు. స్త్రీలలో సెక్సు ఎడ్యుకేషన్ పై అవగాహన పెంచాలన్న లక్ష్యాన్ని ఆ పుస్తకం ఆమెలో రేకెత్తించింది.

సెక్సు అనేది ‘ వ్యక్తిగత అనుభవం’ తప్ప ఏ శరీరంతో పడితే ఆ శరీరంతో చేసే పని కాదంటారు. సీమ సెక్సువల్ హెల్త్ ఎడ్యుకేటర్ మాత్రమే కాదు. మంచి స్టోరీ టెల్లర్, మిథాలజిస్టు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్, రచయిత. సెక్సు అనేది బయటకు మాట్లాడకూడని విషయమనే దురభిప్రాయం మన సమాజంలో తరతరాలుగా పాతుకుపోయి ఉంది. కానీ విచిత్రమేమిటంటే లైంగికానందాన్ని వివిధ రకాల భంగిమల్లో ఎలా పొందవచ్చని ఎంతో ‘సౌందర్యాత్మకంగా’ చెప్పిన కామసూత్ర పుస్తకం పుట్టింది మనదేశంలోనే. ఆ కామసూత్ర పుస్తకమే సీమా ఆనంద్ ని శ్రుంగార శోధకురాలిని చేసింది. లైంగిక జీవనంపై ఉన్న అపోహలను తొలగించడానికి పూనుకునేట్టు చేసింది. ది ఆర్ట్స్ ఆఫ్ సెడక్షన్ అనే పుస్తకాన్ని కూడా ఆమె రాసింది. ఇన్ స్టాగ్రాము ద్వారా యువతను ఆకట్టుకుంటూ లైంగికత్వానికి సంబంధించి అన్ని విషయాలను సంక్షిప్తతంగా, అందరికీ అర్థమయ్యే సరళమైన, కమ్యూనికేటివ్ భాషలో చెప్తూ వారిని ఎడ్యుకేట్ చేయడం ప్రారంభించారు. సెక్సు గురించి మాట్లాడడం తప్పు కాదనే అభిప్రాయాన్ని ప్రజల్లో బాగా విస్తరింపచేయాలన్నదే ఆమె ఉద్దేశం.

లైంగిక అంశాలను మాట్లాడేటప్పుడు ఉపయోగించే భాష కూడా ఎంతో ముఖ్యమని సీమా అంటారు. నేటి యువత లైంగిక అంశాలను మాట్లాడుకునేటప్పుడు ఉపయోగించే పదాలు, వ్యక్తీకరణలు ఎలాంటివో తెలుసుకోవడానికి ఎంతో కష్టపడ్డానంటారు. వాటిని డిజిటల్ మీడియాలో షేర్ చేయడం కూడా అంత సులువేమీ కాదని చెపుతారు. అందులోనూ వయసు మళ్లిన, నెరిసిన జుట్టుతో ఉండే స్త్రీలు సెక్సు గురించి మాట్లాడితే సమాజంలో లభించేది అగౌరవమేనంటారు. అలాంటి చూపు సమాజంలో పోవాలంటారు.

వయసు వల్ల లైంగిక విషయాలను సంపూర్ణ వివేకతతో అన్ని వయసుల వారికి ఆకట్టుకునేలా, అర్థమయ్యేలా పెద్దవాళ్లు పంచుకోగలరని, ఈ విషయంలో తనలాంటి వారు ప్లస్ పాయిటే అవుతారని అంటారు. స్టోరీ టెల్లర్ కావడం వల్ల సీమ లైంగిక అంశాలను నేరేటివ్ స్టైల్ లో బాగా చెప్తారు. వివిధ పురాణాలు, సంస్క్రుతులు, జానపద కథలను సీమ అధ్యయనం చేశారు. వాటిల్లో ఎక్కడా స్త్రీలకు తమ శరీరం మీద ఉన్న హక్కును గూర్చిగాని, వారి లైంగికత్వాన్ని గురించిగాని , శారీరక ఆనందాన్ని గురించిగాని మాట్లాడిన దాఖలాలు లేవంటారామె. పురుషుడి ద్రుక్కోణంలోంచే లైంగికత్వాన్ని, సుఖాన్ని, శ్రుంగారాన్ని చూపించడం కనిపిస్తుందంటారామె. భర్తగాని , తండ్రి గాని స్త్రీలను ఒక ఆస్తిగా చూస్తారంటారు. సెక్సు గురించి పైకి మాట్లాడడం ప్రారంభిస్తే దాని చుట్టూ అలుముకుని ఉన్న అపార్థాలు, తప్పుడు అభిప్రాయాలు ప్రజలలో తొలగిపోతాయంటారు. సెక్సు గురించి, సెక్సువాలిటీ గురించి మాట్లాడుతున్నందుకు ఎన్నో ట్రోల్స్ ను, అవమానాలను సీమా ఎదుర్కొన్నారు. ‘నాకు ఎందరో స్నేహితులు ఉండేవారు. ఎప్పుడైతే నేను సెక్సు గురించి, సెక్సువాలిటీ గురించి మాట్లాడడం ప్రారంభించానో వారంతా నాతో స్నేహం మంచిది కాదని దూరమయ్యారు’ అని ఒక సందర్భంలోచెప్పారు.

సెక్సు గురించి ఓపెన్ గా మాట్లాడటం, దాని మీద ప్రసంగించడం, పోరాడడం సులభమైన పని కాదు అని సీమ చెప్తారు. ముఖ్యంగా వ్యక్తిగత సమస్యలు పరిష్కరించడం ఎంతో సవాలుతో కూడిన విషయమంటారు. ఆమెకు భర్త తోడ్పాటు ఉన్నా కూడా తాను ఈ రంగంలో చేస్తున్న క్రుషికి అనుక్షణమూ శక్తిని, ఉత్సాహాన్ని అందిస్తున్నది మటుకు తన కోడలు, కూతురే నంటారామె. ‘స్త్రీలు తమ లైంగిక కోరికలను బయటకు వ్యక్తపరచడం అసాధారణగా, అవాంఛనీయమైందిగా కనిపిస్తుంది. కానీ కామసూత్ర చదివినపుడు అది చాలా సాధారణ విషయమని ఎవరికైనా అర్థమవుతుంది. కామసూత్ర చదివినపుడు నాలో కలిగిన భావన కూడా అదే’ అని సీమ చెప్పారు. తనలోని స్త్రీని, స్త్రీత్వాన్నిఅప్పుడు గుర్తించానంటారామె. ఫేస్ బుక్, యూట్యూబ్ ల ద్వారా స్త్రీలను లైంగికంగా ఎంతో చైతన్యపరుస్తున్నారు.

అయితే ఇన్ స్టాగ్రాములో ఆమె ఎక్కువ పాప్యులర్ అయ్యారు. కోవిడ్ కు ముందు పలుచోట్లకు వెళ్లి మహిళలకు సెక్సువాలిటీపై ప్రసంగాలు ఇచ్చేవారు. తర్వాత లాక్ డౌన్ వల్ల సాధ్యం కాలేదు. అప్పటి నుంచి సోషల్ మీడియా ద్వారా తన క్రుషిని సీమ కొనసాగించారు. కూతురు సలహాతో ఇన్ స్టాగ్రామును తన లక్ష్యానికి వేదికగా చేసుకున్నారు. 2020 సంవత్సరం నుంచి ఇన్ స్టాగ్రాములో సెక్సువాలిటీ అవగాహన ప్రసంగాలు, కార్యక్రమాలను సీమ ప్రారంభించారు. ప్రారంభంలో మగవాళ్లు ఎక్కువగా ఆమె ఇన్ స్టాగ్రాము కార్యక్రమాల్లో పాలుపంచుకున్నా తర్వాత తర్వాత స్త్రీల సంఖ్య పురుషుల సంఖ్యకన్నా బాగా పెరిగిందంటారామె. ‘రెండు సంవత్సరాలలో స్త్రీలలో పెద్ద మార్పే వచ్చింది. తమ లైంగికత్వాన్ని వారు గుర్తించడమే కాదు తమ ఇష్టాయిష్టాలను నిర్మొహమాటంగా, మరెంతో ఆత్మవిశ్వాసంతో చెప్పడం ప్రారంభించారు’ అని సీమా చెప్పారు. ‘తమ లైంగిక జీవనంలోని సన్నిహిత క్షణాల గురించే కాదు భాగస్వామితో తమ లైంగిక ఆనందానికి సంబంధించిన అనుభవాలను సైతం స్త్రీలు బయటకు చెప్పడం మొదలెట్టారు.

సెక్సు అనేది కేవలం శరీరానికి మాత్రమే సంబంధించినది కాదు. మైండ్, భావోద్వేగాలు సైతం లైంగికానుభవంలో కీలకంగా వ్యవహరిస్తాయం’టారు సీమ. ప్రసంగాల సమయంలో కూడా ఎంతోమందియువతులు, స్త్రీలు బహిరంగంగా తమ లైంగిక కోరికలు, దానికి సంబంధించిన అనుమానాలను సూటిగా , స్పష్టంగా, ధైర్యంగా అడుగుతున్నారని సీమ అంటారు. లైంగిక అంశాల గురించి మాట్లాడిన, తమ సెక్సువాలిటీ గురించి ప్రస్తావించిన స్త్రీలను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అలా ట్రోల్ చేసేవాళ్లను బ్లాక్ చేయాలంటారు సీమ. ‘ మన సమాజంలో యంగ్ గా ఉండే ఆడపిల్లలకు ఇప్పుడు సెక్సేంటి అంటారు.

40 ఏళ్లు దాటితే బడికి వెళ్లే పిల్లలు ఉంటారు కాబట్టి సెక్సుకు ప్రాధాన్యం ఉండదు. తల్లి అయితే ఇప్పుడు సెక్సు ఏంటి అని జీవితాంతం తల్లిగా బతికేయమంటారు’ అని సీమ అంటారు. స్త్రీలలో సెక్సు ఎడ్యుకేషన్ పెంపొందించడానికి సోషల్ మీడియాలో ఉన్న అవకాశాలన్నింటినీ సీమ వాడుకుంటున్నారు. మరింత విస్త్రుతంగా మహిళలలను చేరడానికి యూట్యూబ్, ఫేస్ బుక్ లతో పాటు లింక్డ్ ఇన్, టిక్ టాక్ ల వంటి వాటిని కూడా తన ప్రత్యామ్నాయమార్గాలుగా సీమ వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

స్త్రీలు తమ శరీరాన్ని ప్రేమించాలి. తమ కోరికలను గుర్తించాలి. తమ లైంగికత్వాన్ని ఆస్వాదించగలగాలి. తమ మనసుకు, మెదడుకు, శరీరానికి ఎలాంటి లైంగిక స్వేచ్ఛ, ఆనందం కావాలో నిర్ణయించుకునే నిర్ణాయకశక్తులు స్త్రీలే కావాలి. ఆ దిశగా సీమా ఆనంద్ చేస్తున్న అవగాహనా ప్రయత్నాలు ఆరోగ్యకరమైన స్త్రీపురుష లైంగికజీవనానికి పటిష్టమైన బీజాలు వేస్తాయని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News