Thursday, September 19, 2024
Homeహెల్త్World art community: అందం, ఆరోగ్యాల చిరునామా శీతల్

World art community: అందం, ఆరోగ్యాల చిరునామా శీతల్

చిన్న సంఘటనతో సమాజానికి పనికి వచ్చే గొప్ప ఆవిష్కారాలకు బాట వేసిన వారెందరో ఉన్నారు. శీతల్ కాబ్రా కూడా అలాంటి వారి కోవలోకి వస్తారు. ఆమె ఎన్నడూ గొప్ప కలలు కనలేదు. కానీ తన జీవిత స్వప్నాన్ని రియలైజ్ అయిన క్షణం నుంచీ దాని పట్ల ఆమె చూపిన నిబద్ధత, సాహసాలు ఎందరో స్త్రీలకు స్ఫూర్తినిస్తాయి. ఆమె మంచి చదువు చదివి, ఉన్నతోద్యోగం చేసిన అత్యాధునిక మదర్. కానీ తన జీవిత లక్ష్యమేమిటో రియలైజ్ అయేట్టు చేసింది మటుకు తన బిడ్డేనంటారామె. అందం మాటున ప్రమాదకర రసాయాలు గుప్పించి మార్కెట్లో విడుదల చేస్తున్న రకరకాల కాస్మొటిక్ ఉత్పత్తులు మానవాళికి తెచ్చిపెడుతున్న తీవ్ర అనారోగ్య పరిణామాల గురించి తన పాప వల్లే తెలిసిందంటారు. అదే ఆమెను రసాయనాలు లేని, ప్రిజర్వేటివ్స్ కు తావులేని నేచురల్ బ్యూటీ ఉత్పత్తులకు శ్రీకారం చుట్టేలా చేసింది. నలుగురికీ మంచి చేయాలనే సామాజిక బాధ్యతతో ముందుకు అడుగులు వేసేలా చేసింది. అదెలాగో ‘తెలుగు ప్రభ’తో ఆమె పంచుకున్న విశేషాలు…

- Advertisement -

‘‘ నేను మేనేజ్మెంట్ కోర్సు చేశా. కార్పొరేట్ రంగంలో తొమ్మిదేళ్లకు పైగా పనిచేశా. పెళ్లైన తర్వాత హైరిస్కు ప్రెగ్రెన్సీ కావడంతో వైద్యులు విశ్రాంతి అవసరమన్నారు. నాకు చిన్నతనం నుంచి కళలన్నా, క్రాఫ్ట్స్ అన్నా చాలా ఇష్టం ఉండేది. అందుకే ఎక్కడ కొత్త హ్యాండీక్రాఫ్ట్ నేర్పిస్తున్నారని తెలిసినా అక్కడికి వెళ్లి వాటిని హాబీగా నేర్చేకునేదాన్ని. అందులోనూ క్లే వర్కు, పేపర్ వర్క్స్ చేయడమంటే చాలా ఇష్టం. రిస్కు ప్రెగ్నెన్సీతో జాబ్ వదిలేసిన నేను నాకొచ్చిన ఆర్ట్స్ తో రకరకాల కళాక్రుతులను తయారు చేసేదాన్ని. వాటిని ఎగ్జిబిషన్లలో అమ్మేదాన్ని. అంతేకాదు నాకు వచ్చిన ఆర్ట్స్ ను ఎందరికో నేర్పించేదాన్ని. అలా 2012లో ‘కళార్ట్ క్రియేషన్స్’ కు శ్రీకారం చుట్టాను.

అనుకోకుండానే…

నేచురల్ బ్యూటీ ఉత్పత్తుల తయారీ వైపు నేను మళ్లడం అనుకోకుండా జరిగింది. యంగ్ గా ఉన్నప్పుడు ఎన్నో ఏళ్లు నేను ఎగ్జిమా, యాక్నే సమస్యలతో బాధపడ్డా. కానీ ఎన్నడూ నేచురల్ పర్సనల్ కేర్ ప్రాడక్టుల వైపు వెళ్లలేదు. కారణం అలాంటివి ఉంటాయని నాకు అప్పట్లో తెలియదు. మార్కెట్లో కమర్షియల్ ప్రాడక్టులు, నేచురల్ ప్రాడక్టులు ఉంటాయనీ తెలియదు. నా సమస్యకు చర్మ నిపుణులనే ఎప్పుడూ సంప్రదించేదాన్ని. వారిచ్చే రకరకాల మందులు, స్టెరాయిడ్స్, యాంటిబయోటిక్స్, హార్మోనల్ మెడిసెన్స్ వాడాను. అవి ఎక్కువ వాడితే నా ఆరోగ్యంపై విష ప్రభావం చూపుతాయని కూడా తెలియదు. కొందరు ఆయుర్వేదం వాడి చూడమని సలహా ఇచ్చారు. అది కూడా ప్రయత్నించి చూశా. మంచి ఫలితం కనిపించింది. అయితే మా పాప సెహర్ నా జీవితంలోకి ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పటి నుంచి నా జీవితం పూర్తిగా మారిపోయింది.

మా పాపే నా మలుపు…

ఒకరోజు మా పాపకు మార్కెట్ లో దొరికే సబ్బుతో స్నానం చేయిస్తుంటే పాప చేతుల మీద చర్మం పొట్టులా ఊడడం గమనించా. ఆ తర్వాత కొన్ని రోజులకు పాప మోకాళ్లు , పాదాలు, గడ్డం దగ్గర ఉన్న చర్మం కూడా ఊడిపోతుండడం గమనించా. ఆయిల్ మసాజ్ చేసినా కూడా చర్మం ఊడడం తగ్గలేదు. పాపకు రోజూ వాడుతున్న బేబీ పౌడర్, బేబీ సోప్ లాంటి స్కిన్ ప్రాడక్టులనన్నింటినీ గమనించా. వాటిని లోతుగా అధ్యయనం చేశా. రకరకాల ప్రయోగాలకు సైతం పూనుకున్నా. చివరకు పాప సమస్యకు నేను వాడుతున్న బేబీ సోపే కారణమని తేలింది. ఎప్పుడైతే పాపకు కమర్షియల్ బేబీ సోప్ వాడడం మానేసానో అప్పుటి నుంచి పాప చర్మం ఊడడం కూడా ఆటోమేటిక్ గా తగ్గిపోయింది. కమర్షియల్ సోప్ వాడడం వల్ల పాప చర్మం పొడారిపోయినట్టు ఉండేది. చర్మం చిరచిరలాడుతున్నట్టు ఉండడం వల్ల పాప ఎప్పుడూ అసహనంగా ఉండేది. పాప పడుతున్న బాధ చూస్తే నేను ఎగ్జిమాతో పడ్డ బాధ, పోరాటం గుర్తుకువచ్చి భయం వేసేది. చివరకు నా జీవితంలా పాపదవుతుందేమోనన్న ఆందోళన నన్ను చుట్టుముట్టింది. పాపకు మార్కెట్ లో దొరికే కమర్షియల్ ప్రాడక్టులు పడటం లేదని గ్రహించా. పాప గురించిన ఆ ఆందోళనే నన్ను నేచురల్ ఉత్పత్తుల వైపు అధ్యయనాలు చేపట్టేట్టు చేసింది. అలా నేచురల్ హోమ్ మేడ్ సోప్స్ తయారీని మొదలెట్టా. ఎన్నో ప్రయత్నాల తర్వాత నేచురల్ సోప్ తయారీలో సక్సెస్ అయ్యా. 2014లో నేను చేసిన నేచురల్ సోప్స్ ను స్నేహితులకు, చుట్టాలకు, రైతు మార్కెట్లలో అమ్మడం మొదలెట్టా. అలా నేచురల్ పర్సనల్ కేర్ బ్రాండ్ ‘ఎర్తీ సాపో’కు బీజం పడింది. నా బ్రాండ్ ద్వారా రసాయన రహిత, పర్యావరణహితమైన జీవితాన్ని ప్రజల్లో వ్యాప్తి చేయాలని నిశ్చయించుకున్నా.

భూమితల్లి స్ఫూర్తిగా..

నేను ప్రారంభించిన ‘ఎర్తీ సాపో’ పర్సనల్ అండ్ హోమ్ కేర్ బ్రాండ్. ఇది సహజసిద్ధమైన, రసాయనాలు లేని, ప్రిజర్వేటివ్స్ లేని వేగాన్ ఉత్పత్తులను అందిస్తుంది. సింథటిక్ కలరెంట్స్, సువాసనలు వీటిల్లో అస్సలు ఉండవు. వీటిని రూపొందించే ముందు నేను చేసిన అధ్యయనాలు, ప్రయోగాలకు లెక్కలేదు. ఈ క్రమంలో ఆయుర్వేద వైద్యులను మాత్రమే నేను సంప్రదించాను. ముఖ్యంగా ఆయిల్స్ వినియోగం పరంగా వారి నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. స్నానానికి సంబంధించిన, శరీరానికి సంబంధించిన, శిరోజాలు, చర్మంకు చెందిన, అలాగే హోమ్ కేర్ ఉత్పత్తులను సహజసిద్ధమైన పదార్థాలతో తయారు చేయడం ప్రారంభించాను.

అనుకోకుండా..

నాకు బిజినెస్ చేయాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. కానీ నలుగురికి మంచి చేయాలనే తలంపుతోనే ఈ పని ప్రారంభించాను. స్వంత డబ్బుతోనే ఈ పని మొదలెట్టాను. ఈ ప్రయత్నంలో నాకు పెద్ద సవాలుగా నిలిచింది ఒక్కటే. నేచురల్ ఉత్పత్తుల వినియోగానికి సంబంధించి ప్రజల మైడ్ సెట్ ను మార్చడానికి నేను బాగా కష్టపడాల్సి వచ్చింది. అంతేకాదు 2013లో దీన్ని ప్రారంభించేనాటికి చాలామందికి నేచురల్ పర్సనల్ కేర్ ఉత్పత్తులంటే అవగాహన లేదు. ఇప్పటికి కూడా చాలామందికి వీటి గురించిన స్ప్రుహ అరకొరగానే ఉంది. మేం ఉండేది హైదరాబాదులోనే. ఈ బిజినెస్ ను ఇక్కడ నుంచే ప్రారంభించాను. లోకల్ గా మొదలెట్టిన నేచురల్ బ్యూటీ అండ్ హోమ్ కేర్ ఉత్పత్తులను సొంత వెబ్ సైట్ ద్వారా నేడు పొరుగు దేశాల కస్టమర్లకు కూడా అందజేస్తున్నా. వాటిల్లో అమెరికా, కెనడా, యుఎఇ, యుకె వంటి ఎన్నో దేశాలు ఉన్నాయి. దేశీయ మార్కెట్లో అమెజాన్ వంటి వివిధ ఆన్ లైన్ వేదికల ద్వారా మా ఉత్పత్తులను కస్టమర్లకు అందజేస్తున్నాం.

ఆరోగ్యమైన అందం కోసం…

ఇంటా, బయటా ఆరోగ్యకర జీవనం అందరికీ అందించాలన్నదే నా ఈ ప్రయత్నం వెనకున్న ముఖ్య లక్ష్యం. ‘హెల్త్ ఓవర్ ఈస్థటిక్స్’ అనే సిగ్నేచర్ ట్యూన్ తో నా లక్ష్యం వైపు ధైర్యంగా అడుగులు వేశాను. మా ఉత్పత్తులు పర్యావరణ హితమైనవి. ఎగ్జిమా, యాక్నే వంటి సున్నితమైన చర్మ సంబంధిత సమస్యలున్న వారికి సైతం మేం కస్టమైజ్డ్ ఉత్పత్తులను అందిస్తాం. వంటింట్లో లభ్యమయ్యే పదార్థాలతో నేచురల్ సోప్స్ సులభంగా చేయొచ్చు. అవి చర్మం మీద ఎలాంటి దుష్ఫలితాలు చూపవు. నేను తయారు చేసిన మొదటి నేచురల్ సోప్ ను నేనే మొదట వాడాను. తర్వాత పాపమీద వాడాను. ఎలాంటి దుష్ఫలితాలు మాలో తలెత్తలేదు. ఎగ్జిమా, యాక్నే బాధితురాలినైన నాపై సయితం ఈ సోపు మంచి ఫలితాన్ని ఇవ్వడం నిజంగా గొప్ప విజయమనే చెప్పాలి. నేను తయారు చేసే ఉత్పత్తుల్లో వాడే పదార్థాలన్నీ కిరాణా షాపులో దొరికేవే. ఉదాహరణకు నేను సోప్ తయారుచేసేటప్పుడు అందులో కొబ్బరినూనె, నువ్వుల నూనె, సన్ ఫ్లవర్, రైస్ బ్రాన్ వంటి వెజిటబుల్ ఆయిల్స్ వాడాను. నేచురల్ సోప్ తయారీలో నేను వాడిన రెండవ పదార్థం బటర్. షియా బటర్, కోకో బటర్, కోకుమ్ బటర్ లను నేచురల్ సోప్ తయారీలో ఉపయోగించా.

మేం తయారుచేసే నేచురల్ పర్సనల్ కేర్ ఉత్పత్తుల్లో షీకాకాయ్, రీతా, ముల్తానీ వంటి వాటితో చేసిన షాంపులు, బాదం నూనె, కొబ్బరినూనె, వేపనూనె వంటి వాటితో చేసిన సబ్బులు, క్రీములు వంటి వెన్నో ఉన్నాయి. బాడీ సోప్స్ తో పాటు హెయిర్ సోప్స్, ఆయిల్స్, మాయిశ్చరైజర్లు, పౌడర్లు, ప్యాక్స్, లాండ్రీ సోప్స్, డిష్ వాష్ సోప్స్ వంటి వాటిని కూడా తయారుచేస్తాం. రీతా షాంపు బార్లు, నట్స్ ఓవర్, కోకోనట్స్ బాడీ కమ్ హెయిర్ సోప్, బేబీ సాఫ్ట్ బేదింగ్ సోప్, టెండర్ టచ్, సెంటు వాసనలేని మాయిశ్చరైజింగ్ బేదింగ్ సోప్, డివైన్ సింప్లిసిటీ బేదింగ్ సోప్ ఇలా ఒక్కొక్కదానికి ఒక్కో పేరు మా ఉత్పత్తులకు ఉంటుంది. మా ఉత్పత్తుల ప్యాకింగ్ ను సైతం ఎకోఫ్రెండ్లీగా చేస్తున్నాం. ఉత్పత్తులు నేచురల్ వి కావడం వల్ల ,లేబర్ వర్కు కూడా ఎక్కువ ఉండడం వల్ల ఖరీదు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. నేచురల్ ప్రాడక్టుల కన్నా కమర్షియల్ ప్రాడక్టులు చవగ్గా ఉంటాయి. ఈ విషయంలో మధ్యతరగతి వారిని కన్విన్స్ చేయడం, ఖరీదు నిశ్చయించడంలో సవాళ్లు బాగా ఉంటాయి. ఇవి కూడా నన్ను వెనుకంజవేయనీయలేదు. కారణం నేను పెట్టుకున్న విస్త్రుత లక్ష్యం చేరాలన్నదే నా ప్రధాన ఆలోచన. అందుకే నేచురల్ ఉత్పత్తులను తయారుచేయడం ద్వారా నిజమైన అందం ఏమిటన్నదానిపై, ఆరోగ్యంపై, పర్యావరణంపై అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నా.

కొద్ది మార్పు తేగలిగినా ఆనందమే…

ప్రమాదకరమైన రసాయనాల పాల బడకుండా ప్రజలను కొంతమందినైనా రక్షించగలగుతున్నా అనుకుంటున్నా. కాస్మొటిక్ నుంచి నేచురల్ కు, ఈస్థటిక్స్ నుంచి ఆరోగ్యం వైపు, బ్యూటీ కేర్ నుంచి పర్సనల్ కేర్ వైపుగా ప్రజలు అడుగులు వేసేలా వారి మైడ్ సెట్ ను కొంత మార్చినా నాకు సంత్రుప్తే. ఉత్పత్తుల తయారీ నుంచి ప్యాకింగ్, అమ్మడం, మార్కెటింగ్ అన్నీ నేనే చూసుకుంటున్నాను. ఇంత పెద్ద లక్ష్యంతో ఇన్ని పనులు చేయగలుగుతున్నానంటే నాకు కుటుంబ అండదండలు బాగా ఉండడమే కారణం. నేను అందిస్తున్న పర్సనల్ కేర్ ప్రాడక్టుల పట్ల నా కస్టమర్ల దగ్గర నుంచి కూడా మంచి స్పందన వస్తుండడం నాకు పెద్ద నైతిక మద్దతుగా నిలుస్తోంది. ఇది కూడా నన్ను నా ఈ ప్రయత్నంలో ధైర్యంగా ముందుకు వెళ్లేలా చేస్తోంది.

ఈస్థటిక్స్ పేరు చెప్పి…

బ్యూటీ అనగానే శరీరంపై బహిరంగంగా కనిపించేదిగానే చాలామంది చూస్తున్నారు. బ్యూటీ అనేది బహిరంగమైనదే కాదు. అది శరీరంలోపలి ఆరోగ్యానికి సంబంధించింది కూడా. మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం.బయట మార్కెట్ లో లభ్యమయ్యే పలు హోమ్ కేర్, కాస్మొటిక్ ఉత్పత్తుల నిండా ప్రమాదకరమైన రసాయనాలు, ప్రిజర్వేటివ్స్ ఉంటున్నాయి. ఇవి శరీరాన్ని అందంగా కనిపించేట్టు చేయడం మాట అటుంచితే రకరకాల హార్మోనల్ సమస్యలను రేకెత్తిస్తున్నాయి. కాన్సర్ వంటి పలు ప్రమాదకరమైన జబ్బులకు కారణమవుతున్నాయి. చర్మం, శ్వాసకోశ జబ్బులు, రకరకాల ఎలర్జీలు వంటివెన్నో వస్తున్నాయి.

వాతావరణకాలుష్యం, పర్యావరణం కూడా ప్రజల బాహ్యం, అంతర్ ఆరోగ్యాలను ప్రమాదంలో పడేస్తున్నాయి. సమతుల్యమైన ప్రక్రుతి వాతావరణంతో సహజీవనంతో పాటు రసాయనాలు లేని నేచురల్ పర్సనల్ కేర్ వైపుగా ప్రజలు ప్రయాణించాల్సిన అవసరం నేడు ఎంతో ఉంది. ఆ దిశగా తమ మైడ్ సెట్ ను ప్రజలు మార్చుకోవాలి. ఇంత పెద్ద మార్పు సమాజం మద్దతు, బలమైన వ్యవస్థ ఉనికి వల్ల తప్ప సాధ్యం కాదు. సమాజానికి మంచి చేయాలన్న లక్ష్యంతో నేను ఈ పెద్ద పనిని మొదలెట్టాను. కాబట్టి కొద్దిగా టైము తీసుకున్నా సరే నా ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తాయని గట్టగా నమ్ముతున్నాను. నా టీమ్ మొత్తం మహిళలే. నేను చేస్తున్న పనిలో ఎందరో స్త్రీలకు ఉపాధి కల్పించి వారు స్వతంత్రంగా జీవించేట్టు చేయగలుగుతున్నానన్న ఆనందం నాకు ఎంతో ఉంది. స్త్రీల భాగస్వామ్యంతో జనాల్లో పర్యావరణ స్ప్రుహ పెంచగలుగుతున్నందుకు కూడా సంతోషంగా ఉంది.

అమ్మ స్ఫూర్తి..

మనం మొదలెట్టిన దాంట్లో విజయం సాధించాలంటే మనపై మనకు నమ్మకం ఉండాలి. కష్టపడే స్వభావం, పట్టుదల అవసరం. నలుగురికి మంచి చేసే పని ఏదైనా డబ్బు సంపాదన కన్నా చాలా గొప్పదని మా అమ్మ చెప్తారు. ఆమె మాటలే నాకు స్ఫూర్తి…. ఆమె నన్ను మానసికంగా ఎంతో బలంగా ఉండే వ్యక్తిగా తయారు చేసింది. పెదాలపై చిరునవ్వు వీడకుండా పెట్టుకున్న లక్ష్యం వైపు అడుగులు వేయమంది. అమ్మ చెప్పినట్టే చేస్తున్నా.. నేను చేస్తున్న పనిని ఎంతో ఆస్వాదిస్తున్నా. విజయం వైపుగా ఆశావహంగా అడుగులు వేస్తున్నా… మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నా…’’అని చెప్పుకొచ్చారు శీతల్..

– నాగసుందరి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News