- చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ సమస్య
- భారతదేశంలో 5-15% మందికి దీంతో ఇబ్బంది
- కండరాల వాపుతో సన్నబడే శ్వాసనాళాలు
- ఎలర్జీ కలిగించే పదార్థాలకు దూరంగా ఉండాలి
- నేడు అంతర్జాతీయ ఆస్తమా డే
ఆస్తమా(Asthma). మన దేశంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామందిని వేధిస్తున్న సమస్య. 11 ఏళ్లలోపు చిన్నారుల్లో మన దేశంలో నూటికి 5-15 మంది దీని బారిన పడుతున్నారు. ఈ వ్యాధి ఉన్నవారికి ఊపిరి సరిగా అందదు. చాలాకాలం పాటు స్టెరాయిడ్స్‌తో మాత్రమే దీనికి చికిత్స చేసేవారు. ఇప్పుడు కూడా ఆస్తమా ఉన్న పిల్లలు ఉండే ఇళ్లలో నెబ్యులైజర్లు మనం సర్వసాధారణంగా చూస్తుంటాం. అందులో మందు వేసి, వేడిగా వచ్చే ఆవిరిని ఆక్సిజన్ తరహాలో ముక్కుకు పెట్టుకుంటేనే వారికి ఊరట లభిస్తుంది. ఈ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతియేటా మే నెలలో మొదటి మంగళవారం అంతర్జాతీయ ఆస్తమా డే నిర్వహిస్తున్నారు.
అసలేంటీ ఆస్తమా..?
ముక్కుద్వారా మనం పీల్చుకునే గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లి, తిరిగి బయటకు రావడానికి శ్వాసనాళాలు ఉంటాయి. పుట్టుకతోనే ఉండే కొన్ని కారణాల వల్ల కండరాలు వాచిపోయి, ఈ శ్వాసనాళాలు సన్నబడతాయి. దానివల్ల గాలి ముక్కుతో పీల్చుకున్నా, అది తగినంతగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లదు. దాంతో గాలి వేగంగా పీల్చి, వదులుతుంటారు. కాసేపు నడిచినా, ఏదైనా పనిచేసినా వీరికి ఆయాసం వస్తుంది. ఛాతీలో బిగుసుకుపోయినట్లు అనిపిస్తుంది. ఇది ఏ వయసువారికైనా వస్తుంది గానీ, ఎక్కువగా చిన్నపిల్లలు, యుక్తవయసువారిలో చూస్తుంటాం. ఆస్తమా ఉన్నవారు అసలు శారీరక వ్యాయామం చేయొద్దని కొందరు అంటారు గానీ, ముందుగా వైద్యుల సలహా తీసుకుంటే.. ఆ మేరకు వ్యాయామం కూడా చేయొచ్చు. ముఖ్యంగా ఊపిరితిత్తులు బలపడేందుకు కొన్ని శ్వాసపరమైన వ్యాయామాలు ఉంటాయి. అవి చేస్తే చాలావరకు ప్రయోజనం ఉంటుంది.
చికిత్స ఉందా..?
1980లలో అయితే స్టెరాయిడ్ ఇంజెక్షన్ల ద్వారా మాత్రమే ఆస్తమా ప్రభావాన్ని చాలావరకు తగ్గించేవారు. తర్వాతి కాలంలో ఇన్‌హేలర్లు, రోటాకాప్స్ లాంటివి వచ్చాయి. అయితే, వీటిలో ఏవైనా కూడా వైద్యుల సలహా, సూచనల మేరకు వారు సూచించిన మోతాదులోనే వాడాలి తప్ప.. నేరుగా మందుల దుకాణానికి వెళ్లి కొనేసి వాడకూడదు. దానివల్ల ప్రతికూల ప్రభావాలు కూడా కలుగుతాయి. అలాగే, ఎలర్జీ కలిగించే ఆహార పదార్థాలు తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలి. దీనివల్ల చాలావరకు ఆస్తమా తీవ్రత ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది.