Friday, September 20, 2024
Homeహెల్త్Wrinkle free skin: ఐస్ ముక్కలతో ముడతలు లేని చర్మం

Wrinkle free skin: ఐస్ ముక్కలతో ముడతలు లేని చర్మం

కొరియన్ బ్యూటీ ట్రెండులో ఐస్ క్యూబ్స్ మసాజ్ ఎంతో కీలకం. ఇప్పుడు ప్రసిద్ధమైన ఫేషియల్ బ్యూటీ ట్రెండు కూడా అయింది

ఐస్ క్యూబ్స్ వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ముడతలు ఏర్పడవు. ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చల్లని ఐస్ ముక్కలు ముఖంపై పెట్టి మసాజ్ చేస్తే చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. యాక్నే సమస్య ఉన్నవారికి ఐస్ క్యూబ్స్ ఎంతో సాంత్వననిస్తాయి. అంతేకాదు కళ్ల కింద ఏర్పడ్డ నల్లటి వలయాలు కూడా పోతాయి. మీరు నిత్యం ఉపయోగించే బ్యూటీ ఉత్పత్తులతో పాటు ఐస్ ముక్కలతో రోజులో ఒకసారి ముఖం, మెడ భాగాలను మసాజ్ చేసుకుంటే చర్మం ఎంతో కాంతివంతమవుతుంది. మీది ఎలాంటి చర్మం అయినా కూడా ఐస్ క్యూబ్స్ మీ ముఖంపై చేసే వండర్స్ ఎన్నో. రోజంతా పనిచేసి అలసిపోయి వచ్చిన తర్వాత ముఖంపై ఐస్ క్యూబ్స్ తో మసాజ్ చేసుకుంటే వచ్చే రిలీఫ్, చర్మం తాజాదనం ఎంతో హాయినిస్తుంది. చర్మంపై పడ్డ ఒత్తిడి అంతా ఇట్టే పోతుంది. అంతేకాదు ఐస్ క్యూబ్స్ తో మసాజ్ చేసుకోవడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో చర్మం మరింత మెరుస్తుంది.

- Advertisement -

కొరియన్ బ్యూటీ ట్రెండులో ఐస్ క్యూబ్స్ మసాజ్ ఎంతో కీలకం. ఐస్ ముక్కలతో ముఖాన్ని సున్నితంగా రుద్దడం వల్ల చర్మం మ్రుదువుగా తయారవుతుంది. అందుకే ఐస్ క్యూబ్స్ తో ముఖం మసాజ్ చేసుకోవడం ఇప్పుడు ప్రసిద్ధమైన ఫేషియల్ బ్యూటీ ట్రెండు అయింది. చర్మం వాపు, ఎరుపుదనం, ఉబ్బరింపులను తగ్గించడంలో కూడా ఐస్ క్యూబ్స్ ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. యాక్నే, ఎగ్జిమా వంటి వాటి వల్ల చర్మంపై తలెత్తే ఇరిటేషన్ ను కూడా ఐస్ క్యూబ్స్ మసాజ్ తగ్గిస్తుంది. మీరు ముఖానికి రాసుకునే బ్యూటీ ఉత్పత్తులను చర్మం లోపలికంటా గ్రహించేలా చేయడంలో ఐస్ క్యూబ్స్ మసాజ్ బాగా పనిచేస్తుంది. ముఖానికి క్రీము లేదా ఏదైనా సిరమ్ రాసుకున్న తర్వాత ఐస్ క్యూబ్ తో ముఖాన్ని సున్నితంగా రుద్దితే క్రీము లేదా సిరమ్ చర్మంలోపలికంటా వెడుతుంది. దీంతో చర్మంపై మంచి ఫలితం కనిపిస్తుంది. నిత్యం ముఖంపై ఐస్ క్యూబ్స్ రబ్ చేయడం వల్ల నల్లటి వలయాలు పోతాయి. మీరు చేయాల్సిందల్లా రోజ్ వాటర్ కొద్దిగా తీసుకొని దాన్ని ఉడికించి అందులో కీరకాయ జ్యూసును కలపాలి. ఆ మిశ్రమాన్ని డీప్ ఫ్రిజర్ లో పెట్టి ఫ్రీజ్ చేయాలి. అవి ఐస్ క్యూబ్స్ లా అయిన తర్వాత వాటితో కంటి చుట్టూతా సున్నితంగా మర్దనా చేయాలి. ఇలా కొన్ని రోజులు పాటు చేస్తే చర్మంపై నల్లటి వలయాలు పోయి మెరుపువస్తుంది.

ముఖంపై యాక్నే తగ్గడానికి కూడా ఐస్ క్యూబ్స్ బాగా పనిచేస్తాయి. ఐస్ క్యూబ్స్ తో ముఖంపై రబ్ చేయడం వల్ల చర్మంపై ఉత్పత్తి అయ్యే నూనె తగ్గుతుంది. యాక్నే వల్ల ఏర్పడ్డ వాపు, దద్దుర్లను కూడా ఐస్ క్యూబ్స్ మసాజ్ తగ్గిస్తుంది. చాలామందికి కళ్ల కింద సంచులు ఏర్పడుతుంటాయి. ఇవి పోగొట్టడంలో కూడా ఐస్ క్యూబ్స్ బాగా పనిచేస్తాయి. ఆ భాగంలో ఐస్ క్యూబ్స్ తో సున్నితంగా మసాజ్ చేయడం వల్ల కళ్ల కింద ఏర్పడ్డ ఉబ్బరింపు పోతుంది. చర్మంపై ఉండే రంధ్రాల నుంచి సహజ నూనెలు స్రవిస్తాయి. దీంతో చర్మం శుభ్రంగా ఉంటుంది. అయితే చర్మ రంధ్రాలలో మురికి చేరినపుడు మొటిమలు, యాక్నే తలెత్తుతాయి. అందుకే ముఖం కడుక్కున్నతర్వాత ఐస్ క్యూబ్స్ తో ముఖంపై సున్నితంగా రుద్దితే చర్మ రంధ్రాలు ముడుచుకుంటాయి. స్కిన్ టోనింగ్ మెరుగుపడుతుంది. అలా చర్మ రంధ్రాలలోని మురికి పోయి చర్మం శుభ్రం అవుతుంది. ముఖంపై ఫౌండేషన్ అప్లై చేసుకునే ముందు ఐస్ క్యూబ్స్ తో ముఖంపై సున్నితంగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల వేసుకున్న మేకప్ చూడడానికి ఎంతో బాగుంటుంది. అంతేకాదు మేకప్ ఎక్కువ సేపు ఉంటుంది కూడా. అలాగే ఐస్ క్యూబ్స్ తో ముఖాన్ని మర్దనా చేసుకోవడం వల్ల చర్మంపై ముడతలు తొందరగా ఏర్పడవు. వయసు మీద పడ్డట్టు కనిపించరు. అలాగే అప్పటికే ముఖంపై ఏర్పడ్డ ముడతలను తగ్గించడంతో పాటు కొత్తవి ఏర్పడకుండా నిరోధిస్తుంది.

అలాగే ఐస్ క్యూబ్స్ మసాజ్ తో చర్మం బిగువు సడలదు. పగిలిన పెదాలపై కూడా ఐస్ క్యూబ్స్ బాగా పనిచేస్తాయి. పెదాలపై ఐస్ క్యూబ్స్ తో సున్నితంగా రుద్దడం వల్ల పెదవుల వాపు తగ్గుతుంది. దీంతోపాటు నీళ్లు బాగా తాగాలి. ఇలా చేస్తే చర్మం, పెదవులకు కావలసిన హైడ్రేషన్ అందుతుంది. విపరీతమైన వేడివల్ల వచ్చే దద్దుర్లు కూడా ఐస్ క్యూబ్స్ మసాజ్ వల్ల తగ్గుతాయి. ఆ దద్దుర్ల వల్ల తలెత్తే నొప్పి కూడా తగ్గుతుంది. దీనికి చేయాల్సిందల్లా ఒక కాటన్ గుడ్డ తీసుకుని అందులో ఐస్ క్యూబ్స్ పెట్టి దానితో దద్దుర్లు వచ్చిన ప్రదేశంలో మెల్లగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి సాంత్వన లభించడంతోపాటు చర్మం తాజాదనంతో కనిపిస్తుంది.

సూర్యరశ్మి చర్మంపై చూపే ప్రభావం నుంచి కూడా ఐస్ క్యూబ్స్ ఉపశమనాన్ని ఇస్తాయి. ఐస్ క్యూబ్స్ అప్లై చేసేటప్పుడు పదినిమిషాల కన్నా ఎక్కువ సేపు చర్మంపై ఉంచకూడదు. అలా రోజులో ఎక్కువసార్లు పెట్టుకోవచ్చు. అలాగే ఒకేచోట ఎక్కువసేపు ఐస్ క్యూబ్ ఉంచకుండా ముఖం అంతటా మెల్లగా రాస్తూ మర్దనా చేయాలి. మీ చర్మం సున్నితస్వభావం కలిగి ఉన్నదైతే ఎక్కువ సేపు చర్మంపై ఐస్ క్యూబ్స్ అప్లై చేయొద్దు. ఒకే చోట ఎక్కువసేపు ఐస్ క్యూబ్ పెట్టకూడదు కూడా. అలా చేస్తే చర్మం దెబ్బతినడంతోపాటు చర్మంపై ఇరిటేషన్ తలెత్తే అవకాశం ఉంది. ఐస్ క్యూబ్ చర్మం మీద పెట్టినపుడు మండినట్టు అనిపిస్తే వెంటనే తీసేయాలి. అలాగే ఐస్ ముక్కను చర్మంపై నేరుగా అప్లై చేయకుండా కూల్ కంప్రసర్ ను ఉపయోగించాలి. లేదా కీరకాయరసంతో చేసిన ఐస్ క్యూబ్స్ ను కాటన్ గుడ్డలో చుట్టి చర్మంపై అప్లై చేయాలి.

చంకల్లో కూడా ఐస్ క్యూబ్స్ అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల చంకల్లో చెమటతో కూడిన దుర్వాసన రాదు. ఆ భాగంలో చర్మానికి కావలసింత హైడ్రేషన్ కూడా అందుతుంది. చంకల్లో ఎక్కువ చెమట కారకుండా కూడా ఐస్ క్యూబ్స్ తోడ్పడతాయి. నిత్యం ఐస్ ముక్కలతో ముఖం మసాజ్ చేసుకోవచ్చు అని సౌందర్య నిపుణులు కూడా చెప్తున్నారు. ఐస్ ముక్కల మసాజ్ ఎలా చేసుకోవాలో చర్మనిపుణులను సంప్రదించి వారు చెప్పిన సూచనలను ఫాలో అవుతూ ఈ వేసవిలో మెరిసే చర్మంతో అందరినీ మెప్పించండి…ఏమంటారు?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News