Friday, September 20, 2024
Homeహెల్త్Yummy Laddoos: నోరూరించే లడ్డూలు

Yummy Laddoos: నోరూరించే లడ్డూలు

అమ్ముమ్మలు … నాన్నమ్మలు ఎంతో ఆప్యాయంగా వారి మనవళ్లు .. మనవరాళ్లకు చేసి పెట్టే స్వీట్‌ ఏదో తెలుసా .. లడ్డూ. అలిగిన పిల్లలను బుజ్జగించడానికి .. ఏడుస్తున్న చిన్నారులను ఏడ్పు మాన్పించడానికి వారి నోట్లో టక్కున దూర్చే స్వీట్ కూడా లడ్డూనే. పండగొచ్చినా .. చుట్టాలు వచ్చినా .. సెలవులొచ్చినా ప్రతి ఇంట్లోనూ ఉండేది .. అందరి నోరు తీపి చేసేది లడ్డూనే. అయితే ఆ తరం వారు చేసిన వంటలను నేటి తరం మర్చిపోతున్నారు. స్పీడ్ జనరేషన్‌లో లడ్డూలు కూడా స్వీట్‌షాప్‌ల్లోనే కొంటున్నారు. అయితే .. లడ్డూల తయారీ చాలా సులభం. కొత్తగా వంట నేర్చుకోవడం మొదలు పెట్టిన వారు కూడా ఈజీగా లడ్డూలు చేసేయొచ్చు. బూందీలడ్డు .. మోతీచూర్‌ లడ్డు .. రవ్వ లడ్డు, కొబ్బరి రవ్వలడ్డు ఇలా ఒక్కటేమిటి రకరకాల లడ్డూలు ఈజీగా వండేయ వచ్చు. మరి అదెలాగో తెలుసుకుందామా …!

- Advertisement -

బూందీలడ్డు
కావల్సిన పదార్థాలు
శనగపిండి- ముప్పావు కిలో
నూనె- ఒక కేజి,
పంచదార- ఒక కేజి,
యాలకుల పొడి- ఒక టీస్పూన్‌,
కిస్మిస్- 100గ్రాములు,
జీడిపప్పు-100 గ్రాములు
తయారు చేసే విధానం

ఒక పాత్రలో శనగపిండి, నీళ్లు పోసి బూందీ వేయడానికి వీలుగా పిండిని కాస్త జారుడుగా కలుపుకోవాలి. స్టవ్‌పై కళాయి ఉంచి నూనె పోసి అది బాగా మరిగాక బూందీ దూసే గరిటెలో శనగపిండిని వేసి చేతితో కలుపుతూ ఉంటే కళాయిలో బూందీ పడుతూ ఉంటుంది. ఈ బూందీని వేగిన తరువాత తీసి మరో గిన్నెలో ఉంచుకోవాలి. మరో కళాయి స్టవ్‌పై ఉంచి అందులో పంచదార, నీళ్లు పోసి కాస్త లేత పాకం రాగానే బూందీని అందులో వేసి ఆపకుండా ఒక పావుగంటపాటు కలుపుతూ ఉండాలి. ఇందులో యాలకుల పొడి వేసి మళ్లీ ఒకసారి బాగా కలపాలి.ఇందులో నేతిలో కిస్మిస్ మరియు జీడిపప్పును దోరగా వేయించి కలపాలి. అర చేతికి నెయ్యి లేదా నూనె రాసుకుని లడ్డూలుగా చుట్టుకోవాలి.

రవ్వ లడ్డు

కావలసిన పదార్థాలు:
బొంబాయిరవ్వ – పావుకిలో
వేయించిన శనగపిండి – పావుకిలో
పంచదార – అరకిలో
నెయ్యి – 200 గ్రాములు
జీడిపప్పు – 50 గ్రాములు
యాలకులు – 6
ఎండుకొబ్బరి – ఒక చిప్ప
తయారు చేసే విధానం

ముందుగా జీడిపప్పును కొద్దిగా నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. మిగిలినవి నెయ్యిలో రవ్వను వేసి, లేత గోధుమ రంగు వచ్చే వరకు వేయించి ప్రక్కన వెట్టుకోవాలి. రవ్వ మొరుముగా వుంటే మిక్సీలో వేసి కొంచెం సన్నగా అయ్యేవరకు గ్రైండ్ పట్టాలి. ఇప్పుడు స్టౌ మీద పాత్ర ఉంచి, అందులో కొంచెం నీళ్లు పోసి, పంచదార కలిపి తీగపాకం పచ్చే వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత ఆ పాకంలో పక్కన పెట్టుకున్న రవ్వ, జీడిపప్పు, శనగపిండి, ఎండుకొబ్బరి, యాలకులను కలిపి కొద్ది వేడిమీద ఉండలుగా చేయాలి. ఇవి 4 రోజులపాటు నిలువ వుంటాయి. పాకం బాగా కుదిరితే రవ్వలడ్డు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది.

కొబ్బరి రవ్వలడ్డు
కావల్సిన పదార్థాలు
బొంబాయి రవ్వ : 2 కప్పులు
ఎండుకొబ్బరి పొడి : 1 కప్పు
యాలకులపొడి : అర టేబుల్‌ స్పూన్‌
పాలు : అర కప్పు
నెయ్యి : 3 స్పూన్లు
చక్కెర : ఒకటిన్నర కప్పు
జీడిపప్పు : పావు కప్పు
ఎండుద్రాక్ష : పావు కప్పు
తయారీ :

బొంబాయి రవ్వను పాన్‌లో వేసి స్పూన్‌ నెయ్యిని చేర్చి దోరగా వేయించాలి. అందులోనే ఎండు కొబ్బరి పొడి కూడా వేసి 5 నిమిషాలపాటు వేయించాలి. రవ్వ మిశ్రమంలో చక్కెర, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత నెయ్యిలో జీడిపప్పు, ఎండుద్రాక్ష వేయించి రవ్వలో కలుపాలి. రవ్వ కొంచెం చల్లారాక అందులో మరిగించిన పాలు పోసి ఉండలు చేసుకుంటే సరిపోతుంది.

సగ్గుబియ్యం లడ్డు
కావలసిన పదార్థాలు
సగ్గుబియ్యం – ఒక కప్పు
చక్కెర – ఒక కప్పు
బొంబాయి రవ్వ – రెండు టేబుల్ స్పూన్లు
ఆరెంజ్ ఫుడ్ కలర్ – చిటికెడు
జీడిపప్పు – 10
నెయ్యి – సరిపడా మోతాదు
తయారు చేసే విధానం

సగ్గుబియ్యం తీసుకుని అరగంట పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అరగంట పాటు నానబెట్టిన తర్వాత సగ్గుబియ్యంలో నీటిని పూర్తిగా వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద ఒక కడాయి పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఇందులో జీడిపప్పు పలుకులు వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరికొంత నెయ్యి వేసి వేడిచేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి తడిపోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే బొంబాయిరవ్వ కూడా వేసి వేయించాలి. సగ్గు బియ్యం, బొంబాయి రవ్వ వేగిన తరువాత ఇందులో చక్కెర వేసి కలుపుకోవాలి. చక్కెర బాగా కరిగిన తరువాత ఇందులో ఆరెంజ్ ఫుడ్ కలర్, జీడిపప్పు పలుకులు వేయాలి. మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ అడుగంటకుండా చూసుకోవాలి. మిశ్రమం అంతా దగ్గరకు వచ్చాక ఇందులో జీడిపప్పు పలుకులను (Cashew nuts) వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మిశ్రమమంతా చల్లారాక కొద్దిగా వేడిగా ఉన్న సమయంలో చేతికి నెయ్యి రాసుకుని లడ్డూల్లా చుట్టుకోవాలి. లడ్డూలపైన జీడిపప్పులను గార్నిష్ చేస్తే సగ్గుబియ్యం లడ్డూలు రెడీ.

మోతిచూర్ లడ్డూ
కావల్సిన పదార్థాలు
శెనగపిండి రెండు కప్పులు సెనగపిండి
పంచదార రెండు కప్పులు
యాలకుల పొడి
బాదం
పిస్తా
కాజు
నెయ్యి – మూడు స్పూన్‌లు
వేయించడానికి సరిపడా నూనె
కొన్ని చుక్కల ఫుల్‌కలర్‌

తయారు చేసే విధానం

ఒక గిన్నెలో రెండు కప్పుల శెనగపిండి తీసుకోవాలి. అందులో కొద్దిగా ఫుడ్ కలర్, నీళ్ళు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండిని జారుగా బూందీ పిండిలాగా కలుపుకోని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెలో రెండు కప్పుల పంచదారను తీసుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసి గులాబ్ జామ్ పాకంలా పాకాన్ని తయారుచేసుకోవాలి. ఈ పాకంలో కొద్దిగా యాలకుల పొడిని కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పాకాన్ని పక్కన పెట్టుకోవాలి. బూందీ తయారీ కోసం స్టవ్ మీద బాండ్లి పెట్టి అందులో నూనె పోసి వేడి చేయాలి. ఆ నూనె వేడెక్కిన తర్వాత బూందీ గరిటె పెట్టి అందులో కలుపుకున్న శనగపిండి మిశ్రమాన్ని బూందీలా జారవిడవాలి. బూందీ మంచి కలర్ వచ్చాక ఒక గిన్నెలోనికి తీసుకోవాలి. ఈ బూందీ మిశ్రమాన్ని తయారు చేసుకున్న పాకంలో వేసి కలుపుకోవాలి. ఇందులో బాదం, కాజు, పిస్తా, మూడు చెంచాల నెయ్యి వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చేత్తో లడ్డూల ఉండలుగా చుట్టుకోవాలి.

అటుకుల లడ్డు
అటుకులు: ఒక కప్పు (లావుగా ఉండేవి)
పల్లీలు: అర కప్పు
చక్కెర: అర కప్పు
నెయ్యి: రెండు టేబుల్‌ స్పూన్లు,
తరిగిన బాదం, కాజు, కిస్మిస్‌: పావు కప్పు,
యాలకుల పొడి: చిటికెడు.
తయారీ విధానం
అటుకులను సన్నని మంటపై అయిదు నిమిషాల పాటు వేయించాలి. దోరగా వేగాక చల్లార్చి పొడి చేసుకోవాలి. పల్లీలు వేయించి, పొట్టుతీసి పొడి చేసుకోవాలి. చక్కెర కూడా మెత్తగా గ్రైండ్‌ చెయ్యాలి. నేతిలో డ్రైఫ్రూట్స్‌ వేయించాలి. ఒక గిన్నెలో అటుకులు, చక్కెర, పల్లీల పొడులు, నెయ్యితోపాటు డ్రైఫ్రూట్స్‌, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని లడ్డూలు చేసుకుంటే నోరూరించే అటుకుల లడ్డూ సిద్ధం. చక్కెర తినని వాళ్లు బెల్లం పొడి వేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News