Friday, November 22, 2024
Homeహెల్త్Rice starch: గంజితో మెరిసే మేని సౌందర్యం

Rice starch: గంజితో మెరిసే మేని సౌందర్యం

పూర్వం మన పెద్దవాళ్లు అన్నంలోంచి గంజి తీసేవారు. ఆ గంజిని నిత్యం తాగేవారు. ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. ఇందుకు కారణం అన్నం గంజిలో ఎన్నో విటమిన్లు, పోషకాలు ఉండడమే. అందుకే గంజి శరీరాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుందని పోషకాహార నిపుణులు సైతం చెప్తారు. గంజి శరీర ఉష్ణోగ్రతను పెరగకుండా నియంత్రిస్తుంది. అందుకే మన పెద్దవాళ్లు జ్వరం వచ్చినపుడు గంజి తాగమంటారు. అంతేకాదు చర్మాన్ని సున్నితంగా, అందంగా ఉండేలా కూడా గంజి తోడ్పడుతుంది. చర్మ వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది. గంజి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా మలబద్దకాన్ని తగ్గిస్తుంది. నీరసంగా ఉన్నప్పుడు గంజి తాగితే ఇన్ స్టంట్ ఎనర్జీ వస్తుంది. గంజిలో పోషకవిలువలు, విటమిన్లు పుష్కలంగా ఉండడమే ఇందుకు కారణం. పసిపిల్లలకు, ఎదిగే పిల్లలకు రోజూ గంజి తాగిస్తే ఎంతో మంచిదంటున్నారు ఆరోగ్యనిపుణులు. దీన్ని తాగడం వల్ల పిల్లల శారీరక ఎదుగుదల బాగుంటుందంటున్నారు.
చిన్నారులు విరోచనాలు, వాంతులతో బాధపడుతున్నప్పుడు పెద్దవాళ్లు పూర్వం గంజిని ఇచ్చేవారు. గంజి వీటిని నివారించడంలో ఎంతో బాగా పనిచేస్తుంది. అందుకే గంజివార్చేలా అన్నం వండుకుంటే మంచిదని, ఇంటిల్లిపాదికీ అది ఆరోగ్యాన్ని ఇస్తుందని పోషకాహారనిపుణులు అంటున్నారు. శిరోజాల ఆరోగ్యానికి కూడా గంజి ఎంతో సహకరిస్తుంది. వెంట్రుకలు ద్రుఢంగా ఉండేలా చేస్తుంది. శిరోజాలను మెరిసేలా, సిల్కులా ఉండేలా చేస్తుది. జుట్టు పెరగడానికి కూడా గంజి దోహదపడుతుందిట. గంజిలో ఆరోగ్యకరమైన అమినో ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు, యాంటాక్సిడెంట్లు ఉన్నాయి. అంతేకాదు గంజిలో శరీరారోగ్యానికి ఉపకరించే పలు పోషకాలతో పాటు విటమిన్ సి, విటమిన్ బి, ఖనిజాలు కూడా ఉన్నాయి.
గంజిలోని కార్బోహైడ్రేట్లు శరీరానికి ఎనర్జీని ఇవ్వడమే కాదు గొప్ప మూడ్ రిలీవర్ గా కూడా అది పనిచేస్తుంది. ఉల్లాసంగా ఉంచుతుంది. ఉదయమే శరీరానికి కావలసినంత ఇన్ స్టాంట్ ఎనర్జీని గంజి ఇస్తుందంటారు పోషకాహారనిపుణులు. వేసవి కాలంలో ఉదయమే గంజి తాగడం వల్ల శరీరానికి కావలసినంత హైడ్రేషన్ అందుతుంది. అందుకే గంజిని నేచురల్ ఓరల్ హైడ్రేషన్ అంటారు. దీనివల్ల డీహైడ్రరేషన్ బారిన పడం. అందుకే ఉదయమే ఒక పెద్ద గ్లాసుడు గంజి తాగమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. గంజి చర్మాన్ని పట్టులా మ్రుదువుగా ఉంచుతుంది. అందుకే యాక్నే, పొడిచర్మం వంటి
సమస్యలతో బాధపడేవారిని నిత్యం గంజి తాగమని పోషకాహారనిపుణులు సలహా ఇస్తున్నారు. ఆరోగ్యకరమై చర్మం కోసం గంజిని రకరకాలుగా వాడొచ్చు. బియ్యం నీళ్లను ఐస్ ట్రేలో పోసి అది ఐస్ గడ్డలు అయ్యేదాకా ఫ్రిజ్ లో ఉంచాలి. ఈ బియ్యపు నీళ్లల్లో కీరకాయ గుజ్జును కూడా కలిపి ఐస్ క్యూబ్స్ లా చేసి వాటిని ముఖంపై టోనర్ గా ఉపయోగించవచ్చని బ్యూటీ నిపుణులు చెపుతున్నారు. ఈ ఐస్ క్యూబ్స్ చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.

- Advertisement -

రైస్ వాటర్ క్యూబ్స్ లో పోషకాలు పుష్కలంగా ఉండడమేనని ఇందుకు కారణమని బ్యూటీనిపుణులు చెప్తారు. ఇవి చర్మానికి రక్తప్రసరణ బాగా జరిగేట్టు చేస్తాయి. దీంతో కొల్లాజెన్ బాగా ఉత్పత్తి అవుతుంది. అంతేకాదు విటమిన్ ఎ, సి, కె, ఖనిజాలు, యాంటాక్సి డెంట్లను చర్మానికి పుష్కలంగా అందిస్తుంది. రైస్ వాటర్ చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంతో పాటు చర్మాన్ని ఎంతో కాంతివంతం చేస్తుంది. యంగ్ గా కనిపించేలా చేస్తుంది. చర్మంపై గంజి అప్లై చేయడం వల్ల సూర్యరశ్మి, వాపు, దద్దుర్లు, దురద, ఇరిటేషన్ వంటి సమస్యల నుంచి సాంత్వన లభిస్తుంది. ట్యానింగ్ ను సైతం గంజి తగ్గిస్తుంది. జిడ్డు చర్మం ఉన్నవాళ్లు రైస్ వాటర్ తో ముఖం కడుక్కుంటే చర్మానికి ఉండే జిడ్డు స్వభావం తగ్గుతుంది. దీంతో మొటిమలు, యాక్నే వంటి సమస్యలు చర్మంపై తలెత్తవు. అన్నం నుంచి వార్చిన గంజిని తీసి చల్లార్చి ఫ్రిజ్ లో ఉంచాలి. లేదా బియ్యం నానబెట్టిన నీళ్లను వడగట్టి వాటిని ఫ్రిజ్ లో ఉంచి చర్మానికి అప్లై చేసుకోవచ్చు. ఈ నీళ్లను సీసాలో పోసి ఫ్రిజ్ లో భ్రదం చేసుకోవచ్చు. బియ్యం నీళ్లు వాడేముందు మొదటగా ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆతర్వాత బియ్యం నీళ్లను ముఖం మీద స్ప్రే చేసుకొంటే టోనర్ గా బాగా పనిచేస్తుంది. స్ప్రే చేసుకోకుండా కాటన్ బాల్ ని రైస్ వాటర్ లో ముంచి దానితో ముఖం మీద రైస్ వాటర్ అప్లై చేసుకోవచ్చు కూడా. 20 నుంచి 30 నిమిషాల పాటు దాన్ని ఆరనిచ్చి ఆతర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇంకో చిట్కా ఏమిటంటే కొద్ది గంజిలో కాస్త పసుపు వేసి బాగా కలిపి దాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి.
ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా చేస్తే ముఖంపై ఏర్పడ్డ నల్లమచ్చలు, మొటిమలు పోయి చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది. ఇంకొక చిట్కా ఏమిటంటే కొద్దిగా గంజి తీసుకుని అందులో రోజ్ వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాస్తూ ఐదునిమిషాలు మసాజ్ చేయాలి. ఆ తర్వాత ముఖాన్ని శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే ముఖంపై ఏర్పడ్డ మలినాలు పోతాయి. అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా గంజి, లావెండర్ ఆయిల్ వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి రాసుకొని అది ఎండిపోయే వరకూ అంటే ఒక అరగంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల ముఖంపై ముడతలు తగ్గి యంగ్ గా కనిపిస్తారు. ఇలా మీ బ్యూటీ రొటీన్ లో గంజి లేదా బియ్యం నీళ్లను భాగం చేసుకుంటే మీరు ఆరోగ్యంతో పాటు పొందే అందచందాలు కూడా ఎన్నో.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News