Homeఇంటర్నేషనల్SCO summit: ఉగ్రపోరు.. ఏఐ, ఇంధన రంగాల్లో మైత్రి

SCO summit: ఉగ్రపోరు.. ఏఐ, ఇంధన రంగాల్లో మైత్రి

బిష్కెక్‌(తెలుగుప్రభ): కిర్గిజ్‌స్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో 13 కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. ప్రాంతీయ భద్రత, ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఇంధన భద్రత, వాతావరణ మార్పులు, విపత్తుల నిర్వహణ, కృత్రిమ మేధ (ఏఐ), సమాచార రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేలా ఒప్పందాలు, అవగాహన పత్రాలు కుదిరాయి. నాలుగు ఎంవోయూలతో పాటు 20కి పైగా నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఒప్పందాలు అధికారిక భాషల్లో ఇంగ్లిష్‌ను చేర్చేందుకు కూడా అంగీకరించారు. సదస్సులో 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ‘బిష్కెక్‌ డిక్లరేషన్‌’ను ఆమోదించారు. ఒప్పందాలు చార్టర్‌లో మార్పులు, చేర్పులకు సంబంధించిన ప్రొటోకాల్‌కు సభ్యదేశాల నేతలు ఆమోదం తెలిపారు. దీంతో సంస్థ భవిష్యత్‌ వ్యవస్థలో భారత్‌ మరింత చురుకైన పాత్ర పోషించేందుకు అవకాశం ఏర్పడిందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.

- Advertisement -

ఉగ్రవాదం, డ్రగ్స్‌పై ఉమ్మడి పోరాటం..

ఉగ్రవాదం, తీవ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, సరిహద్దులు దాటి జరిగే నేరాలను ఎదుర్కొనేందుకు ‘యూనివర్సల్‌ సెంటర్‌ ఫర్‌ కౌంటరింగ్‌ ఛాలెంజెస్‌ అండ్‌ థ్రెట్స్‌’ ఏర్పాటుకు నిర్ణయించారు. భద్రతా సమాచార మార్పిడిని మరింత బలోపేతం చేయనున్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నార్కో టెర్రరిజంపై చర్యలకు సంబంధించిన పలు నిర్ణయాలు తీసుకున్నారు. 2030 వరకు డ్రగ్‌ వ్యసనాన్ని ఎదుర్కొనే సహకార కార్యక్రమాన్ని ఆమోదించారు. సింథటిక్‌ డ్రగ్స్‌, వాటి ముడి పదార్థాల అక్రమ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రత్యేక కార్యాచరణకు కూడా ఆమోదం లభించింది. వ్యవస్థీకృత, సరిహద్దు నేరాలపై సభ్యదేశాల చట్ట అమలు సంస్థల మధ్య సమన్వయాన్ని పెంచేలా మరో ప్రొటోకాల్‌పై అంగీకారం కుదిరింది.

ఇంధనం, వాతావరణంపై ఒప్పందాలు..

ఇంధన పొదుపు, సామర్థ్య పెంపు రంగాల్లో సహకారానికి సంబంధించిన ప్రకటనను సభ్యదేశాలు ఆమోదించాయి. ఇంధన వ్యవస్థల అభివృద్ధి, ఆధునికీకరణ, స్థిరత్వాన్ని పెంచేందుకు మరో ప్రకటనకు అంగీకరించారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు సహకారంపై ఎంవోయూ కుదిరింది. వాతావరణ అనుకూల సాంకేతికత, వాతావరణ మార్పులకు తట్టుకునే అభివృద్ధికి ఇది దోహదపడనుంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రభావిత దేశాలకు పరస్పరం సహాయం అందించేందుకు కూడా సభ్యదేశాలు అంగీకరించాయి. విపత్తుల నిర్వహణ, మానవతా సహాయం, విపత్తులను తట్టుకునే మౌలిక వసతుల అభివృద్ధిలో సహకారానికి ఇది ఉపయోగపడనుంది.

ఏఐ రంగంలోనూ సహకారం..

సమాచారం, మీడియా రంగాల్లో పరస్పర సహకారానికి ఎంవోయూ కుదిరింది. ప్రాంతీయ మీడియా వేదికల్లో సభ్యదేశాల అభిప్రాయాల విస్తృత ప్రచారానికి ఇది దోహదపడనుంది. కృత్రిమ మేధ రంగంలోనూ సహకారానికి ప్రత్యేక ఎంవోయూపై సంతకాలు జరిగాయి. ఏఐని బాధ్యతాయుతంగా, సమ్మిళితంగా వినియోగించడంతో పాటు డిజిటల్‌, ఏఐ సాంకేతికతలో భారత్‌ అనుభవాన్ని ఇతర సభ్యదేశాలతో పంచుకునేందుకు ఇది అవకాశం కల్పించనుంది.

ఉగ్రవాదంపై మోడీ స్పష్టమైన వైఖరి..

సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఒప్పందాలు తదుపరి 25 ఏళ్లకు స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ రూపొందించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. భద్రత, అనుసంధానం, అవకాశాలపై భారత్‌ గత సదస్సులో ప్రతిపాదించిన దృష్టికోణాన్ని ఆచరణలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఘర్షణలను ప్రస్తావిస్తూ.. యుద్ధభూమిలో సమస్యలకు పరిష్కారం లభించదని, చర్చలు, దౌత్యమే ముందుకు వెళ్లే మార్గాలని మోడీ స్పష్టం చేశారు. ఉగ్రవాదం మానవాళికి తీవ్రమైన ముప్పని పేర్కొంటూ.. ఉగ్రవాద వ్యవస్థను సమూలంగా నిర్మూలించేందుకు సభ్యదేశాలు కట్టుబడి చర్యలు తీసుకోవాలని కోరారు. ఉగ్రవాదంపై పోరులో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలకు తావుండకూడదని స్పష్టం చేశారు. మోడీ ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కూడా సదస్సులోనే ఉన్నారు. అఫ్గానిస్తాన్ లో శాంతి, స్థిరత్వంతో యూరేషియా ప్రాంత భద్రత ముడిపడి ఉందని మోడీ పేర్కొన్నారు. ప్రాంతీయ అనుసంధాన ప్రాజెక్టులు మార్కెట్లను అనుసంధానించడంతో పాటు ఆయా దేశాల సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని సూచించారు. పశ్చిమాసియా సంక్షోభాన్ని ఇందుకు ఉదాహరణగా ప్రస్తావించిన మోడీ.. అక్కడ ప్రారంభమైన ఘర్షణ ప్రభావం ఆ ప్రాంతానికే పరిమితం కాలేదన్నారు. ఇంధన భద్రత, సముద్ర వాణిజ్యం, సరఫరా గొలుసులపై కూడా ప్రభావం పడుతోందని వివరించారు. యుద్ధభూమిలో కాకుండా చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. యువతను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది చివర్లో తొలి ‘ఎస్‌సీవో సివిలైజేషన్‌ డైలాగ్‌ ఫోరం’ను భారత్‌లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని మోడీ ప్రకటించారు. ప్రాంతీయ దేశాల మధ్య సాంస్కృతిక, నాగరికతల పరస్పర మార్పిడికి ఇది వేదికగా నిలుస్తుందని తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్‌ అక్రమ రవాణా కేవలం నేరం మాత్రమే కాదని, యువతతోపాటు ప్రాంతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు అని హెచ్చరించారు. ఇదే సదస్సులో భారత్ తరఫున ప్రతిష్టాత్మక ‘ఎస్‌సీవో సివిలైజేషనల్ డైలాగ్ ఫోరమ్’ తొలి సదస్సును ఈ ఏడాది చివర్లో భారత్‌లో నిర్వహించనున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 1 వరకు బిష్కెక్‌లో జరిగిన ఈ సదస్సుకు కిర్గిజ్‌స్థాన్‌ అధ్యక్షుడు సదీర్‌ జపరోవ్‌ అధ్యక్షత వహించారు.“ఎస్‌సీవో 25 ఏళ్లు: సుస్థిర శాంతి, అభివృద్ధి, సౌభాగ్యం కోసం సమష్టిగా ముందుకు”’ అనే థీమ్‌తో సదస్సు నిర్వహించారు.

ఎస్‌సీవో దేశాలకు జిన్‌పింగ్‌ పిలుపు..
బిష్కేక్: షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) కూటమి దేశాలు ప్రాంతీయ భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్పష్టం చేశారు. కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కేక్‌లో జరిగిన ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లతో కలిసి పాల్గొన్న ఆయన ప్రసంగించారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం అనే మూడంచెల ముప్పులతో పాటు సరిహద్దు నేరాలు, మత్తుపదార్థాల అక్రమ రవాణా, టెలికాం/సైబర్ మోసాలపై ఎస్‌సీవో సభ్యదేశాలు ఉమ్మడిగా కొరడా ఝుళిపించాలని ఆయన పిలుపునిచ్చారు. సభ్యదేశాల అంతర్గత వ్యవహారాల్లో బాహ్య శక్తుల జోక్యాన్ని అడ్డుకోవాలని, రాజకీయ స్థిరత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను భగ్నం చేయాలని అమెరికాను పరోక్షంగా ఉద్దేశిస్తూ ఆయన వ్యాఖ్యానించారు. అణు భద్రత, బయో-సెక్యూరిటీ, అంతరిక్ష భద్రత , సమాచార సాంకేతిక రక్షణలో పరస్పర సహకారం అవసరమని నొక్కిచెప్పారు. గత 25 ఏళ్లలో ఎస్‌సీవో అసాధారణ ప్రస్థానాన్ని సాగించి.. ‘గ్లోబల్‌ సౌత్‌’ దేశాల సహకారానికి కీలక వేదికగా ఎదిగిందని పేర్కొన్నారు. కూటములు కట్టుకోకపోవడం, ఘర్షణలకు దూరంగా ఉండటం, ఏ మూడో దేశాన్ని లక్ష్యంగా చేసుకోకపోవడం వంటి సూత్రాలతో ప్రాంతీయ దేశాలు ఉమ్మడి భవిష్యత్తును నిర్మించుకుంటున్నాయని చెప్పారు. రాబోయే మూడేళ్లలో ఎస్‌సీవో భాగస్వామ్య దేశాలలో 100 సాంకేతిక సహకార ప్రాజెక్టులను చేపడతామని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), పునరుత్పాదక ఇంధన రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తామని షీ జిన్‌పింగ్ ప్రకటించారు. వ్యాపార లాజిస్టిక్స్ వేగవంతం చేయడానికి టియాంజిన్‌లో ‘చైనా – ఎస్‌సీవో పోర్ట్ ఎకనామిక్ కోఆపరేషన్ సెంటర్’ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రపంచంలో ఏ ఒక్క దేశం లేదా నిర్దిష్ట కూటమి ఆధిపత్యం నిజమైన బహుళపక్షవాదం కాదని, ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యాన్ని పునరుద్ధరిస్తూ సమానత్వంతో కూడిన అంతర్జాతీయ పాలన అందించడానికి పెద్ద దేశాలు బాధ్యత వహించాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News