19 Killed as Gen-Z Protests Rock Nepal: సోషల్ మీడియా యాప్‌లపై ప్రభుత్వం విధించిన నిషేధం నేపాల్‌లో పెను దుమారం రేపింది. ప్రభుత్వ నిర్ణయానికి, దేశంలో పేరుకుపోయిన అవినీతికి వ్యతిరేకంగా యువత (జెన్-జి) చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. రాజధాని కాఠ్‌మాండూ సోమవారం అట్టుడికిపోయింది. వేలాదిగా రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులపై పోలీసులు జరిపిన చర్యల్లో 12 ఏళ్ల బాలుడితో సహా 19 మంది మరణించగా, 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
ALSO READ: Nepal Students: నేపాల్‌లో తీవ్ర ఉద్రిక్తత.. పార్లమెంట్‌లోకి దూసుకెళ్లిన యువత
రంగంలోకి సైన్యం..
పరిస్థితి అదుపుతప్పుతుండటంతో ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. ఆందోళనకారులు కర్ఫ్యూను సైతం లెక్కచేయకుండా పార్లమెంటు వంటి కీలక భవనాల్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు.
హోంమంత్రి రాజీనామా..
ఈ హింసాత్మక ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ, నేపాల్ హోంమంత్రి రమేశ్ లేఖక్ తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం సాయంత్రం ప్రధాని కేపీ శర్మ ఓలీ అధ్యక్షతన జరిగిన అత్యవసర కేబినెట్ సమావేశంలో ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు.
ALSO READ: US shoplifting: అమెరికాలో పరువు తీస్తున్న భారత మహిళలు.. వీడియో వైరల్
మా తరంతోనే అవినీతి అంతం కావాలి..
కేవలం సోషల్ మీడియా నిషేధమే కాదని, దేశ వ్యవస్థల్లో పాతుకుపోయిన అవినీతిపై తమ ప్రధాన పోరాటమని నిరసనకారులు స్పష్టం చేస్తున్నారు. “ఈ అవినీతి సంస్కృతి మా తరంతో అంతం కావాలి” అని యువత నినదిస్తోంది. ఈ ఆందోళనలు దేశంలోని పోఖారా వంటి ఇతర నగరాలకు కూడా వ్యాపించాయి. ప్రజాగ్రహం నేపథ్యంలో ప్రభుత్వం నిషేధించిన 26 యాప్‌లపై తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ALSO READ: Australia: ఆస్ట్రేలియాకు వెళ్తున్నారా?.. మల్లెపూలే కాదు వీటికీ నో ఎంట్రీ.. ఓసారి చెక్ చేసుకోండి


