ఉత్తర అమెరికాను మంచు తుపాను వణికిస్తూనే ఉంది. ప్రజల్ని తన గుప్పిట్లో పెట్టుకుని గజగజలాడిస్తోంది. అత్యల్పస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అక్కడి ప్రజలు ఇళ్ల నుండి బయటికి వస్తే.. గడ్డకట్టేంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికాలోని అనేక ప్రాంతాల్లో ఎమెర్జెన్సీని ప్రకటించారు. దాంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే గడుపుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ కోతలు ఉండటంతో.. హీటర్లు పనిచేయక.. చలిని తట్టుకోలేక లక్షల మంది అంధకారంలో ఉన్నారు. ఇప్పటివరకూ నార్త్ అమెరికాలో మంచుతుపాను కారణంగా 31 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే 12 మంది మరణించినట్లు సమాచారం.
ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతే ఆ తుపానును ‘బాంబ్ సైక్లోన్’ అని పిలుస్తారు. న్యూయార్క్ రాష్ట్రంలోని బఫెలో నగరంలో హరికేన్ స్థాయిలో చలిగాలులు వీస్తుండటంతో స్థానిక ప్రజలు నాలుగు రోజులుగా ఇళ్లకే పరిమితమయ్యారు. పలు ప్రాంతాల్లో వాహనాల్లో బయటకు వచ్చినా రోడ్లపై అవి జారిపోతుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పశ్చిమ న్యూయార్క్ లోని లేక్స్ ప్రాంతంలో ఆదివారం రాత్రి సమయంలో రెండు నుంచి మూడు అడుగుల మేర మంచు పేరుకుపోయింది. భారీ మంచుతుపాను కారణంగా.. కార్లు, ఇతర వాహనాలన్నీ మంచుదుప్పటి కప్పుకుంటున్నాయి.
శని, ఆదివారాల్లో నార్త్ అమెరికాలోని విమానాశ్రయాలను మూసివేశారు. స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం నాటికి కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. లేని పక్షంలో సోమవారం కూడా విమానాల రాకపోకలు రద్దయ్యే అవకాశం ఉంది. మంచు తుపాను కారణంగా.. ప్రయాణికులు ఎయిర్ పోర్టులలోనే నిరీక్షిస్తున్నారు.