Gaza: గాజాపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరమవుతున్నాయి. తాజాగా గాజాలోని అల్ షిఫా ఆసుపత్రిపై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపింది. ఈ దాడిలో ప్రముఖ మీడియా సంస్థ అల్ జజీరాకు చెందిన ఐదుగురు జర్నలిస్టులు మృతి చెందారు. వారితో పాటు ఇద్దరు పౌరులు కూడా మరణించారు. ఆసుపత్రి ప్రధాన ద్వారం వెలుపల మీడియా ప్రతినిధుల కోసం టెంట్ ఏర్పాటు చేశారు. ఈ టెంట్ ను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్లు అల్ జజీరా మీడియా సంస్థ ప్రకటించింది.
ఈ ఘటనలో అనాస్ అల్ షరీఫ్, మహమ్మద్ ఖ్రీఖే, ఇబ్రహీం జహర్, మహమ్మద్ నౌఫల్, మోమెన్ అలివా మరణించినట్లు అల్ జజీరా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. దాడులు జరిగిన అనంతరం ఇజ్రాయెల్ మిలిటరీ ఒక ప్రకటన చేసింది. ఈ దాడిలో మరణించిన అనాస్ అల్ షరీఫ్ ని లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లు ధృవీకరించింది.
అనాస్ అల్ షరీఫ్ జర్నలిస్ట్ ముసుగులో ఉన్న ఓ ఉగ్రవాది అని, హమాస్ ఉగ్రవాద సంస్థలో షరీఫ్ ఒక సెల్‌కు నాయకత్వం వహించాడని పేర్కొంది. ఇజ్రాయెల్ పౌరులు, ఐడీఎఫ్ బలగాలపై జరిగిన రాకెట్ దాడులకు అతడే బాధ్యత వహించాడని ఐడీఎఫ్ ఆరోపించింది. గాజా నుంచి సేకరించిన పత్రాలు, ఉగ్రవాదుల శిక్షణ జాబితా, వేతన రికార్డులను పరిశీలించిన తరువాతే అతడు హమాస్ ఉగ్రవాది అని నిర్ధారించినట్లు ఐడీఎఫ్ తెలిపింది.
ఈ దాడికి కొన్ని నిమిషాల ముందే.. గాజా నగరంలో ఇజ్రాయెల్ బాంబు దాడులను తీవ్రతరం చేసిందని అనాస్ అల్-షరీఫ్ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు. గాజాపై జరిగిన ఈ దాడిని పాలస్తీనా జర్నలిస్టుల సంఘం, కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ తీవ్రంగా ఖండించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా జర్నలిస్టులను ఉగ్రవాదులుగా ముద్రవేయడం ఏంటని సీపీజే ప్రాంతీయ డైరెక్టర్ సారా ఖుదా ప్రశ్నించారు. 22 నెలలుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటివరకు సుమారు 200 మంది మీడియా సిబ్బంది మరణించినట్లు మీడియా హక్కుల సంఘాలు చెబుతున్నాయి.


