6.1 Magnitude Earthquake in Turkey : టర్కీలో మరోసారి భూకంపం సంభవించింది. పశ్చిమ టర్కీలోని పలు ప్రాంతాలను 6.1 తీవ్రతతో కూడిన భారీ భూకంపం.. ప్రజలను తమ ఇళ్ల నుంచి పరుగులు పెట్టించింది. దీంతో రాజధాని ఇస్తాంబుల్, ఇజ్మీర్ వంటి ప్రధాన నగరాల్లోనూ తీవ్ర ప్రకంపనలు సంభవించాయి. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం ఈ భూకరంపం తీవ్ర భయాందోళనలను సృష్టించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఓ యువతి ప్రాణాలు కోల్పోగా.. ఆస్తి నష్టం కూడా జరిగినట్లు తెలుస్తోంది.
10 కిలోమీటర్లు లోతుగా..
టర్కీ విపత్తు నిర్వహణ సంస్థ (AFAD) తెలిపిన వివరాలు ప్రకారం.. ఈ భూకంపం బలికేసిర్ ప్రావిన్స్‌లోని సిందిర్గి జిల్లాలో చోటు చేసుకుంది. భూమి లోపల 11 కిలో మీటర్ల లోతులో దీని కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. సిందిర్గి పట్టణంలో దాదాపు 16 భవనాలు కూలిపోయినట్లు స్థానిక మీడియా పేర్కొంది. భూకంపం ధాటికి 29 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. శిథిలాలను తొలగించేందుకు రెస్క్యూ సిబ్బంది కృషి చేస్తున్నారు.
200 కిలోమీటర్ల దూరంలో ఉన్న..
ఈ భూకంపం ద్వారా దాదాపు 200 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఇస్తాంబుల్ నగరంలోనూ భూమి కంపించిందని, అది చాలా స్పష్టంగా కనిపించినట్లు అధికారులు వివరించారు. అంతర్గత వ్యవహారాల మంత్రి అలీ యెర్లికాయ ఈ విపత్తు గురించి మాట్లాడుతూ.. రెస్క్యూ టీమ్స్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నాయని, ఇప్పటి వరకు ఎటువంటి ప్రతికూల నివేదికలు రాలేదని పేర్కొన్నారు.


