Yemen: యెమెన్ తీరంలో 154 మంది ఇథియోపియన్ జాతీయులు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 68 మంది ఆఫ్రికన్ వలసదారులు మరణించారు. మరో 74 మంది గల్లంతైనట్లు ఐక్యరాజ్యసమితి వలసల సంస్థ ధ్రువీకరించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 10 మందిని మాత్రమే రక్షించామని యెమెన్ ఆరోగ్య అధికారి అబ్దుల్ ఖాదిర్ బజమీల్ చెప్పారు.
ఈ ప్రమాదం ఆదివారం తెల్లవారుజామున యెమెన్‌లోని అబియాన్ ప్రావిన్స్ తీరంలో, గల్ఫ్ ఆఫ్ అడెన్ సమీపంలో చోటుచేసుకుంది. సముద్రంలో మునిగిన పడవలో 10 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని, వారిలో ఒకరు యెమెన్ దేశస్థుడు కాగా, మిగిలిన 11 మంది ఇథియోపియన్లు అని ఆయన వివరించారు.
మరణించిన 68 మందిలో 54 మంది మృతదేహాలు ఖన్‌ఫర్ జిల్లా తీరంలో లభ్యమయ్యాయని, మరో 14 మృతదేహాలను జింజిబార్ నగరంలోని ఆసుపత్రికి తరలించారని అధికారులు తెలిపారు. గల్లంతైనవారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ, బలమైన అలల కారణంగా గాలింపు చర్యలు కష్టంగా మారింది. దీంతో 74 మంది ఆచూకీ తెలియడం కష్టంగా మారిందని తెలిపారు.
మెరుగైన ఉపాధి కోసం ఆఫ్రికాలోని ఇథియోపియా, సోమాలియా నుండి గల్ఫ్ దేశాలకు వలసలు పెరుగుతున్నాయి. హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతం నుండి గల్ఫ్ దేశాలకు చేరుకోవడానికి యెమెన్ ఒక కీలకమైన మార్గంగా ఉంది. వలసదారులు తరచుగా రద్దీగా ఉండే, నాణ్యత లేని పడవల్లో ప్రమాదకరంగా ప్రయాణం చేస్తుంటారు. ఈ ఏడాది యెమెన్ తీరంలో జరిగిన బోటు ప్రమాదాల్లో ఇదే అత్యంత ఘోరమైనది.
Readmore: https://teluguprabha.net/international-news/china-tightens-travel-restrictions-govt-employees/
మార్చి నెలలో నాలుగు పడవలు బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు వలసదారులు మృతి చెందగా, 186 మంది గల్లంతయ్యారని ఐఓఎం తెలిపింది. గత ఏడాది ఈ మార్గంలో 558 మంది మరణించారని ఐక్యరాజ్యసమితి వలసల సంస్థ ధృవీకరించింది.


