Earthquake Hits US Alaska: అమెరికాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రత కలిగిన భూకంపం అలస్కా తీరంలో వచ్చింది. దీంతో యూఎస్ జియోలాజికల్ సర్వే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం చోటుచేసుకోలేదు. అయితే ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచనలు జారీ చేశారు.
అమెరికా కాలమానం ప్రకారం, బుధవారం మధ్యాహ్నం 12.37 గంటలకు భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. స్యాండ్ పాయింట్ సిటీకి దక్షిణంగా 88 కిమీ (55 మైళ్లు) దూరంలో దీని భూకంపం కేంద్రం ఉంది. ఇది దాదాపు 9 మైళ్లు (15 కి.మీ) లోతులో ఏర్పడింది. మరోవైపు ముందస్తు చర్యల్లో భాగంగా.. దక్షిణ అలస్కా, అలస్కా, పెవిన్ సులా ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ గంట తర్వాత విరమించుకున్నారు. భూకంపం తర్వాత అలాస్కాలోని రాస్ప్బెర్రీ ద్వీపం సమీపంలో గత 30 నిమిషాల్లో నీటి మట్టాలు గణనీయంగా తగ్గాయి. ఇది రాబోయే సునామీకి సంకేతం.
https://twitter.com/AKearthquake/status/1945592858179711304
అలస్కా ప్రాంతం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉంది. ప్రపంచంలోని భూకంపాలలో దాదాపు 11 శాతం ఇక్కడే సంభవిస్తాయి. యూఎస్ లో వచ్చే భూకంపాల్లో 17.5 శాతం ఇక్కడే వస్తాయి. ఇక్కడ దాదాపు 130 కంటే ఎక్కువ అగ్నిపర్వతాలు ఉన్నాయి. అమెరికా చరిత్రలో అతిపెద్ద భూకంపం అలస్కాలోనే సంభవించింది. 1964లో 9.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇందులో 250 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఎర్త్ క్విక్ గా రికార్డులెక్కింది. అలస్కా రాష్ట్ర జనాభాలో మూడొంతుల కంటే ఎక్కువ మంది రిక్టర్ స్కేల్‌పై 7 తీవ్రతతో భూకంపం సంభవించే ప్రదేశంలోనే నివసిస్తున్నారు. 2023లో కూడా ఇక్కడ 7.2 తీవ్రతతో భూకంపం వచ్చి.. భారీ ఆస్తి నష్టాన్ని కలిగించింది.


