Donald Trump| అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్(Trump)కు భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసుల దర్యాప్తును న్యాయమూర్తి నిలిపివేశారు. 2020 ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింసలో ట్రంప్‌పై నమోదైన కేసు విచారణను పక్కనబెట్టాలని స్పెషల్ కౌన్సిల్ జాక్ స్మిత్ కోరారు. ఇందుకు న్యాయమూర్తి తాన్య ఛుట్కాన్ అంగీకారం తెలిపారు. అమెరికాలో న్యాయశాఖ నిబంధనల ప్రకారం అధ్యక్షుడు క్రిమినల్ విచారణను ఎదుర్కోకుండా రక్షణ ఉంటుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడంతో ఆయనకు కేసుల విచారణ నుంచి రక్షణ లభించింది.
2020 ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించిన అనంతరం హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఈ ఘటనలను ట్రంప్ ప్రేరేపించారన్న ఆరోపణలతో ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. దీంతో పాటు ఆయన మరిన్ని కేసులు ఎదుర్కొంటున్నారు. అలాగే పోర్న్ స్టార్‌కు హష్ మనీ కేసులో ట్రంప్ దోషిగా తేలారు. ఈ కేసుకు సంబంధించి న్యూయార్క్‌న్యాయస్థానం నవంబర్ 26న శిక్ష ఖరారు చేయాల్సి ఉంది.
ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించిన ట్రంప్‌ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky) ఫోన్ చేసి అభినందించారు. వీరిద్దరూ మాట్లాడుకుంటుండగా ట్రంప్ మధ్యలో ఫోన్‌ను మస్క్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడితో మస్క్ (Musk) కొంతసేపు మాట్లాడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. తాజా కథనాల నేపథ్యంలో ట్రంప్ కార్యవర్గంలో మస్క్ కీలక పదవి చేపట్టే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ట్రంప్‌కు తొలి నుంచి మస్క్ భారీ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే.