- ఇస్రో ఉపగ్రహం ద్వారా తొలిసారిగా సముద్రంలో ఆధారాలు లభ్యం
- సముద్రంలో తగ్గుతున్న క్లోరోఫిల్-ఎ.. గాలుల దిశలో మార్పు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11 (తెలుగుప్రభ): ప్రపంచ వాతావరణ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసే అత్యంత శక్తివంతమైన ‘ఎల్ నినో’ సంభవించబోతోందని, దానికి సంబంధించిన ప్రాథమిక సంకేతాలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఉపగ్రహం గుర్తించిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూమికి 741 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో ఉన్న ఇస్రో ఉపగ్రహం ఈఓఎస్-06 (ఓషన్ శాట్-3) పసిఫిక్ మహాసముద్రంలో జరుగుతున్న కీలకమైన జీవ, వాతావరణ మార్పులను నిశితంగా నమోదు చేసింది. వర్షపాతంలో మార్పులు , భారత నైరుతి రుతుపవనాలపై ప్రభావం కనిపించడానికంటే ముందే పసిఫిక్ భూమధ్యరేఖా ప్రాంతంలో సంభవిస్తున్న ఈ మార్పులు, ప్రపంచం వైపు అత్యంత తీవ్రమైన ‘మదర్ ఆఫ్ ఆల్ ఎల్ నినో’ లేదా ‘గాడ్జిల్లా ఎల్ నినో’ దూసుకొస్తోందనడానికి స్పష్టమైన నిదర్శనమని ఇస్రో స్పష్టం చేసింది. ఇస్రో విడుదల చేసిన ఈ సమాచారం ‘ప్రపంచ వాతావరణ సంస్థ’ (డబ్ల్యూఎంవో) అంచనాలను కూడా బలపరుస్తోంది.
క్లోరోఫిల్ తగ్గింపు – సముద్ర గాలి మళ్లింపు
హైదరాబాద్‌లోని ఇస్రో జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ ) విశ్లేషణ ప్రకారం, పసిఫిక్ మహాసముద్రం ఉపరితలంపై నీటిలో ఉండే సూక్ష్మ వృక్షప్లవకాలలోని ‘క్లోరోఫిల్-ఎ’ పరిమాణం గణనీయంగా పడిపోయినట్లు ఓషన్ శాట్-3 ఉపగ్రహం గుర్తించింది. సముద్ర ఆహార గొలుసుకు పునాది వంటి ఈ వృక్షప్లవకాలు నీటి వేడి పెరిగినప్పుడు క్షీణిస్తాయి. సంప్రదాయ సముద్ర ఉష్ణోగ్రత కొలతల కంటే క్లోరోఫిల్ తగ్గింపు ద్వారా ఎల్ నినో తీవ్రతను చాలా వేగంగా అంచనా వేయవచ్చని నిపుణులు వెల్లడించారు. ఎన్‌ఆర్‌ఎస్‌సీ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ చౌహాన్ మాట్లాడుతూ… “పసిఫిక్ మహాసముద్రంలో తూర్పు వైపు నీరు వేడెక్కడం వల్ల లోతుల్లోని పోషకాలతో కూడిన చల్లటి నీరు పైకి రావడం నిలిచిపోతుంది. దీనివల్ల వృక్షప్లవకాల ఉత్పత్తి తగ్గిపోతుంది. దీనిని ఇస్రో ‘ఓషన్ కలర్ మానిటర్’ స్పష్టంగా పసిగట్టింది. అదే సమయంలో ఉపగ్రహంలోని ‘స్కాటరోమీటర్’ తూర్పు నుంచి వీచే గాలులు పడమర వైపునకు మళ్లడాన్ని రికార్డు చేసింది. ఈ రెండూ ఎల్ నినో ఆవిర్భావానికి నిదర్శనాలు” అని వివరించారు.
భారత్ , ప్రపంచ వాతావరణంపై ప్రభావం
సాధారణంగా ఎల్ నినో ఏర్పడిన సంవత్సరాల్లో భారతదేశంలో నైరుతి రుతుపవనాలు బలహీనపడి వర్షపాతం తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది వ్యవసాయ రంగం, నీటి వనరులపై ఒత్తిడి పెంచుతుంది. ప్రసుతం మధ్యస్థ ఎల్ నినో పరిస్థితులు ఉన్నాయని, రుతుపవనాల సీజన్ ముగిసే సమయానికి ఇవి మరింత తీవ్రరూపం దాలుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు నమోదుస్థాయిని దాటి పెరగడం, తీవ్ర తుఫానులు, వరదలు, కరవు కాటకాలు తలెత్తే ముప్పు ఉందని డబ్ల్యూఎంవో పేర్కొంది. 2022 నవంబర్‌లో పీఎస్‌ఎల్‌వీ ద్వారా ప్రయోగించిన ఇస్రో ఉపగ్రహం ఓషన్ శాట్-3 అందిస్తున్న ఈ విశ్లేషణలు రాబోయే వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచానికి ఎంతగానో ఉపకరిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

