Afghanistan Rejects Pakistan’s Peace Bid: పాకిస్తాన్-అఫ్గానిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, కాబూల్‌తో శాంతి చర్చలు జరపడానికి ఇస్లామాబాద్ చేసిన ప్రయత్నానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఐఎస్‌ఐ చీఫ్ అసిమ్ మాలిక్, మరో ఇద్దరు పాక్ జనరల్స్ వీసా అభ్యర్థనలను అఫ్గానిస్తాన్ ప్రభుత్వం మూడు సార్లు తిరస్కరించినట్లు తెలుస్తోంది.
గత మూడు రోజుల్లో వీసా అభ్యర్థనలు తిరస్కరణకు గురికావడంతో, ఇరు దేశాల మధ్య సత్సంబంధాల కోసం పాక్ చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయి.
ALSO READ: US China Trade War: భగ్గుమన్న అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం.. చైనాపై 100% టారిఫ్.. డ్రాగన్ ఫైర్
సరిహద్దులో భీకర పోరాటం
ఇటీవల పాకిస్తాన్-అఫ్గానిస్తాన్ సరిహద్దులో జరిగిన తీవ్ర ఘర్షణల్లో కనీసం 23 మంది పాక్ సైనికులు, 200 మందికి పైగా తాలిబాన్ అనుబంధ ఉగ్రవాదులు మరణించినట్లు పాకిస్తాన్ సైన్యం అంగీకరించింది. అయితే, తాలిబాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ మాత్రం 58 మంది పాక్ సైనికులు మరణించారని, 30 మంది గాయపడ్డారని పేర్కొన్నారు.
అఫ్గానిస్తాన్ తమ భూభాగంలో తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP), బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) వంటి పాక్ మిలిటెంట్ గ్రూపులకు ఆశ్రయం ఇస్తోందని పాకిస్తాన్ పదేపదే ఆరోపిస్తోంది. ఈ ఆరోపణల కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ALSO READ: Donald Trump : అమెరికా అధ్యక్షుడికి ఆ దేశపు అత్యున్నత పురస్కారం
మధ్యవర్తిత్వానికి ట్రంప్, చైనా విజ్ఞప్తి
సరిహద్దుల్లో పోరాటం ముదురుతున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వివాదంలో మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకు వచ్చారు. తాను ఘర్షణలను పరిష్కరించడంలో నిపుణుడినని, శాంతిని స్థాపించడం గౌరవంగా భావిస్తానని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, చైనా రెండు దేశాల మధ్య సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది. ఇరు దేశాలు చైనాకు మిత్రులని, ఉగ్రవాదాన్ని కలిసికట్టుగా ఎదుర్కోవాలని సూచించింది.
ట్రై-సిరీస్‌పై యుద్ధ భయం ప్రభావం
ఈ మిలిటరీ ఘర్షణల కారణంగా, నవంబర్ 17-29 మధ్య జరగాల్సిన ట్రై-సిరీస్ (పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, శ్రీలంక)పై తీవ్ర సందేహాలు తలెత్తాయి. అఫ్గానిస్తాన్ ఈ సిరీస్‌లో పాల్గొనకపోవచ్చు అనే అంచనాతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ప్రత్యామ్నాయ ప్రణాళికపై దృష్టి సారించింది. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, ఐసీసీని ప్రత్యామ్నాయ ప్రణాళికపై పనిచేయాలని కోరారు. అలాగే, ట్రై-సిరీస్‌కు ముందు శ్రీలంకతో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాలని కూడా పీసీబీ ఆహ్వానించింది.


