Albania’s pregnant AI minister : మంత్రి గర్భం దాల్చడమేంటి? ఏకంగా 83 మంది పిల్లలకు జన్మనివ్వడమేంటి? ఇదేదో వింతగా అనిపిస్తున్నా, టెక్నాలజీ ప్రపంచంలో ఇది అక్షరాలా నిజం. అల్బేనియా దేశానికి చెందిన తొలి కృత్రిమ మేధ (ఏఐ) మంత్రి ‘డియెల్లా’ గర్భవతి అయ్యిందని, త్వరలోనే 83 మంది ‘ఏఐ పిల్లలకు’ జన్మనివ్వబోతోందని ఆ దేశ ప్రధాని ఎడి రేమా చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ వార్త వినగానే అందరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్న ఒక్కటే – అసలు ఎవరీ డియెల్లా? ఈ ‘డిజిటల్ పిల్లల’ కథేంటి? పాలనలో ఇంతటి విప్లవాత్మక ప్రయోగానికి అల్బేనియా ఎందుకు సిద్ధమైంది?
ప్రధాని వింత ప్రకటన : జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరిగిన గ్లోబల్ డైలాగ్ సదస్సు వేదికగా అల్బేనియా ప్రధాని ఎడి రేమా ఈ విచిత్రమైన ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. “ఈరోజు మేము డియెల్లాతో ఒక పెద్ద సాహసానికి తెరలేపాం. తొలిసారిగా డియెల్లా గర్భవతి అయింది. ఆమె ఏకంగా 83 మంది పిల్లలకు జన్మనివ్వనుంది” అని ఆయన ప్రకటించగానే సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. ఆ తర్వాత, అసలు విషయం విడమరచి చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఎంపీలకు డిజిటల్ సహాయకులు : ప్రధాని చెప్పిన దాని ప్రకారం, ఈ 83 మంది ‘ఏఐ పిల్లలు’ అల్బేనియా పార్లమెంటులోని సోషలిస్ట్ పార్టీకి చెందిన 83 మంది ఎంపీలకు డిజిటల్ సహాయకులుగా సేవలు అందిస్తారు. పార్లమెంటు కార్యకలాపాలను పూర్తిగా రికార్డు చేయడం, సమావేశాలకు హాజరుకాలేకపోయిన ఎంపీలకు పూర్తి సమాచారాన్ని అందించడం వీరి ప్రధాన విధి. “ఒకవేళ మీరు కాఫీ తాగడానికి వెళ్లి సభకు తిరిగి రావడం మరిచిపోతే, మీ ಅನುಪస్థితిలో ఏం జరిగిందో ఈ ‘పిల్లలు’ వివరిస్తాయి. ఎవరికి ఎలా కౌంటర్ ఇవ్వాలో కూడా సూచిస్తాయి” అని రేమా సరదాగా వ్యాఖ్యానించి సభలో నవ్వులు పూయించారు.
ఎవరీ డియెల్లా : అల్బేనియా భాషలో ‘సూర్యుడు’ అని అర్థం వచ్చే ‘డియెల్లా’ను ఈ ఏడాది జనవరిలోనే దేశ తొలి ఏఐ మంత్రిగా ప్రధాని రేమా ఆవిష్కరించారు. ‘ఈ-అల్బేనియా’ అనే ప్రభుత్వ పోర్టల్ ద్వారా ప్రజలకు డిజిటల్ సేవలు అందించడంలో ఈ డిజిటల్ అసిస్టెంట్ కీలక పాత్ర పోషిస్తోంది. దేశంలోని దాదాపు 95 శాతం పౌర సేవలను వాయిస్ కమాండ్ల ద్వారా ప్రజలు పొందేందుకు ఇది మార్గనిర్దేశం చేస్తుంది. సంప్రదాయ దుస్తుల్లో కనిపించే డియెల్లాను ప్రధాని “ప్రజా సేవల సేవకురాలు”గా అభివర్ణించారు. ప్రభుత్వ టెండర్లలో అవినీతిని వంద శాతం నిర్మూలించడమే లక్ష్యంగా డియెల్లాను రంగంలోకి దించినట్లు ఆయన గతంలోనే ప్రకటించారు.
ఈ సరికొత్త ప్రయోగంతో, పాలనలో టెక్నాలజీని కేవలం ఒక సాధనంగా కాకుండా, క్రియాశీలక భాగస్వామిగా మార్చి అల్బేనియా ప్రభుత్వం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని అంతర్జాతీయ మీడియా ప్రశంసలు కురిపిస్తోంది.


