India-China border talks : గల్వాన్ ఘర్షణల అనంతరం ఉద్రిక్తంగా మారిన భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతత నెలకొందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ప్రకటించడం అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. దిల్లీ పర్యటనకు వచ్చిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఆయన జరిపిన చర్చల సారాంశం ఏమిటి..? ఈ భేటీతో ఎరువుల సరఫరాకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయా..? త్వరలో చైనాలో జరగనున్న అత్యంత కీలకమైన షాంఘై సహకార సదస్సు (ఎస్సీఓ)కు ప్రధాని మోదీ హాజరుకానుండటం దేనికి సంకేతం..?
భారత్-చైనా సరిహద్దు వెంబడి ప్రస్తుతం శాంతి, ప్రశాంత వాతావరణం నెలకొని ఉందని జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ డోభాల్ వ్యాఖ్యానించారు. దిల్లీ పర్యటనకు వచ్చిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో మంగళవారం జరిపిన ఉన్నతస్థాయి సమావేశం అనంతరం ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. ఈ భేటీ సందర్భంగా, ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో చైనాలోని తియాంజిన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారని డోభాల్ అధికారికంగా ధ్రువీకరించారు.
కొత్త ఉత్సాహంతో ద్వైపాక్షిక బంధం : సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన డోభాల్, “భారత్-చైనా సంబంధాలలో ఒక కొత్త ఉత్సాహం, శక్తి కనిపిస్తోంది. సరిహద్దుల్లో శాంతి నెలకొంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇప్పుడు మరింత బలోపేతం అయ్యాయి. ఎస్సీఓ సదస్సు కోసం మన ప్రధానమంత్రి చైనాను సందర్శించనున్న నేపథ్యంలో నేటి చర్చలకు ఎంతో ప్రాధాన్యత ఉంది,” అని పేర్కొన్నారు.
సంబంధాల బలోపేతానికి సిద్ధం: వాంగ్ యీ : అంతకుముందు, అజిత్ డోభాల్ ఆహ్వానం మేరకే తాను రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చినట్లు వాంగ్ యీ తెలిపారు. భారత్-చైనా సరిహద్దు వివాదంపై 24వ విడత ప్రత్యేక ప్రతినిధుల స్థాయి చర్చలు జరపడమే తన పర్యటన ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. “ఇరు దేశాల నేతల వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అనుసరించి, సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవాలి. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి అవసరమైన పరిస్థితులను సృష్టించేందుకు చైనా సిద్ధంగా ఉంది,” అని వాంగ్ యీ అన్నారు.
తొలగిన ఎరువుల దిగుమతి ఆంక్షలు : ఈ పర్యటనలో భాగంగా వాంగ్ యీ సోమవారం విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తోనూ సమావేశమయ్యారు. ఈ చర్చల ఫలితంగా, భారత్‌కు ఎరువులు (యూరియా), బోరింగ్ యంత్ర పరికరాలు, రేర్ ఎర్త్ మినరల్స్ సరఫరాపై ఉన్న పరిమితులను ఎత్తివేయడానికి చైనా అంగీకరించింది. 2023లో చైనాకు చెందిన రెండు పెద్ద సంస్థలు భారత్‌కు యూరియా సరఫరాను నిలిపివేసిన నేపథ్యంలో, తాజా నిర్ణయంతో రైతులకు, పరిశ్రమలకు మార్గం సుగమమైంది. మంగళవారం సాయంత్రం వాంగ్ యీ ప్రధాని మోదీతోనూ సమావేశం కానున్నారు.


