- మరో విమానవాహక నౌక, 10 వేల బలగాల తరలింపు
- నవంబర్ నాటికి రంగంలోకి మూడు క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లు
- దౌత్య చర్చలు విఫలమవడంతో మరింత బిగుసుకున్న ఆంక్షల ఉచ్చు
- ఎన్నికల తర్వాత దాడులు ముమ్మరం చేస్తామన్న ట్రంప్
- ఖతార్ మధ్యవర్తిత్వ ప్రతిపాదనలను తిరస్కరించిన వాషింగ్టన్
- ఆపరేషన్ ఎకనామిక్ ఔట్కాస్ట్తో ఆర్థికంగా దెబ్బకొట్టే వ్యూహం
- తామూ యుద్ధానికి సిద్ధమేనని తిరిగి హెచ్చరించిన ఇరాన్
వాషింగ్టన్ / టెహ్రాన్, అక్టోబర్ 2 : పశ్చిమాసియాలో ఇరాన్‌తో కొనసాగుతున్న పోరు ఎనిమిదో నెలకు చేరుకున్న వేళ, యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చే సంకేతాలు వెలువడుతున్నాయి. అమెరికా రక్షణ శాఖ తన మూడో ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ (విమాన వాహక నౌక) స్ట్రైక్ గ్రూప్‌తో పాటు సుమారు 10,000 మంది నావికా, మెరైన్ బలగాలను పశ్చిమాసియా దిశగా తరలిస్తున్నది. నవంబర్ నెలాఖరు నాటికి మొత్తం మూడు విమానవాహక నౌకలు, రెండు ఉభయచర ల్యాండింగ్ గ్రూపులు ఇరాన్ సమీప జలాల్లో మోహరించనున్నాయని పెంటగాన్ అధికార వర్గాలు తెలిపాయి. నవంబర్‌లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికల ముంగిట అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
భారీగా సాగుతున్న సైనిక కదలికలు
శాండియాగో నౌకాదళ స్థావరం నుంచి ‘యూఎస్ఎస్ థియోడర్ రూజ్వెల్ట్’ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ బయలుదేరగా, రెండు వేల మందికి పైగా మెరైన్లతో కూడిన ‘మేకిన్ ఐలాండ్’ మెరైన్ ఎక్స్‌పెడిషనరీ యూనిట్ (ఎంఈయూ) కూడా పశ్చిమాసియా వైపు కదులుతున్నది. దీనిలో అధునాతన ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్లు కూడా ఉన్నాయి. పెంటగాన్, వైట్‌హౌస్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇరాన్‌తో దౌత్యపరమైన ఒప్పందం కుదిరినా సైనిక బలగాలను వెనక్కి పిలిపించే ఆలోచన అమెరికాకు లేదు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అన్ని రకాల సైనిక ప్రత్యామ్నాయాలను అందుబాటులో ఉంచేందుకే ఈ మోహరింపులు చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు. అధ్యక్షుడు ఆదేశిస్తే తదుపరి దాడులకు దళాలు సిద్ధంగా ఉన్నాయని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రకటించారు.
2003 తర్వాత అతిపెద్ద వాయుసేన మోహరింపు
పశ్చిమాసియాలోని బహ్రెయిన్, ఈజిప్ట్, ఇరాక్, జోర్డాన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈల్లోని ఎనిమిది శాశ్వత స్థావరాలతో పాటు మొత్తం 19 సైనిక కేంద్రాల్లో ఇప్పటికే 50,000 మంది అమెరికా సైనికులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచే యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌకతో పాటు పెద్దఎత్తున ఆయుధ సంపత్తిని అమెరికా రంగంలోకి దించింది. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు 120కి పైగా యుద్ధ విమానాలు పశ్చిమాసియాకు చేరాయి. 2003 ఇరాక్ యుద్ధం తర్వాత ఈ స్థాయిలో అమెరికా వాయుసేన ఇక్కడ మోహరించడం ఇదే ప్రథమం. వీటిలో ఈ-3 సెంక్రీ అవాక్స్, ఎఫ్-35, ఎఫ్-22, ఎఫ్-15, ఎఫ్-16 యుద్ధ విమానాలు, గగనతల ఫ్యూయల్ ఫిల్లింగ్ ట్యాంకర్లు ఉన్నాయి.
మార్చిలో రంగంలోకి దిగిన యూఎస్ఎస్ ట్రిపోలీ (31వ ఎంఈయు), యూఎస్ఎస్ బాక్సర్ (11వ ఎంఈయూ) ఉభయచర నౌకల ద్వారా 4,500 మంది మెరైన్లు, నావికులు చేరారు. ఫోర్ట్ బ్రాగ్ నుంచి పారాచూట్ దాడుల్లో నిపుణులైన 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్‌కు చెందిన మరో 2,000 మంది సైనికులు వారిలో ఉన్నారు.
కాగా, గత నెల న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (యూఎన్జీఏ) సందర్భంగా ఖతార్ మధ్యవర్తిత్వంలో జరిగిన పరోక్ష శాంతి చర్చలు ప్రతిష్టంభనలోనే ముగిశాయి. తమపై ఉన్న ఆంక్షలు ఎత్తివేయాలని, స్తంభింపజేసిన నిధులను విడుదల చేయాలని, అమెరికా నావికా దిగ్బంధాన్ని ఎత్తివేసి దాడులు ఆపాలని, లెబనాన్-యెమెన్లలో కాల్పుల విరమణ అమలు చేయాలని ఇరాన్ ప్రతిపాదించింది. వీటికి అంగీకరిస్తే ఏడు రోజుల్లో హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచి, అణు చర్చలను పునరుద్ధరిస్తామని రోడ్‌మ్యాప్ ఇచ్చింది. అయితే ఈ ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం పూర్తిగా తోసిపుచ్చింది. ఇరాన్ అణు కార్యక్రమంపై ఐరాస భద్రతా మండలి విధించిన ఏడు తీర్మానాలు అమలులో ఉన్నాయని, నిధుల విడుదల లేదా ఆంక్షల సడలింపుపై రాజీపడే ప్రసక్తే లేదని ఐరాసలో యూఎస్ రాయబారి మైక్ వాల్ట్జ్ స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ.. తాము శాంతి చర్చల కోసమే న్యూయార్క్ వచ్చామని, అయితే యుద్ధాన్ని కొనసాగించేందుకు కూడా పూర్తి సన్నద్ధతతో ఉన్నామని హెచ్చరించారు.
ఆర్థిక దిగ్బంధం.. మరింత ఒత్తిడి
సైనిక మోహరింపులకు తోడు ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచేందుకు వాషింగ్టన్ ‘ఆపరేషన్ ఎకనామిక్ ఔట్‌కాస్ట్’ను ప్రారంభించింది. ఇరాన్ ఆదాయ మార్గాలను పూర్తిగా దెబ్బతీయాలనే లక్ష్యంతో ఆ దేశ రైల్వే, ఆటోమోటివ్ రంగాలకు చెందిన దిగ్గజ సంస్థలపై ఈ వారంలో అమెరికా ట్రెజరీ శాఖ ఆంక్షలు విధించింది. అలాగే ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు నెరిపే ఇతర దేశాలపైనా విస్తృత ఆంక్షలు అమలు చేస్తున్నది.
ఎన్నికల తర్వాత దాడులు ఉధృతం : ట్రంప్
టెక్సాస్‌లోని డెంటన్లో ఉన్న పీటర్‌బిల్ట్ మోటార్స్ ప్లాంట్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. ఈ ప్రతిష్టంభనకు “త్వరలోనే” తెరపడుతుందని, ఇరాన్ వెంటనే తెలివైన, సరైన నిర్ణయం తీసుకోకపోతే ఆ దేశం ఎక్కువ కాలం మనజాలదని తీవ్ర హెచ్చరికలు చేశారు. ఆ దేశాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మలేమని వ్యాఖ్యానించారు. టైమ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నవంబర్ మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌పై బాంబు దాడులను మరింత ఉధృతం చేసే అవకాశం ఉందని ఆయన సంకేతాలిచ్చారు. అయితే దేశీయంగా ఈ యుద్ధంపై తీవ్ర వ్యతిరేకత ఉండటం, ట్రంప్ ప్రజాదరణ రేటింగ్‌లు కనిష్ట స్థాయికి పడిపోవడం రాబోయే మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. ఈ నేపథ్యంలో తాజా భారీ సైనిక సమీకరణ కేవలం ఇరాన్‌ను దౌత్యపరంగా లొంగదీసుకునే ఎత్తుగడా లేక పూర్తిస్థాయి యుద్ధ విస్తరణకు సంకేతమా అన్నది ఉత్కంఠ రేపుతోంది.

