Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్America Local Elections: అమెరికా స్థానిక ఎన్నికల్లో ట్రంప్‌కు ఎదురుదెబ్బ, భారత మూలాలున్న ఇద్దరి విజయం

America Local Elections: అమెరికా స్థానిక ఎన్నికల్లో ట్రంప్‌కు ఎదురుదెబ్బ, భారత మూలాలున్న ఇద్దరి విజయం

America Local Elections: అమెరికా స్థానిక సంస్థల ఎన్నికల్లో సంచలనాలు నమోదయ్యాయి. కేపిటలిస్ట్ ప్రపంచంలో సోషలిస్టులు విజయం సాధించారు. అధికార రిపబ్లికన్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆఖరికి ట్రంప్ పుట్టిన ప్రాంతం కూడా దక్కలేదు. అన్నింటికీ మించి భారత మూలాలున్న ఇద్దరు విజయం సాధించారు. మొత్తంగా చూస్తే డెమోక్రట్లకు పట్టం కట్టారు ఓటర్లు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

- Advertisement -

అమెరికా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్ తగిలింది. పుట్టిన నగరం న్యూయార్క్‌లో డెమోక్రటిక్ పార్టీ మద్దతిచ్చిన సోషలిస్టుగా ముద్రపడిన ఇండో అమెరికన్ జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ మేయర్‌గా గెలిచారు. అమెరికా అంటేనే కేపిటలిస్టులకు కేరాఫ్. అందులో న్యూయార్క్ కేంద్ర బిందువని చెప్పవచ్చు. 84 లక్షల జనాభా ఉన్న న్యూయార్క్ నగరానికి జరిగిన మేయర్ ఎన్నికల్లో సోషలిస్ట్, ఇండో అమెరికన్ జోహ్రాన్ మమ్దానీ విజయం సాధించారు. ప్రత్యర్ధి రిపబ్లికన్ పార్టీ మద్దతిచ్చిన ఆండ్రూ క్యూమోపై ఏకంగా 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో మమ్దానీకు 10 లక్షల 22 వేల ఓట్లు అంటే 50.4 శాతం వచ్చాయి. ఇక ప్రత్యర్ధి ఆండ్రూ క్యూమో 8 లక్షల 44 వేల ఓట్లతో రెండో స్థానంలో నిలిచాడు.

ఎవరీ జోహ్రాన్ మమ్దానీ

ఇండియాకు చెందిన బాలీవుడ్ మాజీ నటి మీరా నాయర్, ఇండియాలో పుట్టి ఉగాండాలో పెరిగి అమెరికాలో స్థిరపడిన ప్రొఫెసర్ మమ్దానీల కుమారుడే జోహ్రాన్ మమ్దానీ. న్యూయార్క్‌కు తొలి ముస్లిమే కాకుండా తొలి ఇండో అమెరికన్ మేయర్ కావడం విశేషం. 2026 జనవరి 1న ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. న్యూయార్క్ నగరంలో భారంగా మారిన ఇంటి అద్దెలు తగ్గించడం, ఉచిత బస్సు ప్రయాణం, పిల్లల సార్వత్రిక సంరక్షణ వంటి హామీలతో ఓటర్లను ఆకట్టుకున్నారు. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధానాలపై ఘాటైన విమర్శలతో ప్రజల్లో ఆదరణ పొందారు.

వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా గజాలా హష్మీ

మరోవైపు వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌ను కూడా డెమోక్రటిక్ పార్టీ చేజిక్కించుకుంది. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా హైదరాబాద్ మూలాలు ఉన్న గజాలా హష్మీ విజయం సాధించారు. వర్జీనియాకు లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా ఖ్యాతి సంపాదించారు. ఈమె హైదరాబాద్‌లో 1964లో జన్మించగా బాల్యం అంతా మలక్ పేటలో సాగింది. తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.

వర్జీనియా గవర్నర్‌గా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి అబిగైల్ స్నాన్‌బర్గర్, లెఫ్టినెంట్ గవర్నర్‌గా గజాలా హష్మీ విజయం సాధించారు. సిన్సినాటి మేయర్‌గా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి ఆఫ్తాబ్ పురేవాల్ గెలిచారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సోదరుడు పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. అట్లాంటా మేయర్‌గా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి ఆండ్రీ డికెన్స్ మరోసారి గెలవగా, పిట్స్‌బర్గ్ మేయర్‌గా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి కోరీ ఓకానర్ విజయం సాధించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad