Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Donald Trump: అమెరికన్లు ఎగిరి గంతేసే వార్త.. ప్రతి ఒక్కరికి 2 వేల డాలర్లు..!

Donald Trump: అమెరికన్లు ఎగిరి గంతేసే వార్త.. ప్రతి ఒక్కరికి 2 వేల డాలర్లు..!

America President Trump Bumper Offer To Citizens: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. ఎప్పుడు షాకింగ్ నిర్ణయాలు తీసుకునే ట్రంప్ ఈసారి అగ్రరాజ్య పౌరులకు బంపరాఫర్ ఇచ్చాడు. టారిఫ్‌ల ద్వారా వసూలు చేసిన ఆదాయం నుంచి ప్రతి అమెరికన్ పౌరుడికి ఏటా $2,000 డాలర్ల చొప్పున “డివిడెండ్‌లు” అందిస్తానని ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు.

- Advertisement -

టారిఫ్‌ల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం

“టారిఫ్‌లకు వ్యతిరేకంగా మాట్లాడేవారు మూర్ఖులు..! సుంకాలే లేకపోతే అమెరికా పూర్తిగా నాశనమవుతుంది” అని ఆయన గట్టిగా సమర్థించారు. టారిఫ్‌ల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందని, రికార్డు స్థాయి స్టాక్ ధరలు, 401(k) బ్యాలెన్స్‌లు పెరిగాయని, దేశవ్యాప్తంగా కొత్త కర్మాగారాలు వెలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. సుంకాలతోనే అమెరికా ధనిక దేశంగా మారిందని -ట్రంప్ చెప్పుకొచ్చారు. ట్రంప్ టారిఫ్స్‌పై అమెరికా అత్యున్నత కోర్టు సీరియస్ అయ్యింది. అధ్యక్షుడి అధికారాలపై ఫెడరల్ కోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది.

సుంకాల ద్వారా వస్తున్న భారీ ఆదాయం..

ట్రంప్ ప్రతిపాదన ప్రకారం, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా ప్రభుత్వం విధించే సుంకాల ద్వారా వస్తున్న భారీ ఆదాయం నుంచి ఈ డివిడెండ్‌లను చెల్లిస్తారు. ఈ టారిఫ్‌లు “ట్రిలియన్ల కొద్దీ డాలర్లను” దేశంలోకి తీసుకువస్తున్నాయని ట్రంప్ వాదించారు. ఈ ఆదాయంలో కొంత భాగాన్ని సాధారణ ప్రజలకు పంపిణీ చేయడమే కాకుండా, దేశ జాతీయ రుణాన్ని తగ్గించడానికి కూడా ఉపయోగించవచ్చని ఆయన తెలిపారు. ట్రంప్ ఈ విధానాన్ని సమర్థిస్తూ, పన్నులు (Tax) విధించడం కంటే టారిఫ్‌లు విధించడమే ఉత్తమమని పేర్కొన్నారు. “ఈ టారిఫ్‌లను ఇతర దేశాలే చెల్లిస్తాయి, అమెరికన్ పౌరులు కాదు” అని ఆయన పునరుద్ఘాటించారు, ఇది అమెరికన్లకు ఒక పెద్ద విజయమని అభివర్ణించారు.

విమర్శలు, న్యాయపరమైన అంశాలు..

అయితే, ట్రంప్ యొక్క ఈ టారిఫ్ విధానంపై సొంత పార్టీ రిపబ్లికన్లలో కూడా విమర్శలు ఉన్నాయి. చాలా మంది ఆర్థికవేత్తలు టారిఫ్‌ల భారం అంతిమంగా అమెరికన్ వినియోగదారులపై, దిగుమతి చేసుకునే కంపెనీలపై పడుతుందని వాదిస్తున్నారు. మరోవైపు, దేశీయ చట్టాలను ఉల్లంఘిస్తూ ట్రంప్ అత్యవసర అధికారాలను ఉపయోగించి టారిఫ్‌లు విధించారని ఆరోపిస్తూ ఫెడరల్ అప్పీల్స్ కోర్టు ఇటీవల కీలక తీర్పు ఇచ్చింది. కోర్టు ఈ టారిఫ్ అధికారాన్ని ప్రశ్నించడం ట్రంప్ ప్రతిపాదించిన ఈ $2,000 డివిడెండ్ పథకానికి నిధుల సేకరణపై అనిశ్చితిని సృష్టించింది. ఈ కోర్టు తీర్పును ట్రంప్ “పెద్ద విపత్తు”గా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో, ప్రతి అమెరికన్‌కు $2,000 డివిడెండ్‌లు అందించాలనే ట్రంప్ ప్రతిజ్ఞ ఒక ప్రధాన రాజకీయ అస్త్రంగా మారింది. ఈ అంశంపై కోర్టుల తుది నిర్ణయం, సుంకాల ప్రభావం ఎలా ఉంటుందనేది ఆసక్తి కారంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad