America Elections| ప్రపంచమంతా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చేసింది. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ ఫలితం రావడం విశేషం. న్యూహ్యాంప్‌షైర్ రాష్ట్రంలోని డిక్స్‌విల్లే నాచ్(Dixville Notch) లో ఆరుగురు ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఈ ఆరు ఓట్లలో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్(Kamala Harris)కు మూడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)నకు మూడు ఓట్లు రావడం గమనార్హం. 2020లో జరిగిన ఎన్నికల్లో మాత్రం డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ (Joe Biden) వైపు డిక్స్‌విల్లే నాచ్ ఓటర్లు మొగ్గు చూపారు.
అమెరికా-కెనడా సరిహద్దులో డిక్స్‌విల్లే నాచ్ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలోని ఆరుగురు ఓటర్లలో నలుగురు ఓటర్లు రిపబ్లికన్ పార్టీ తరపున తమ ఓటు నమోదుచేసుకోగా.. మిగిలిన ఇద్దరు ఓటర్లు ఏ పార్టీ తరపున తమ ఓటు నమోదుచేసుకోలేదు. వీరంతా అధ్యక్ష ఎన్నికల రోజు స్థానికంగా ఉండే ఓ హోటల్‌లో సమావేశమవుతారు. ఈ ఆరుగురు ఓటర్లు ఓటు వేసిన 15 నిమిషాల తర్వాత ఇక్కడ ఫలితాలు ప్రకటిస్తారు. కాగా 1960 నుంచి అర్థరాత్రి పూట ఓటు హక్కు వినియోగించుకోవడం అనవాయితీగా వస్తోంది.