Ancient Humans: స్పెయిన్ లోని పురాతత్వ శాస్త్రవేత్తలు సంచలన నిజాన్ని వెలుగులోకి తెచ్చారు. సుమారు 8.5 లక్షల సంవత్సరాల క్రితం హోమో యాంటెసెసర్స్ అనే పూర్వ మానవ జాతి తమ సంతానాన్ని కూడా ఆహారంగా ఉపయోగించుకున్నట్టు తాజా పరిశోధనల్లో తేలింది.
స్పెయిన్‌లోని గ్రాన్ డొలినా ప్రాంతంలో పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు నిర్వహించారు. తవ్వకాలు జరిగిన ప్రాంతంలో రెండు నుంచి నాలుగు ఏళ్ల మధ్య వయసున్న చిన్నారి మెడ ఎముక లభ్యమైంది. ఆ ఎముకను పరిశోధించగా దానిపై పదునైన ఆయుధంతో నరికినట్లు ఉండటం శాస్త్రవేత్తలు గమనించారు. అంతేకాకుండా తల, వెన్నుపూస భాగాలను వేరు చేసిన ఆనవాళ్లను వారు గుర్తించారు. ఆకలి తీర్చుకోవడం కోసం ఆ చిన్నారి శరీరాన్ని మాంసాహారంగా వాడినట్లు సూచిస్తున్నాయని పరిశోధకులు తెలిపారు.
ఈ పరిశోధనను ఐపీహెచ్‌ఈఎస్ (Institute of Human Paleoecology and Social Evolution) శాస్త్రవేత్తలు నిర్వహించారు. వారి ప్రకారం, హోమో యాంటెసెసర్స్ జాతి నియాండర్తల్స్, హోమో సెపియన్లకు పూర్వీకులు. హోమో యాంటెసెసర్స్ దాదాపు 1.2 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించారు. ఆ కాలంలో ఆహార కొరత కారణంగా వారి పిల్లల్ని వారే చంపి తినే చర్యలు చోటు చేసుకున్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు.
పిల్లల్ని కూడా ఇతర జంతువుల మాదిరిగానే చంపేవారని చెప్పేందుకు ఇదే ప్రత్యక్ష నిదర్శనమని పరిశోధనకు నాయకత్వం వహించిన పాల్‌మిరా సలడై వెల్లడించారు. దీనినే నరమాంస భక్షణానికి ప్రత్యక్ష ఆధారంగా పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు పురాతన మానవులు నరమాంస భక్షకులేమో అనే అభిప్రాయం ఉండగా, ఈ ఆధారాలు ఆ వాదనకు బలం చేకూరుస్తున్నాయి.
Readmore: https://teluguprabha.net/national-news/stampede-in-manasa-devi-temple-in-haridwar/
ఈ విశ్లేషణ మానవ వికాసంపై కొత్త ప్రశ్నలు రేకెత్తించగలగడం విశేషం. ప్రస్తుత మానవుడి ప్రవర్తన, సంస్కృతి, సమాజ వికాసానికి ఇది ప్రాథమిక మూలంగా నిలిచే అవకాశం ఉంది.


