అగ్రరాజ్యం అమెరికా(America)లో ఇటీవల వరుస విమాన ప్రమాదాలు కలవరపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఓ పెను ప్రమాదం తప్పింది. షికాగో మిడ్‌వే విమానాశ్రయంలో ఓ విమానం రన్‌వే పైకి ల్యాండ్ అవుతున్న సమయంలో మరో విమానం అడ్డంగా వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో భారీ ప్రాణనష్ణం తప్పినట్లైంది.
ఒమాహా నుంచి బయలుదేరిన సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ విమానం మంగళవారం ఉదయం 8:47 గంటలకు షికాగోలోని మిడ్ వే ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ల్యాండవుతోంది. ఎయిర్‌పోర్టులోని రన్‌వే 31సీపై విమానం కిందకు దిగుతుండగా ఇదే రన్ వేపై ఛాలెంజర్ 350 అనే ప్రైవేట్ జెట్ అడ్డంగా వచ్చింది. ఈ జెట్‌ను గమనించిన సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ విమానం పైలెట్ మళ్లీ గాల్లోకి టేకాఫ్ తీసుకున్నాడు. దీంతో రెండు విమానాలు ఢీకొనే ప్రమాదం తప్పింది. లేదంటే అనేక మంది ప్రయాణికుల ప్రాణాల్లో గాల్లో కలిసిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దర్యాఫ్తు చేపట్టారు. సదరు ప్రైవేట్ జెట్ పైలట్ ఎలాంటి అనుమతి లేకుండా రన్ వేపైకి వచ్చాడని ప్రాథమికంగా తేల్చారు.