Another Hindu Temple Vandalized in Indiana: అమెరికాలో హిందూ దేవాలయాలపై దాడులు ఆగడం లేదు. ఈసారి ఇండియానా రాష్ట్రంలోని గ్రీన్‌వుడ్ సిటీలో ఉన్న BAPS స్వామినారాయణ దేవాలయంపై దుండగులు దాడి చేశారు. ఆగస్టు 10న జరిగిన ఈ ఘటనలో దేవాలయం ప్రధాన బోర్డును ధ్వంసం చేశారు. ఈ సంఘటనను భారత కాన్సులేట్ జనరల్ తీవ్రంగా ఖండించారు.
చికాగోలోని భారత కాన్సులేట్ జనరల్ ఈ దాడిని “హేయమైన చర్య”గా అభివర్ణించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని, నిందితులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులను కోరారు. కాన్సుల్ జనరల్ దేవాలయాన్ని సందర్శించి, భక్తులతో, స్థానిక నాయకులతో సమావేశమయ్యారు. ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా అందరూ ఐక్యంగా ఉండాలని, దుండగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
విద్వేషపూరిత నేరం..
కేవలం ఈ ఏడాదిలో BAPS దేవాలయంపై ఇలాంటి దాడి జరగడం ఇది నాలుగోసారి అని దేవాలయ నిర్వాహకులు తెలిపారు. ఇది తమ భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని పేర్కొన్నారు. అయినప్పటికీ, తమ సంఘం ఇటువంటి మత వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ దాడిని ఒక “విద్వేషపూరిత నేరం”గా BAPS స్వామినారాయణ సంస్థ వర్ణించింది.
అమెరికా కాంగ్రెస్ సభ్యుడు నిక్ లలోటా కూడా ఈ దాడిని ఖండించారు. “మతపరమైన నేరాలను తీవ్రంగా ఖండించాలి, వాటికి పాల్పడినవారిని జవాబుదారీగా చేయాలి” అని ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ ఘటన శ్రీకృష్ణ జన్మాష్టమికి కొద్ది రోజుల ముందు జరగడం భక్తులను మరింత కలచివేసింది. మార్చి నెలలో కాలిఫోర్నియాలోని BAPS దేవాలయంపై కూడా ఇలాంటి దాడి జరిగింది.


