కెనడాలో(Canada) ఖలిస్థానీ వేర్పాటువాదులు మరోసారి రెచ్చిపోయారు. శనివారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఖలిస్థానీ జెండాలతో శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయ ప్రాంగణంలో వీరంగం సృష్టించారు. అనంతరం ఆలయ ప్రవేశ ద్వారం, కొన్ని స్తంభాలను ధ్వంసం చేశారు. గోడలు, స్తంభాలపై ఖలిస్థానీ ఉద్యమానికి మద్దతుగా రాతలు రాశారు. అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలను కూడా దుండగులు అపహరించుకుపోయారని ఆలయ ప్రతినిధులు తెలిపారు.
భక్తుల మనోభావాలు దెబ్బతినే ఇటువంటి ద్వేషపూరిత విధ్వంసాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఇటువంటి చర్యలు సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టి, శాంతికి భంగం కలిగిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆలయంపై జరిగిన దాడి వెనుక భారత వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆలయ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు చెప్పారు.