మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వంపై జరిగిన విద్యార్థుల నేతృత్వంలోని తిరుగుబాటుకు ఏడాది పూర్తయిన సందర్భంగా, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ‘జూలై డిక్లరేషన్’ను ఆవిష్కరించింది. ఈ డిక్లరేషన్ అధికారికంగా 2024 జూలై నాటి సామూహిక తిరుగుబాటును గుర్తిస్తూ, భవిష్యత్తులో దేశం అనుసరించాల్సిన రాజకీయ, రాజ్యాంగ, పాలనా సంస్కరణలపై 26 అంశాలను ప్రకటించింది.
తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనుస్ ఈ డిక్లరేషన్‌ను మంగళవారం ప్రకటించారు. షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP), జమాతే ఇస్లామీ, కొత్తగా ఏర్పడిన నేషనల్ సిటిజెన్ పార్టీ (NCP) వంటి రాజకీయ పార్టీల నేతలతో చర్చించిన తర్వాత ఈ ప్రకటనను రూపొందించారు.
రాజ్యాంగంపై విమర్శలు..
ఈ ‘జూలై డిక్లరేషన్’, 1972లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం తర్వాత రూపొందించిన రాజ్యాంగాన్ని తీవ్రంగా విమర్శించింది. ఆనాటి రాజ్యాంగం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందని పేర్కొంది. షేక్ హసీనా పాలనను “ప్రజా వ్యతిరేక, నిరంకుశ, మానవ హక్కులకు వ్యతిరేకమైన” పాలనగా అభివర్ణించింది.
ఈ ప్రకటన ద్వారా, 2024 నాటి తిరుగుబాటుకు సరైన రాజ్యాంగ గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ తిరుగుబాటుకు ఏడాది పూర్తయిన సందర్భంగా వేలాది మంది ప్రజలు ఢాకా వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు.
అయితే, తాత్కాలిక ప్రభుత్వం మానవ హక్కుల ఎజెండాను అమలు చేయడంలో విఫలమైందని హ్యూమన్ రైట్స్ వాచ్ (HRW) విమర్శించింది. షేక్ హసీనా పాలనను వ్యతిరేకించిన ప్రజల ఆశలు ఇంకా నెరవేరలేదని పేర్కొంది.


