BBC Tim Davie resignation : ప్రపంచ ప్రఖ్యాత వార్తా సంస్థ బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (BBC)లో పెను ప్రకంపనలు! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై రూపొందించిన ఓ డాక్యుమెంటరీలో ఆయన ప్రసంగాన్ని తప్పుగా ఎడిట్ చేశారన్న ఆరోపణలు పెను దుమారం రేపడంతో, సంస్థ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు న్యూస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డెబోరా టర్నెస్ కూడా తప్పుకున్నారు. ఇంతకీ ఆ డాక్యుమెంటరీలో బీబీసీ చేసిన తప్పేంటి? ఈ రాజీనామా వెనుక ఉన్న అసలు కథేంటి?
వివాదానికి దారితీసిన ‘ఎడిటింగ్’ : బీబీసీ ఇటీవల ఎదుర్కొంటున్న పక్షపాత ఆరోపణలకు ఈ వివాదం ఆజ్యం పోసింది. జనవరి 6, 2021న క్యాపిటల్ హిల్‌పై దాడి ఘటనకు ముందు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగాన్ని బీబీసీ తన ప్రతిష్టాత్మక ‘పనోరమా’ కార్యక్రమంలో తప్పుగా ఎడిట్ చేసిందని ‘డైలీ టెలిగ్రాఫ్’ పత్రిక వరుస కథనాలను ప్రచురించింది.
అసలేం జరిగింది?: ట్రంప్ తన ప్రసంగంలో వేర్వేరు సమయాల్లో చెప్పిన రెండు వాక్యాలను బీబీసీ కలిపి చూపింది. “మనం క్యాపిటల్ వైపు నడుద్దాం” అని చెప్పిన వెంటనే, ప్రసంగంలో మరోచోట అన్న “మనం చావో రేవో తేల్చుకుందాం (fight like hell)” అనే వాక్యాన్ని జతచేసింది. దీనివల్ల, క్యాపిటల్ హిల్‌పై దాడికి ట్రంపే నేరుగా తన మద్దతుదారులను రెచ్చగొట్టినట్లుగా కనిపించింది. ఈ ఎడిటింగ్‌పై అంతర్గతంగానే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
వెల్లువెత్తిన విమర్శలు.. ట్రంప్ టీమ్ ఫైర్ : ఈ ఎడిటింగ్ బట్టబయలు కావడంతో బీబీసీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, ట్రాన్స్ జెండర్ల అంశాలలో కూడా బీబీసీ రాజకీయంగా తటస్థంగా వ్యవహరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తాజా వివాదంపై డొనాల్డ్ ట్రంప్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ తీవ్రంగా స్పందించారు. “బీబీసీ 100% ఫేక్ న్యూస్, అదొక ప్రచార యంత్రాంగం,” అని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు.
“ఇది నా సొంత నిర్ణయం” – టిమ్ డేవీ : విమర్శల నేపథ్యంలో, బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ తన రాజీనామాను ప్రకటించారు.
డేవీ ప్రకటన: “ఇది పూర్తిగా నా సొంత నిర్ణయం. నా పదవీకాలం అంతటా, ముఖ్యంగా ఈ క్లిష్ట రోజుల్లో నాకు అండగా నిలిచిన ఛైర్మన్, బోర్డుకు కృతజ్ఞతలు. ఈ సంక్లిష్ట సమయంలో ఈ బాధ్యతలను మోయడం వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎంతో ఒత్తిడితో కూడుకున్నది. నా తర్వాత వచ్చే వారికి సంస్థ భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకోవడానికి తగిన సమయం ఇవ్వాలనుకుంటున్నాను,” అని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.
కొత్త డైరెక్టర్ జనరల్‌ను నియమించే వరకు, రాబోయే కొన్ని నెలల పాటు టిమ్ డేవీ తన పదవిలో కొనసాగుతారు. అయితే, డేవీ ఆకస్మిక నిర్ణయం బీబీసీ బోర్డును దిగ్భ్రాంతికి గురిచేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.


