Donald Trump- America Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని రిపబ్లికన్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బుధవారం నాటి కౌంటింగ్ వివరాల ప్రకారం, ప్రతిపక్ష డెమొక్రాట్లు చారిత్రక విజయం దిశగా దూసుకుపోతూ యుఎస్ కాంగ్రెస్‌లోని సెనేట్, ప్రతినిధుల సభల్లో పట్టు సాధించడం విశేషం. డెమొక్రాట్లు ప్రతినిధుల సభలో మెజార్టీ సాధించారు. ఇంకా రిపబ్లికన్ల బలంగా ఉన్న సెనేట్‌లో కూడా ఆధిపత్యం ప్రదర్శించారు.
రిపబ్లికన్ పార్టీకి కంచుకోటలుగా ఉన్న టెక్సాస్, కాన్సాస్, సౌత్ కరోలినా, ఒహాయో వంటి రాష్ట్రాల్లో డెమొక్రాట్లు ఊహించని విజయాలు సాధించడమే కాకుండా.. టెక్సాస్ సెనేట్ స్థానంలో ట్రంప్ మద్దతుదారుడైన కెన్ పాక్స్టన్‌ను డెమొక్రాట్ జేమ్స్ తలారికో ఓడించి రికార్డు సృష్టించారు.
ఇవే కారణాలా.?
అమెరికాలో విపరీతంగా పెరిగిన నిత్యావసర ధరలు, ఇంధన ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంపై ఓటర్లలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడమే కాకుండా.. ఇరాన్‌తో అమెరికా జరిపిన దాడులు/యుద్ధ వాతావరణం, విదేశీ వస్తువులపై సుంకాల విధింపు వంటి ట్రంప్ నిర్ణయాలపై ప్రజలు అసంతృప్తితో ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
కాగా, ఈ ఓటమిపై ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ట్రూత్ సోషల్’ లో స్పందించారు. ఈ ఎన్నికల బ్యాలెట్‌లో తన పేరు లేదని.. ఒకవేళ తానే గనుక నేరుగా పోటీలో ఉండి ఉంటే రిపబ్లికన్లు భారీ మెజార్టీతో విజయం సాధించేవారని ధీమా వ్యక్తం చేస్తూ ఓటమి బాధ్యతను తనపై వేసుకోకపోవడం నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ ఫలితాలను తాను పూర్తిగా అంగీకరిస్తున్నానని ట్రంప్ అన్నారు. రాబోయే రెండేళ్ల కాలంలో దేశ ప్రయోజనాల కోసం డెమొక్రాట్లతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వైట్ హౌస్ వేదికగా స్పష్టం చేశారు.
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఎదురైన ఈ పరాభవం.. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవీ కాలానికి సవాలుగా మారనుంది. ఈ మిగిలిన రెండేళ్లలో కీలక బిల్లులు ఆమోదించుకోవడం, సొంత ఎజెండాను ముందుకు ఎలా తీసుకెళ్తారో వేచి చూడాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

