Sunday, July 13, 2025
Homeఇంటర్నేషనల్Masood Azar : మసూద్ అజార్ ఎక్కడున్నాడో తెలియదు.. భారత్‌ చెబితే పట్టుకుంటాం!

Masood Azar : మసూద్ అజార్ ఎక్కడున్నాడో తెలియదు.. భారత్‌ చెబితే పట్టుకుంటాం!

Pakistan Double Standards on Terrorism :  మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఎక్కడ ఉన్నాడో తమకు తెలియదని పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి,  బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలు మరోసారి దాయాది దేశం ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేశాయి. ఈ నేపథ్యంలో… భుట్టో మాటలపై భారత్ ఎలా స్పందించింది..? అసలు బిలావల్ భుట్టో ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది..? ఇంతకీ ఈ అంతర్జాతీయ  మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్  మసూద్ అజార్ నేపథ్యం ఏమిటి? తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదవండి.

- Advertisement -

అరెస్టు చేస్తామంటూ వ్యంగ్యం : మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదులు జైషే మహ్మద్‌ ముఠా అధినేత మసూద్‌ అజార్‌, లష్కరే తోయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌లు పాకిస్థాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని భారత్‌ ఎన్నిసార్లు గట్టిగా చెబుతున్నా, ఆ దేశం మాత్రం దానిని అంగీకరించట్లేదు. తాజాగా ఆ దేశ మాజీ మంత్రి, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ అధినేత బిలావల్‌ భుట్టో కూడా మరోసారి అసత్యాలు పలికారు. మసూద్‌ అజార్‌ ఎక్కడున్నాడో తమకు తెలియదని కుండబద్దలు కొట్టారు. అతడు పాక్‌లో ఎక్కడున్నాడో భారత్‌ చెబితే సంతోషంగా అరెస్టు చేస్తామంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిలావల్‌ భుట్టో చేసిన ఈ వ్యాఖ్యలు భారత్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

బిలావల్‌ భుట్టో ఏమన్నారంటే: పాకిస్థాన్​తో జరిగే సమగ్ర చర్చల్లో ఉగ్రవాదం కూడా ఒక కీలక అంశమని, దీనిని అరికట్టే విషయంలో చేసే ఎలాంటి చర్యలనైనా పాక్​ వ్యతిరేకించదని భుట్టో స్పష్టం చేశారు. అయితే, ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ స్వేచ్ఛగా తిరుగుతున్నాడంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, అతడు పాకిస్థాన్ కస్టడీలోనే ఉన్నాడని బిలావల్‌ భుట్టో నొక్కి చెప్పారు. ఇక, మసూద్‌ అజార్‌ విషయానికొస్తే, అతడు ఎక్కడున్నాడో తాము గుర్తించలేక అరెస్టు చేయలేకపోతున్నామని వివరించారు. గతంలో జరిగిన కొన్ని ఘటనలను గమనిస్తే, బహుశా అతడు అఫ్గానిస్థాన్‌లో ఉండి ఉండవచ్చని భావిస్తున్నామని చెప్పుకొచ్చారు.

ప్రాథమిక అంశాలను భారత్‌ పాటించట్లేదు: ఒకవేళ అతడు పాకిస్థాన్ గడ్డ పైనే ఉన్నట్లు భారత ప్రభుత్వం తమకు కచ్చితమైన సమాచారం ఇస్తే, తాము సంతోషంగా అతడిని అరెస్టు చేస్తామని భుట్టో సవాల్‌ విసిరారు. కానీ, న్యూదిల్లీ ఆ వివరాలు ఇవ్వదని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా వీరిపై దాఖలైన కేసులు ఉగ్రవాదానికి నిధులు అందించడం వంటివి ఉన్నాయని, ఇవన్నీ పాక్‌కు సంబంధించినవేనని పేర్కొన్నారు. ఈ ఉగ్రవాదులపై నేరారోపణకు అవసరమైన కొన్ని ప్రాథమిక అంశాలను భారత్‌ పాటించట్లేదని భుట్టో తప్పుబట్టారు. కోర్టుకు సాక్ష్యాలను సమర్పించడం, భారత్​ నుంచి సాక్షులు వచ్చి చెప్పడం, ప్రతి ఆరోపణలు చేయడం లాంటివి పాటించాలని ఆయన సూచించారు. ఇందుకు భారత్‌ సిద్ధంగా ఉంటే వారిని అప్పగించడంలో ఎలాంటి అడ్డంకి ఉందని తాను భావించడం లేదని బిలావల్‌ భుట్టో తన వాదనను వినిపించారు.

పాక్‌లోనే మసూద్ అజార్​ : ఇటీవల జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను విజయవంతంగా చేపట్టిన విషయం తెలిసిందే. పాక్‌, పీఓకేలోని జైషే, లష్కరే ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత బలగాలు భీకర దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఉగ్రముఠాల ప్రధాన కార్యాలయాలు ధ్వంసం అయ్యాయి. అంతేకాకుండా, భారత్‌ దాడుల్లో తమ కుటుంబంలో 10 మంది చనిపోయారని మసూద్‌ అజార్‌ స్వయంగా చెప్పినట్లు విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ పరిణామాల వేళ బిలావల్‌ భుట్టో తాజాగా చేసిన వ్యాఖ్యలు దాయాది ద్వంద్వవైఖరికి మరోసారి అద్దం పడుతున్నాయి. భారత్‌ వద్ద ఉన్న పటిష్టమైన నిఘా సమాచారం ప్రకారం, మసూద్‌ అజార్‌ పాకిస్థాన్‌లోనే ఆశ్రయం పొందుతున్నట్లు స్పష్టమవుతోంది.

ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా మసూద్‌ అజార్‌: పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్‌ ఉగ్ర ముఠా అధినేత అయిన మసూద్‌ అజార్​ భారత్‌లో పలు భీకర ఉగ్రదాడులకు సూత్రధారి. అతడిని 1995లో భారత్‌ అరెస్టు చేసింది. కానీ, 1999లో కొందరు ఉగ్రవాదులు ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్‌ చేసి మసూద్​ను విడిపించుకున్నారు. ఆ తర్వాత అతడు జైషే మహ్మద్‌ను ఏర్పాటు చేశాడు. 2001లో భారత పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రదాడి, 2008లో ముంబయిలో జరిగిన బాంబు పేలుళ్లలోనూ ఇతడి పాత్ర స్పష్టంగా ఉంది. ఇతడిని అంతర్జాతీయంగా అగ్రశ్రేణి ఉగ్రవాదిగా పరిగణిస్తారు. 2019లో ఐక్యరాజ్యసమితి (ఐరాస) మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఐరాస ప్రకటన అనంతరం కూడా పాకిస్థాన్ అతడికి ఆశ్రయం కల్పిస్తుండటం అంతర్జాతీయ సమాజంలో తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News