పాకిస్తాన్‌లో అంతర్గత కల్లోలాలు తీవ్రతరం అవుతున్నాయి. బలూచిస్తాన్ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) కల్లోలం రేపుతోంది. తాజా ఘటనల్లో ఏప్రిల్ 29–30 మధ్య రాత్రి జరిగిన వరుస దాడుల్లో పాకిస్తాన్ ఆర్మీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది. తర్బాత్, డుక్కీ, తన్నుక్ వంటి ప్రాంతాల్లో బీఎల్ఏ ఫైటర్లు విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో కనీసం 22 మంది పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
దాడుల్లో పాక్ సైన్యానికి చెందిన కాన్వాయ్‌లను లక్ష్యంగా చేసుకున్నట్టు బీఎల్ఏ జవాన్లు జీయంద్ బలూచ్ ప్రకటించారు. తెల్లవారుజామున జరిగిన ఈ ఆకస్మిక దాడుల్లో పాక్ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. అటు, బీఎల్ఏ తమ ముగ్గురు యోధులను ఈ ఆపరేషన్‌లో కోల్పోయినట్లు వెల్లడించింది.
భారత్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, పాకిస్తాన్ సైన్యం తన బలగాలను భారత సరిహద్దులవైపు తరలించడంతో, బలూచిస్తాన్‌లో భద్రతా లోపం ఏర్పడింది. దీన్ని అవకాశంగా మలచుకున్న బీఎల్ఏ.. పాక్ ఆర్మీ స్థావరాలపై తీవ్రంగా దాడులకు పాల్పడుతోంది. బలూచిస్తాన్‌లో తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న బీఎల్ఏ.. ప్రభుత్వ భవనాలను స్వాధీనం చేసుకుంటూ సాగుతోంది.
తాజాగా కలాట్ జిల్లాలోని మంగోచార్ పట్టణాన్ని బీఎల్ఏ నియంత్రణలోకి తీసుకున్నట్టు సమాచారం. అనేక ప్రభుత్వ కార్యాలయాలను జెండాలు మారుస్తూ తమ అధీనంలోకి తెచ్చుకుంది. ఓ ప్రభుత్వ భవనానికి నిప్పు పెట్టారు. ఈ పరిణామాలు పాకిస్తాన్‌కు డబుల్ కష్టంగా మారుతున్నాయి. ఒకవైపు భారత్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా.. మరోవైపు ఇంట్లోనే వేర్పాటువాదుల తీవ్రదాడులు ఆ దేశ భద్రతా వ్యవస్థపై ప్రశ్నార్థకం అయ్యింది.