Jakarta Mosque Explosion: ఇండోనేషియా రాజధాని జకార్తాలోని ఒక పాఠశాల మసీదులో శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా జరిగిన పేలుడు ఆందోళన రేపింది. ఈ ఘటనలో కనీసం 54 మంది గాయపడ్డారని అక్కడి పోలీస్ అధికారులు తెలిపారు. గాయపడినవారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నట్లు వెల్లడైంది. అయితే వరుస పేలుళ్లకు కారణాలు అన్వేషించే పనిలో అక్కడి అధికారులు ఉన్నారు.
మధ్యాహ్నం సమయానికి, సర్మన్ ప్రారంభమైన వెంటనే రెండు భారీ శబ్దాలు వినిపించాయని సాక్ష్యులు వెల్లడించారు. క్షణాల్లోనే మసీదు పొగతో నిండిపోయిందని.. విద్యార్థులు, ప్రార్థకులు బయటకు పరుగులు తీశారని చెప్పారు. దాంతో అక్కడ ఒక గందరగోళ వాతావరణం నెలకొంది. పేలుడు SMA 27 అనే ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన మసీదులో జరిగిందని జకార్తా నగర పోలీస్ చీఫ్ ఆసెప్ ఎడి సుహెరీ వెల్లడించారు. ఈ పాఠశాల నావీ కాంపౌండ్‌లో ఉంది. గాయపడిన వారిలో కొంతమందిని సమీప ఆసుపత్రులకు తరలించగా.. 20 మంది విద్యార్థులు ఇంకా చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి సీరియస్‌గా ఉందని ఆయన వెల్లడించారు.
పోలీసులు ఘటన స్థలాన్ని మూసివేసి దర్యాప్తు ప్రారంభించారు. బాంబ్ స్క్వాడ్ బృందం అక్కడి నుంచి కొన్ని టాయ్ గన్నులు, టాయ్ రైఫిళ్లు స్వాధీనం చేసుకుంది. ఈ పేలుళ్లు మసీదు లౌడ్‌స్పీకర్ వద్ద నుండి జరిగినట్టు తెలుస్తోంది. దేశ ఉపసభాపతి సుఫ్మీ దస్కో అహ్మద్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి, 17 సంవత్సరాల వ్యక్తిని అనుమానిత నిందితుడిగా గుర్తించామని వెల్లడించారు. అతను ప్రస్తుతం శస్త్రచికిత్సలో ఉన్నాడని అన్నారు.
ప్రజలను ఆందోళన చెందవద్దని పోలీస్ చీఫ్ సుహెరీ సూచించారు. ఘటన వెనుక అసలు కారణం ఇంకా నిర్ధారించలేదని, సాక్ష్యాలు సేకరించిన తర్వాత మాత్రమే వివరాలు వెల్లడిస్తామని అన్నారు. జకార్తా ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద భద్రతాపరమైన దాడులను ఎదుర్కోలేదు. విద్యార్థులపై జరిగిన ఈ దారుణం దేశవ్యాప్తంగా భయానికి దారి తీసింది.


