‘Block Everything’ Protests Rock France: ఫ్రాన్స్‌లో రాజకీయ అస్థిరతతో పాటు ప్రజా ఆగ్రహం తీవ్రస్థాయికి చేరింది. అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు చేపట్టిన ‘అన్నీ బ్లాక్ చేయండి’ (Block Everything) అనే నిరసన ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. ఈ నిరసనకారులు రోడ్లను దిగ్బంధం చేసి, వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో పోలీసులు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ అల్లర్లలో దాదాపు 200 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
‘అన్నీ బ్లాక్ చేయండి’ ఉద్యమం సోషల్ మీడియా, ఎన్‌క్రిప్టెడ్ చాట్‌ల ద్వారా వేగంగా పుంజుకుంది. తమ డిమాండ్లను సాధించేందుకు ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ, ఆర్థిక కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 80 వేల మంది పోలీసులను మోహరించి, అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించింది. అయినప్పటికీ, నిరసనకారులు కొన్ని చోట్ల విధ్వంసానికి పాల్పడ్డారు.
దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి బ్రూనో రిటైల్లావు మాట్లాడుతూ.. పశ్చిమ నగరమైన రెన్నెస్‌లో ఒక బస్సుకు నిప్పు పెట్టారని, నైరుతి ప్రాంతంలో రైల్వే లైన్లకు నష్టం కలిగించారని తెలిపారు. ఈ విధ్వంసం ప్రజల్లో ‘విప్లవ వాతావరణాన్ని’ సృష్టించే ప్రయత్నమని ఆయన ఆరోపించారు.
ALSO READ: Nepal Crisis: నేపాల్ సంక్షోభం.. సైన్యంతో చర్చలకు మాజీ సీజే సుశీలా కర్కీ.. యువత సంచలన నిర్ణయం!
ఈ నిరసనల కారణంగా ఫ్రాన్స్‌లో మరోసారి సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల ప్రధాని ఫ్రాంకోయిస్ బేరు పార్లమెంట్‌లో విశ్వాస తీర్మానాన్ని కోల్పోవడంతో ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో అధ్యక్షుడు మాక్రాన్ కొత్త ప్రధానిగా సెబాస్టియన్ లెకార్నును నియమించారు. అయితే, కొత్త ప్రధాని ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఈ నిరసనలు మొదలవడంతో, ఆయనకు తీవ్రమైన సవాలు ఎదురైంది.
నిరసనకారులు ప్రధానంగా ఆర్థిక అసమానతలు, ప్రభుత్వ కొత్త బడ్జెట్ ప్రణాళికలోని కఠినమైన చర్యలను వ్యతిరేకిస్తున్నారు. ఈ ఉద్యమం గతంలో మాక్రాన్ ప్రభుత్వంపై నిరసన తెలిపిన ‘యెల్లో వెస్ట్’ ఉద్యమాన్ని గుర్తు చేస్తోంది. ఆ ఉద్యమం లాగే, ఈ ‘అన్నీ బ్లాక్ చేయండి’ ఉద్యమం కూడా నాయకత్వం లేకుండానే విస్తరిస్తుండడం గమనార్హం.
ALSO READ: “Hitler Of Our Time”: ట్రంప్ నేటి హిట్లర్.. రెస్టారెంట్‌లో పాలస్తీనా మద్దతుదారుల నిరసన


