Homeఇంటర్నేషనల్Bomb blasts in Pakistan: పాకిస్థాన్‌లో మరోసారి బాంబు పేలుళ్లు.. 9 మంది దుర్మరణం..!

Bomb blasts in Pakistan: పాకిస్థాన్‌లో మరోసారి బాంబు పేలుళ్లు.. 9 మంది దుర్మరణం..!

Bomb blasts in Pakistan crowded market: నిత్యం ఎక్కడోచోట బాంబు పేలుళ్లతో దద్దరిల్లే పాకిస్థాన్‌లో మరోసారి బాంబు పేలుళ్లు సంభవించాయి. రద్దీగా ఉండే ఓ మార్కెట్‌లో బాంబు పేలడంతో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. డజన్ల కొద్దీ ప్రజలు గాయాలపాలయ్యారు. మంగళవారం నౌరంగ్ బజార్‌లో జరిగిన ఈ దాడి తీవ్ర కలకలం రేపుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌ సమీపంలోని ఈ ప్రాంతంలో బాంబు పేలుడు ఘటన జరగడంతో.. ఆఫ్ఘనిస్తాన్‌తో మళ్లీ సరిహద్దు పోరు రాజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఘటనా స్థలంలో దుకాణాలు, వాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. క్షతగాత్రులను రక్షించేందుకు స్థానికులు, అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/big-shock-for-non-veg-lovers/

ఇది అఫ్గానిస్థాన్‌ పనేనంటూ పాక్‌ ఆరోపణ..

కాగా, గత శనివారం కూడా బన్నూ జిల్లాలోని ఓ పోలీస్ పోస్ట్‌పై జరిగిన బాంబు దాడిలో 15 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరవకముందే మరో పేలుడు సంభవించింది. శనివారం జరిగిన దాడికి అఫ్గానిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులే కారణమని పాకిస్తాన్ ఆరోపించింది. కానీ అఫ్గాన్‌ మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్‌లో ఉన్న ఉగ్రవాదం వాళ్ల అంతర్గత సమస్యని.. తాము ఎవరికీ ఆశ్రయం ఇవ్వడం లేదని ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం వాదనలు వినిపిస్తోంది. అయితే, తాజాగా జరిగిన బాంబు దాడి వెనుక తాలిబన్ల హస్తం ఉండే ఛాన్స్ ఉందని పలువురు పాక్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడిలో గాయపడ్డవారిని మెరుగైన చికిత్స కోసం బన్నూలోని ఆసుపత్రులకు తరలించారు. తమ ఆసుపత్రిలో మొత్తం 37 మంది క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందజేస్తున్నట్లు టీహెచ్‌క్యూ ఆసుపత్రి అధికారులు స్పష్టం చేశారు. వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. అయితే, ఫిబ్రవరిలో పాకిస్థాన్‌.. అఫ్గాన్‌పై వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో, పాకిస్థాన్‌లో వరుసగా బాంబు పేలుళ్ల ఘటనలు జరగడం ఆందోళనకరంగా మారింది. ఇరు దేశాల మధ్య వైరంతో సామాన్యులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News