Saturday, November 15, 2025
Homeఇంటర్నేషనల్Ban Ignored: కంచే చేను మేసింది.. కెన్యాలో బ్రిటిష్ సైనికుల బరితెగింపు!

Ban Ignored: కంచే చేను మేసింది.. కెన్యాలో బ్రిటిష్ సైనికుల బరితెగింపు!

British Army Kenya Scandal : క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాల్సిన సైన్యానికే మాయని మచ్చ తెచ్చేలాంటి ఘటన ఇది. కెన్యాలోని వివాదాస్పద బ్రిటిష్ ఆర్మీ స్థావరంలో (BATUK) సైనికులు ప్రవర్తిస్తున్న తీరుపై వెలువడిన ఒక అధికారిక నివేదిక, బ్రిటిష్ సైన్యం పరువును బజారుకీడ్చింది. లైంగిక కార్యకలాపాల కోసం డబ్బు చెల్లించడంపై ఉన్న కఠినమైన నిషేధాన్ని బేఖాతరు చేస్తూ, కొందరు సైనికులు స్థానిక సెక్స్ వర్కర్లతో గడుపుతున్నారని ఆర్మీ విచారణలోనే తేలింది. ఒక మహిళ దారుణ హత్య తర్వాత మొదలైన ఈ దర్యాప్తు, ఇప్పుడు మరిన్ని చీకటి కోణాలను వెలుగులోకి తెచ్చింది. అసలు ఈ విచారణ ఎందుకు మొదలైంది..? నివేదికలో వెలుగు చూసిన విస్తుపోయే నిజాలేంటి..? సైన్యం ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది..?

- Advertisement -

ఒక హత్యతో మొదలైన దర్యాప్తు : 2012లో ఆగ్నెస్ వంజిరు అనే 21 ఏళ్ల యువతి, కెన్యాలోని నాన్యుకి పట్టణంలో దారుణ హత్యకు గురైంది. ఆమె మృతదేహాన్ని ఒక సెప్టిక్ ట్యాంక్‌లో పడేశారు. హత్య జరిగిన రోజు రాత్రి ఆమె కొందరు బ్రిటిష్ సైనికులతో ఒక హోటల్‌లో గడిపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై ‘సండే టైమ్స్’ పత్రిక 2021లో ఒక సంచలన కథనాన్ని ప్రచురించడంతో, బటుక్ సైనిక స్థావరంలో సైనికుల ప్రవర్తనపై తీవ్ర ప్రజాందోళన మొదలైంది. దీనికి తోడు ఐటీవీ రూపొందించిన ఒక డాక్యుమెంటరీ ఈ వివాదాన్ని మరింత రాజేసింది. ఈ నేపథ్యంలో, బ్రిటిష్ ఆర్మీ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.

విచారణలో వెలుగు చూసిన నిజాలు : బ్రిటన్ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్, జనరల్ సర్ రోలీ వాకర్, ఈ నివేదికపై తీవ్రంగా స్పందించారు. “లైంగిక దోపిడీకి పాల్పడకుండా చూడటానికి సైన్యం కట్టుబడి ఉంది. అయినప్పటికీ, కెన్యాలో ఇప్పటికీ పరిమిత స్థాయిలో సెక్స్ వర్కర్లకు డబ్బులు చెల్లించి లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు దర్యాప్తు కమిటీ పరిశోధనలో తేలింది. ఇలా జరగడానికి వీల్లేదు,” అని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

నిషేధం ఉల్లంఘన: విదేశాల్లోని సైనికులు సెక్స్ వర్కర్లతో గడపడంపై 2022లో బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ కఠినమైన నిషేధం విధించింది. అయినప్పటికీ, ఈ నిబంధన అమల్లోకి వచ్చాక కూడా బటుక్ స్థావరంలో 35 సార్లు సైనికులు డబ్బు చెల్లించి సెక్స్‌లో పాల్గొన్నట్లు నివేదిక తేల్చింది. ఆ సమయంలో బటుక్ స్థావరంలో సుమారు 7,666 మంది బ్రిటిష్ సైనికులు ఉన్నారు. శిక్షణ తర్వాత కూడా..ఈ కొత్త నియమావళిపై సైనికులకు శిక్షణ ఇవ్వకముందు 26 కేసులు నమోదు కాగా, కఠినమైన శిక్షణ ఇచ్చామని చెప్పిన తర్వాత కూడా 9 కేసులు నమోదు కావడం గమనార్హం.

కొనసాగుతున్న దర్యాప్తులు: మెజారిటీ కేసులలో సైనికులు డబ్బులిచ్చి సెక్స్‌లో పాల్గొన్నట్లు నిరూపణ కాలేదని నివేదిక పేర్కొన్నప్పటికీ, ప్రస్తుతం ఐదు కేసులపై దర్యాప్తు కొనసాగుతోందని విదేశీ కార్యాలయం తెలిపింది.

ఆర్మీ ముందున్న సవాలు : ఈ నివేదికలోని సూచనలను అమలు చేస్తామని బ్రిటిష్ ఆర్మీ ప్రకటించింది. సెక్స్ వర్కర్లను ఉపయోగించుకున్నట్లు రుజువైన సైనికులను సర్వీస్ నుంచి తొలగించడంతో పాటు, మిగిలిన వారికి అదనపు శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. ఈ విచారణలో భాగంగా దర్యాప్తు బృందం స్థానికులతో మాట్లాడినప్పుడు, సైనికులపై మరిన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. తమను గాయపరిచారని, స్థానిక మహిళలతో పిల్లలను కని వారిని వదిలేశారని కొందరు ఫిర్యాదు చేశారు. ఇదే స్థావరంలో ఓ సైనికుడిపై అత్యాచారం ఆరోపణలు రావడంతో, ఈ ఏడాది జూన్‌లో అతడిని స్వదేశానికి పంపించారు.

ఈ ఆరోపణలన్నీ ఒకవైపు ఉండగా, బటుక్‌లో బ్రిటిష్ ఆర్మీ క్యాంపు ఉండటం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతోందని, దానివల్ల తాము సంతోషంగా ఉన్నామని మెజారిటీ స్థానికులు చెప్పడం ఈ సమస్యలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad