California Declare Diwali an Official State Holiday: అమెరికాలో నివసిస్తున్న భారతీయ డయాస్పోరాకు ఇది చారిత్రక పరిణామం. దీపావళి పండుగను అధికారిక రాష్ట్ర సెలవు దినంగా గుర్తిస్తూ కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళికి సెలవు ప్రకటించిన అమెరికాలో ఇది మూడవ రాష్ట్రం కావడం విశేషం.
కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ మంగళవారం అసెంబ్లీ సభ్యుడు ఆష్ కల్రా ప్రవేశపెట్టిన బిల్లు (AB 268)పై సంతకం చేశారు. ఈ బిల్లుకు గత నెలలోనే రాష్ట్ర శాసనసభ రెండు సభల్లో ఆమోదం లభించింది.
ALSO READ: Donald Trump: భారత్-పాక్ శాంతి నా వల్లే… టారిఫ్‌లతోనే దారికి వచ్చారు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
“అమెరికాలో అత్యధిక సంఖ్యలో భారతీయ అమెరికన్లు నివసిస్తున్న రాష్ట్రం కాలిఫోర్నియా. దీపావళిని అధికారిక సెలవు దినంగా ప్రకటించడం వల్ల ఈ పండుగ సందేశం లక్షలాది మంది కాలిఫోర్నియా పౌరులకు చేరువవుతుంది, ఇది మన వైవిధ్యభరితమైన రాష్ట్రంలో మరింత మందికి ఈ పండుగ గురించి తెలియజేస్తుంది,” అని బిల్లును రూపొందించిన ఆష్ కల్రా అన్నారు.
దీపావళి పండుగ శుభాకాంక్షలు, శాంతి మరియు పునరుద్ధరణ సందేశంతో సమాజాలను ఏకం చేస్తుందని ఆయన తెలిపారు. కాలిఫోర్నియా కంటే ముందు 2024 అక్టోబర్‌లో పెన్సిల్వేనియా దీపావళికి సెలవు ప్రకటించిన మొదటి రాష్ట్రంగా నిలిచింది. ఈ ఏడాది కనెక్టికట్ ఆ జాబితాలో చేరగా, ఇప్పుడు కాలిఫోర్నియా ఆ ఘనత సాధించింది. న్యూయార్క్ నగరంలో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలకు దీపావళి సెలవుగా ఉంది.
కాలిఫోర్నియా నిర్ణయాన్ని డయాస్పోరా సంస్థలు, కమ్యూనిటీ నాయకులు స్వాగతించారు. అమెరికాలోనే అత్యధిక జనాభా కలిగిన కాలిఫోర్నియా ఈ గుర్తింపు ఇవ్వడం.. సాంస్కృతిక ఏకీకరణ దిశగా భారతీయ అమెరికన్ల ప్రయాణంలో ఒక ముఖ్య మైలురాయి అని ఇండియాస్పోరా సంస్థ పేర్కొంది. ఈ చారిత్రక నిర్ణయం కాలిఫోర్నియా అభివృద్ధికి దోహదపడిన భారతీయ అమెరికన్ల తరాలకు దక్కిన గౌరవం అని సంస్థ వ్యవస్థాపకులు ఎం.ఆర్. రంగస్వామి తెలిపారు.

