Saturday, July 12, 2025
Homeఇంటర్నేషనల్RS 12Lakh Per Child Scheme : పిల్లల్ని కనితే డబ్బులిచ్చే స్కీమ్!

RS 12Lakh Per Child Scheme : పిల్లల్ని కనితే డబ్బులిచ్చే స్కీమ్!

How China is Spending Big to Have More Babies: రెండో బిడ్డ పుడితే రూ.6 లక్షలు.. మూడో సంతానానికి ఏకంగా రూ.12 లక్షలు! ఇది ఎక్కడో తెలుసా? డ్రాగన్ దేశం చైనాలో జనాభా సంక్షోభాన్ని అధిగమించేందుకు తీసుకున్న సంచలన నిర్ణయమిది. ఒకప్పుడు ‘ఒకే బిడ్డ’ విధానంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన చైనా, ఇప్పుడు సంతానోత్పత్తి రేటు పడిపోవడంతో భారీ నగదు ప్రోత్సాహకాలతో ప్రజలను ఆకర్షిస్తోంది. దీని వెనుక కారణాలు ఏంటి..? తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదవండి..!

తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది : చైనా దశాబ్దాలుగా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉంది. అయితే, ఇటీవల కాలంలో జనాభా పెరుగుదల రేటు గణనీయంగా పడిపోవడంతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు చైనా ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా, భారీ నగదు ప్రోత్సాహకాలను ప్రకటించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

కొత్త పథకాలు, నగదు ప్రోత్సాహకాలు : డ్రాగన్ దేశ ప్రభుత్వం 2025 జనవరి 1 తర్వాత పుట్టిన పిల్లలకి సంవత్సరానికి 42 వేల యువాన్లు ( సుమారు రూ. 4.8 లక్షలు) ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రోత్సాహకాన్ని చిన్నారికి మూడేళ్లు వచ్చే వరకు కొనసాగించనున్నారు. ఇది దేశవ్యాప్తంగా అమలు చేయాలని సన్నాహాకాలు చేస్తోంది. దీనికి తోడు, చైనాలోని కొన్ని నగరాలు, ప్రాంతీయ ప్రభుత్వాలు మరింత ఉదారంగా ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ఉదాహరణకు, హోహోట్‌, టియాన్మెన్‌ వంటి నగరాల్లో స్థానిక ప్రభుత్వాలు:

రెండో బిడ్డకు: సుమారు రూ.6 లక్షల వరకు నగదు ప్రోత్సాహకాలు.

మూడో సంతానానికి: ఏకంగా రూ.12 లక్షల వరకు నగదు ప్రోత్సాహకాలు.

చైనాలో సంతానోత్పత్తి రేటు తగ్గడానికి కారణాలు :  ‘ఒకే బిడ్డ’ విధానాన్ని చైనా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కఠినంగా అమలు చేసిన ‘ఒకే బిడ్డ’ విధానం జనాభా పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపింది. 2016 జనవరి 1న ఈ విధానానికి స్వస్తి పలికి, ఇద్దరు పిల్లలను కనేందుకు అనుమతించింది. ఆ తర్వాత మూడో బిడ్డకు కూడా అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ, పిల్లలను కనేందుకు చైనీయులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

పెరిగిన జీవన వ్యయం: పిల్లల పెంపకం, విద్య, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం తల్లిదండ్రులకు ఆర్థిక భారాన్ని పెంచుతోంది.

కెరీర్ ఆకాంక్షలు: యువతరం తమ కెరీర్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం, పిల్లలను కనడం వల్ల వచ్చే అడ్డంకులను నివారించాలని కోరుకుంటున్నారు.

వివాహాల రేటు తగ్గుదల: రికార్డు స్థాయిలో వివాహాల రేట్లు పడిపోవడం కూడా సంతానోత్పత్తి రేటు తగ్గడానికి ఒక ప్రధాన కారణం. ఈ కారణాల వల్ల చైనాలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గుతోంది. గత ఏడాది చైనా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం అనే హోదాను కోల్పోయి, రెండో స్థానానికి పడిపోయింది.

ప్రభుత్వ చర్యలు, భవిష్యత్ అంచనాలు: జనాభా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు చైనా ప్రభుత్వం కేవలం నగదు ప్రోత్సాహకాలకే పరిమితం కావడం లేదు. చైల్డ్ కేర్ స్లాట్లతో పాటుగా, వారి పని గంటలపై పరిమితులు విధించేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ ప్రోత్సాహకాలు పొందుతున్న ప్రజలు ఇవి తమకు ఎంతగానో దోహదపడుతున్నాయని చెబుతున్నారు. అయితే, ఇన్నర్ మంగోలియాలోని పలు ప్రాంతాల్లో నగదు ప్రోత్సాహకాలు ఇచ్చినప్పటికీ ప్రజలు పిల్లలను కనేందుకు ఇప్పటికీ అనాసక్తిగా ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి.

జననాల సంఖ్యలో భారీ క్షీణత కనిపిస్తోంది. 2016లో జననాల సంఖ్య 1.8 కోట్లుగా ఉండగా, గతేడాది అది 95 లక్షలకు తగ్గిపోయింది. ఐరాస అంచనాల ప్రకారం, ప్రస్తుత జనాభా తగ్గుదల కొనసాగితే చైనా 2050 నాటికి 130 కోట్లు, 2100 నాటికి 80 కోట్లకు చేరనుంది. ఈ అంచనాలు చైనా ప్రభుత్వంపై మరింత ఒత్తిడిని పెంచుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News